Nara Brahmani: చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు: నారా బ్రాహ్మణి ట్వీట్‌

అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) అన్నారు..

చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

''మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు.

కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?

అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం.

రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం'' అని బ్రాహ్మణి పేర్కొన్నారు..

Assembly elections: అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. అక్టోబర్‌ 8-10 మధ్య షెడ్యూల్‌ ప్రకటన?

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం (EC) ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి..

ఈ ఏడాది తెలంగాణ(Telangana), రాజస్థాన్‌(Rajasthan), మిజోరం(Mizoram), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి.

తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి..

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు దిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది.

ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం తెలిసిందే..

Breakfast Scheme: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులతో టిఫిన్‌ చేసిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా సర్కార్‌ తీసుకొచ్చిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది..

వివిధ జిల్లాల్లో ఈ పథకాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

అల్పాహార పథకం పేద పిల్లలకు వరమన్న మంత్రులు.. మఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణం ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిని.. కాసేపు వారితో ముచ్చటించారు. వారికి మంత్రి కేటీఆర్‌ అల్పాహారాన్ని వడ్డించారు. విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రోజుకో పౌష్టికాహారాన్ని వడ్డించనున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమన్నారు..

రేపు నారా లోకేష్ చంద్ర‌బాబుతో ములాఖ‌త్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన టీడీపీ యువనేత ఇరవై రోజులకు పైగా అక్కడే ఉన్నారు. న్యాయవాదులు, జాతీయ నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు.

నిన్న ఆయన విజయవాడ చేరుకున్నారు. లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. వాహనాలపై వస్తోన్న కార్యకర్తలను మధ్యలోనే పోలీసులు అడ్డగించారు. దీంతో కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపై వదిలి, నడుచుకుంటూనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యువనేతకు ఘన స్వాగతం పలికారు.

అనంత‌రం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

సిరియాలో ఉగ్ర దాడి :100 మందికి పైగా మృతి

సిరియాలో మరోసారి ఉగ్రవాదులుశుక్రవారం భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు.

ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు..ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం.

.మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో దాడి చేశారు.

వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది....

హైదరాబాద్‌లో రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేట్, శంషాబాద్ కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.

అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్ల పై రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి.కూకట్‌పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లండన్‌ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

లండన్‌లో మహిళా రిజర్వేషన్‌ చట్టం అంశంపై జరిగే సదస్సులో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం సాయంత్రం లండన్ వెళ్లారు.

బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఆ సదస్సులో కవిత ప్రసంగించనున్నారు. అలాగే శనివారం నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ అండ్‌ అలుమిని యూనియన్‌ యూకే ఆఽధ్వర్యంలో చేపట్టే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత మాట్లాడనున్నారు

తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది,

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఇక శ్రీవారికి 29,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి వరుసలో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబ‌ర్ 13వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.

ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే తెలంగాణ‌లోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని వెల్లడించింది.

తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా.. ఈసారి మాత్రం 13 రోజులే ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రజలు అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది...

2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్‌.. తర్వాత ఏంటి?

రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్‌ 30తో గడువు తీరబోతోంది..

ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్‌ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి?

ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు..

పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో రూ.2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. 'క్లీన్‌ నోట్‌ పాలసీ'లో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది.

నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గానే (నోట్లకు చట్టబద్ధత) రూ.2వేల నోటు కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్‌ బంకులు రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి.

వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ దాదాపు 4 నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 1 నాటికే దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే, నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్‌ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు..

Streetbuzz News

Streetbuzz News