మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఊరట

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది.

ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దానిని మంగళవారం కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు..

ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంక పాకిస్తాన్ నేడు కీలక పోరు

వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది.

లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో ఉప్పల్‌లోనే జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సోమవారం ముమ్మర సాధన చేశాయి. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన లంక ఈసారి మాత్రం విజయమే లక్షంగా పెట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో లంకను కలవరానికి గురిచేస్తోంది.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో రజిత, మధుశంకా, పతిరణ, వెల్లలాగే తదితరులు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం లంక కాస్త పర్వాలేదనిపించింది. కుశాల్ మెండిస్ 42 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జట్టుకు కలిసి వచ్చే అంశమే.

అసలంక, కెప్టెన్ శనక కూడా బ్యాట్‌ను ఝులిపించారు. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు.

ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు విఫలమయ్యారు. కానీ వికెట్ కీపర్ రిజ్వాన్, సౌద్ షకిల్, నవాజ్, షాదాబ్‌లు ధాటిగా ఆడడం పాక్‌కు ఊరటనిచ్చే అంశమే. బౌలింగ్‌లో పాక్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాక్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు.

కెసిఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు..ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని సీఎం సతీమణి శోభ శ్రీవారిని కోరుకున్నట్టు తెలిసింది..

తిరుమలలో సర్వ సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, సోమవారం శ్రీవారిని 68,828 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 28,768 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు......

తెలంగాణ లో పోలీసుల ముమ్మర తలిఖీలు పట్టుబడిన 5 లక్షల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫలితంగా.. ఎన్నికల కోడ్ కూడా నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఇంకేముంది.. ఓవైపు ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఇదంతా ఒకవైపు మాత్రమే.. ఇంకోవైపు రాజకీయ నాయకుల ప్రచారాలు, వ్యూహాలు నడుస్తూనే ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే అక్రమ మద్యం, నగదు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. కాగా.. ఈ ఎన్నికల్లో ఇలాంటి వాటికి ఏమాత్రం చోటివ్వకుండా కఠిన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలు కావటంతో.. తనిఖీలు కూడా మొదలుపెట్టేశారు అధికారులు. అంతేనా.. ఎన్నిక కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది సేపటికే తనిఖీల్లో బోణీ నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలోని వైరాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఓ కారును ఆపి చెక్ చేశారు. కాగా.. ఆ కారులో రూ.5 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు .

ఆంధ్రప్రదేశ్‌లో వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌కు ఇమ్మని రాజేశ్వరి తన వ్యవసాయ భూమికి చెందిన 5 లక్షల రూపాయలు తీసుకొని కారులో హైదరాబాద్ వెళ్తుండగా వైరా రింగ్ రోడ్ సెంటర్‌లో వైరా ఎస్సై మేడ ప్రసాద్ వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. ఎలాంటి అనుమతి పత్రాలు లేవని నగదు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న 5 లక్షల రూపాయల నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు

ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసీ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

షెడ్యూల్ విడుదలకు ముందే.. సుమారు 14 వేల లీటర్లకు పైగా అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అయితే.. ఇదంతా అక్టోబర్ 5 న జరిగిన సమీక్షా సమావేశం తర్వాత నుంచి చేసిన తనిఖీల్లోనే ఇంత మద్యాన్ని పట్టుకున్నారు. అంతేకాదు 170 కిలోల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది: కేఏ పాల్

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విశాఖపట్నంలోఅయన పర్యటించారు..

ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ ఎన్నికలో మా పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తాను. నేను దేశం, మన తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా ఆపేశారు.

ఏపీలో బీజేపీ పార్టీ లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనల గొడవలు ఆగిపోవలని దేవుడికి ప్రార్థన చేశా. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలి. డిసెంబర్10 తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాం.

గ్లోబల్ క్రిస్మస్ వేడుకలకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 10వ తేదీన ఇక్కడ నుంచే 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తాను’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.

నేడు తెలంగాణకు అమిత్ షా!!

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ రోజు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా అమిత్‌ షా సభను బీజేపీ నిర్వహించనుంది..

అమిత్‌ షా షెడ్యూల్‌:

మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు అమిత్ షా

2.35కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు.

4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.

5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

5. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం

6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కుబయల్దేరనున్నారు.

6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది.

రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలోబీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌ షా సమావేశం

రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ

రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం

*9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు..

నేడు మోగనున్న తెలంగాణ ఎన్నికల నగారా?

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత ఎన్నికల సంఘం అధికారులు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

కాగా, గత నెల రోజులుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న సీఈసీ.. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే అత్యంత కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సీఈసీ నిర్ణయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి...

నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల ?*

- మధ్యాహ్నం 12గంటలకు ముహూర్తం

- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌, డిసెంబర్‌లో పోలింగ్‌ జరగవచ్చని తెలుస్తోంది. వెలువడుతున్నాయి. డిసెంబర్‌ రెండో వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో, తెలంగాణలో ఎన్నికల టెన్షన్ మొదలైంది.

నేడే ఎన్నికల షెడ్యూల్:

తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది సేపట్లో విడుదల కానుంది. కొద్ది రోజులుగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందింది. ఈ మేరకు ఈ మధ్నాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసారు.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 10 -15 మధ్యలో ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల తరహాలోనే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఈ మేరకు ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు సమీక్షలు చేసారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ పైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటంతో పాటుగా ఓటర్ల జాబితాను ఫైనల్ చేసారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటన ద్వారా వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది. ఫలితాల ప్రకటన వరకు పూర్తిగా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఈ అయిదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగాల్సి ఉంటుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దం అయ్యాయి.

జాతీయ స్థాయిలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఆ కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇక, బీజేపీ సార్వత్రిక ఎన్నికల ముందు తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఇక దేశం మొత్తం ఇదే రకమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ - కాంగ్రెస్ హోరా హోరీ తప్పదనే అభిప్రాయం ఉంది. ఇక, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో ఉంది. తెలంగాణలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కానుండటంతో..ఇక రాజకీయ సమరానికి పార్టీలు సై అంటున్నాయి.

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దంచికొట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్ 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియాకు 2 పాయింట్లు లభించాయి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.కాగా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇద్దరూ ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఐదు పదార్థాలతో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆరంభం అంతగా బాగోలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ జీరో పరుగులకే పెవిలియన్ చేరారు. టీమిండియా స్కోర్ 2 పరుగుల వద్ద ఔటయ్యారు.

దీని తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ విజయం సాధించింది. విరాట్ 85 పరుగులు, రాహుల్ 97 పరుగులు చేశారు. రాహుల్ సిక్సర్ కొట్టి భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించాడు..