Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

న్యూఢిల్లీ: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఏడాది చేపట్టిన తొలివిడత భారత్ జోడో యాత్ర (Bharat Jodi Yatra) విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది..

ఇదే ఉత్సాహంతో ''భారత్ జోడో యాత్ర రెండో దశ''కు ఆ పార్టీ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ''భారత్ జోడో యాత్ర 2.0'' మొదలయ్యే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించి 2023 జనవరి 30న కశ్మీర్‌లో ముగించారు. 4,081 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది.

కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర కొత్త ఊపిరిలిచ్చింది. దీంతో 'భారత్ జోడో యాత్ర 2.0'కు ఆలోచన చేస్తున్నట్టు ఆ పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించాలని ఇటీవల పునర్వవస్థీకరించిన సీడబ్ల్యూసీ తొలి సమావేశం కోరింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తెలిపారు..

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలివిడత 'భారత్ జోడో యాత్ర'లో ఆయన 12 బహిరంగ సమావేశాల్లో, 100కు పైగా వీధి సమావేశాల్లో, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన ఆదిత్య థాకరే, ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే తదితరులు రాహుల్ యాత్రలో ఉత్సాహాన్ని నింపారు..

ఓటు వజ్రయుధం అమ్ముకోవద్దు:సీఎం కెసిఆర్

మందమర్రిలోమంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు.

మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిసింది కాంగ్రెస్ పార్టే. తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవి.

సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాం. రైతు బంధు వద్దు.. ధరణి పోర్టల్ వద్దు, కరెంటు వద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

వీటన్నింటినీ తీసేసి మళ్లీ దళారుల, పైరవీకారుల రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు. ఇక, నరేంద్ర మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.అన్నారు..

చెన్నూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కెసిఆర్ మాట్లాడుతూ..బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు. సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి” అని కేసీఆర్ పేర్కొన్నారు......

CM Jagan: రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..

శ్రీసత్యసాయి: రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jaganmohan Reddy) అన్నారు. మంగళవారం పుట్టపర్తిలో వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

53 నెలల్లో గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం హయాంలో జరగని విధంగా చూడని విధంగా రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా 53 లక్షల మంది రైతులకు 13500 ఇచ్చామని చెప్పారు.

పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే అని అన్నారు. పంటల భీమాకు ప్రీమియం చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా ఉంటున్నామన్నారు..

దేవుడు దయతో ఐదు సంవత్సరాలు ఎక్కడా కరువు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాలు కరువే కరువు అంటూ వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గతంలో చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. ''కరువు రావడం రాకపోవడం మన చేతుల్లో ఉండదు... ఆదుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది'' అని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ద్వారా ప్రత్యేక ఎకరా నమోదు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు..

Chandrababu: ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు.. కొనసాగుతున్న కంటి ఆపరేషన్

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మంగళవారం ఉదయం ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి (LV Prasad Hospital) చేరుకున్నారు..

ప్రస్తుతం చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. నిన్న(మంగళవారం) ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) టీడీపీ అధినేతకు వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.

కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు అవసరం వైద్యులు సూచించడంతో ఆ తరువాతి రోజు టీడీపీ అధినేత హైదరాబాద్‌కు వచ్చారు.

రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్‌కు వెళ్లగా బాబుకు వైద్యులు కంటికి సంబంధించిన పరీక్షలు చేశారు. ఈరోజు బాబు కంటికి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. అలాగే నిన్న మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు చేశారు. ప్రస్తుతం నేడు ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి శస్త్ర చికిత్స కొనసాగుతోంది. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే..

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

కారులో నుంచి దిగి తనిఖీలకు కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు...

Xerox Registrations: ఏపీలో ఇవాళ్టి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం అమలు..

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జిరాక్స్‌ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేయగా..

నేటి నుంచి రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు. అయితే ఈ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా కొనసాగుతున్నాయని.. పలుసార్లు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు రిజిస్ట్రేషన్ల అధికారులు వెల్లడిస్తున్నారు..

ఇక, విశాఖపట్నంలో ఉన్న 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిపి గతంలో ప్రతి రోజు 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి.. కానీ, గత వారం క్రింద స్టార్ట్ చేసిన జిరాక్స్‌ రిజిస్ట్రేషన్ల విధానంలో 9 ఆఫీసుల్లో కలిపి రోజుకి 20 కూడా కావడం లేదని తెలిపారు.

అలాగే, విజయవాడలోని మూడు కార్యాలయాల్లోనూ జరిగే రిజిస్ట్రేషన్లు వేళ్లపై లెక్కించవచ్చు అని అక్కడి అధికారులు అంటున్నారు. అయితే, ఇక్కడ ఈ విధానాన్ని దాదాపు నెలన్నర నుంచి కొనసాగిస్తున్న అందులో పెద్దగా మార్పులు కనిపించడం లేదని వాపోతున్నారు. దీని వల్ల ఎదురౌతున్న సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది..

బిజెపి నాలుగో జాబితా విడుదల

తెలంగాణలో బిజెపి పార్టీ జోష్ తో ఎన్నికలకు సిద్ధమవుతుంది, ఈ నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది.

బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో ఒక్కరు, ఒకటో జాబితాలో 52 మందిని విడుదల చేసింది.

ఇప్పటివరకు నాలుగు జాబితాలలో కలిసిమొత్తం వంద మంది అభ్యర్థులను విడుదల చేసింది...

నాలుగో జాబితా అభ్యర్థుల వివరాలు

1.చెన్నూరు (ఎస్‌సి)- దుర్గం అశోక్

2.ఎల్లారెడ్డి-సుభాష్ రెడ్డి

3. వేములవాడ- తుల ఉమ

4. హుస్నాబాద్-బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

5. సిద్దిపేట- దూది శ్రీకాంత్ రెడ్డి

6. వికారాబాద్ (ఎస్‌సి)- పెద్దింటి నవీన్ కుమార్

7. కొడంగల్ – బంతు రమేష్ కుమార్

8. గద్వాల్- బోయ శివ

9. మిర్యాలగూడ-శెడినేని శ్రీనివాస్

10.మునుగోడు-చల్లమల్ల క్రిష్ణా రెడ్డి

11. నకిరేకల్ (ఎస్‌సి)- మొగులయ్య

12. ములుగు (ఎస్‌టి)-ప్రహ్లాద్ నాయక్

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన సెగలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్త సెగలతో రగిలిపోతున్నారు.

తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టారు.పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు ఇవ్వడంతో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు భగ్గుమన్నారు.

ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు యత్నించారు. టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్‌కు ఇవ్వాలని పెద్ద ఆందోళనకు దిగారు.

రేవంత్ రెడ్డి డబ్బులకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాట శ్రీనివాస్ గౌడ్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

టికెట్ దక్కని ఆశవహుల ఆందోళనలను నిన్నటి వరకు గాందీభవన్ వరకే పరిమితం కాగా..ఇవాళ ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకే చేరుకోవడం తో ఉద్ధృతద వాతావరణం నెలకొంది...

కెసిఆర్ సభకు పెద్దపెల్లి జిల్లా గులాబీమయం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది.

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానం గులాబీ జెండాలు, తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్లతో ముస్తాబయింది.

మధ్యాహ్నం మూడు గంటలకు జూనియర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు కేసీఆర్ సభకు హాజరుకాన్నారు. ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు..

పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ సర్కార్ మనకెందుకు: బండి సంజయ్

బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తే గాని నిరుద్యోగులకు న్యాయం జరగదని,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగులకు సూచించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు గత పదేళ్లుగా పడ్డ కష్టాలు మర్చిపోవద్దన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ సర్కార్ బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు.

నిరుద్యోగుల కోసం బీజేపీ నేతలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వీరంతా బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

మంత్రి కేటీఆర్‌కు అహంకారం ఎక్కువైందని విమర్శించారు.కేటీఆర్ జాబ్ క్యాలెండర్‌పై ఇప్పుడు హామీలు ఇస్తున్నాడు.. పది సంవత్సరాల నుండి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలవకుండా కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి దీమా వ్యక్తం చేశారు.