చంద్రబాబు కేసు నేడు మూడు కోర్టుల్లో విచారణ బెయిలా? జైలా?

చంద్రబాబుకు సోమవారం బెయిల్‌ వస్తుందా?రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టు లో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫైబర్‌నెట్‌, అంగళ్లు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

అలాగే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.

దీంతో పాటు టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా నిర్ణయం ప్రకటించనుంది. కాగా.. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు లో సోమవారమే విచారణ జరుగనుంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు టీడీపీ అధినేతపై దాఖలైన ఇతర కేసులపైనా ప్రభావం చూపనున్నాయి. దీంతో సోమవారం ఆయనకు, టీడీపీకి, ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకంగా మారింది...

నేడు భూపాలపల్లి జిల్లా లో మంత్రి కేటీఆర్ పర్యటన

భూపాలపల్లి జిల్లాలోనేడు సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి హెలీక్యాప్టర్లో ఆయన భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు.

సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం , సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొంటారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత ర్యాలీ గా బయలు దేరి సుభాష్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మ్ముఖ్య అతిథులు, అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

కాగా మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, కలెక్టర్ భవేస్ మిశ్రా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Telangana BJP: భాజపా ప్రకటించే తొలి జాబితా ఇదేనా?

హైదరాబాద్‌: తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా (Telangana BJP) ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపించింది..

ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో.. అమావాస్య తరువాత ఈ నెల 15 లేదా 16న 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఏకాభిప్రాయం కుదరని మిగితా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది.

అయితే, భాజపా ప్రకటించే 38 మందితో కూడిన తొలి జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై భాజపా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అంబర్‌పేట - కిషన్ రెడ్డి

ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి

సనత్‌నగర్‌ - మర్రి శశిధర్ రెడ్డి

ఉప్పల్ - ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

మల్కాజిగిరి - రాంచందర్‌రావు

ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

గోషామహల్ - విక్రమ్‌ గౌడ్

మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

కల్వకుర్తి - తల్లోజు ఆచారి

గద్వాల - డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ - జితేందర్ రెడ్డి

తాండూరు - కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్

కుత్బుల్లాపూర్‌ - కూన శ్రీశైలం గౌడ్

భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

ఆలేరు - కాసం వెంకటేశ్వర్లు

హుజురాబాద్ - ఈటల రాజేందర్

కరీంనగర్ - బండి సంజయ్

చొప్పదండి - బొడిగే శోభ

వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు

భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి

వేములవాడ - చెన్నమనేని వికాస్‌ రావు

ఆదిలాబాద్‌ - పాయల్‌ శంకర్‌

బోథ్‌ - సోయం బాపూరావు

ఆర్మూర్ - ధర్మపురి అర్వింద్‌

మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర్లు

పరకాల - గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

దుబ్బాక - రఘునందన్ రావు

వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్

మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్

సికింద్రాబాద్ - బండ కార్తీక రెడ్డి

నర్సంపేట - రేవూరి ప్రకాశ్ రెడ్డి

నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

వరంగల్‌ పశ్చిమ - ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

స్టేషన్‌ ఘన్‌పూర్‌ - విజయరామారావు

రాజేంద్రనగర్‌ - తోకల శ్రీనివాస్‌ రెడ్డి

TS News: తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం అనిశా డైరెక్టర్‌గా ఉన్న ఏఆర్‌ శ్రీనివాస్‌ను రాష్ట్ర పోలీసు అకాడమీ అదనపు డైరెక్టర్‌గా నియమించారు..

హోం గార్డ్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ అంబర్ కిషోర్ ఝాను రాచకొండ జాయింట్ కమిషర్‌గా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ

ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏసిబి డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ శ్రీనివాస్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా, డిఐజి హోంగార్డ్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న అంబర్ కిషోర్ జా ను రాచకొండ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపో, ఎల్లుండో షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు..

ఆస్ట్రేలియా బ్యాట్స్ మేన్ కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు ఆల్రౌండ్ ప్రతిభ చూపుతోంది. అటు బౌలింగ్ .. ఇటు ఫీల్డింగ్ పరంగా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. ఇక.. ఈ మ్యాచ్లో బౌలర్ రవీంద్ర జడేజా స్పిన్నింగ్ మ్యాజిక్ భలేగా వర్కవుట్ అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. సెకండ్ బ్యాటింగ్కు దిగనున్న భారత జట్టు ముందు 200 పరుగుల లక్ష్యం ఉంది..

‌‌ఆట ప్రారంభంలో 6 బంతులు మాత్రమే ఆడిన మిచెల్ మార్ష్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. వరల్డ్ కప్‌‌ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ని ఆదిలోనే డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు..

ఆ తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలోపడ్డారు. రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, ఏబీ డివిల్లియర్స్ రికార్డులను ఇవ్వాల జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ బ్రేక్ చేశాడు..

52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

క్లియర్‌గా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకుని ఓ రివ్యూని లబుషేన్ వేస్ట్ చేశాడు. అదే ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండు బంతులాడిన అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు.

భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత జట్టు ఫీల్డింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. 21.4 నుంచి 31.5 ఓవర్ల మధ్య 12.1 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం..

టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ,టీఎస్ఆర్టీసీ, చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టారు..

హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, , ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి.. సన్మానించారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్, నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు.

తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.

సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు చైర్మన్ యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా, ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు.

ఆయన పదవీకాలం ముగిసింది. ముత్తిరెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక భాషల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేస్తున్నాయి. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించి ఏపీ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

రెండు సివిల్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన జస్జిస్ మన్మథరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రెండు సివిల్ కేసుల విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. విచారణ అనంతరం తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి మన్మథరావు.

ఇటీవల క్రింది స్థాయి కోర్టులు స్థానిక భాషల్లో ఆదేశాలు ఇవ్వచ్చొని సుప్రీం సూచించింది. ఈనేపథ్యంలోనే ఇష్టపూర్వకంగా తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి. తీర్పుకు సంబంధించిన తెలుగు ఆర్డర్ కాపీని వెబ్ సైట్‌లో పెట్టింది హైకోర్టు.

వాస్తవానికి సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే వెలువరించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాష లో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు. అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు జైలుకెళ్లడంతో టిడిపి నేతలకు పిచ్చి పట్టింది: మంత్రి రోజా

టిడిపి నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మంత్రి రోజా తెలిపారు. ఆదివారం బండారుకు రీకౌంటర్ ఇచ్చారు.

న్యాయపరంగా పోరాడతానని, బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. మహిళలను కించపరిస్తే చరిత్రరహీనులుగా మిగిలిపోతారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడంతో టిడిపి నేతలకు పిచ్చెక్కిందని, బాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారని రోజా విమర్శించారు.

టిడిపి ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే తనని టార్గెట్ చేశారని, టిడిపి, జనసేనకు దిగజారుడు రాజకీయలు మాత్రమే తెలుసునని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు...

అఫ్గానిస్థాన్ భూకంపంలో రెండు వేలు దాటిన మృతుల సంఖ్య

అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఆదివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది.

ఈ విపత్తులో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వీడియాకు వెల్లడించారు.

భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా వీటిలో అయిదు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

ఈ ప్రమాదంలో ఎన్నో భవనాలు నెలమట్టం అయ్యాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భూకంప కేంద్రమైన హెరాత్‌ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..