NLG: మహిళా హక్కుల పరిరక్షణకై కదలిరావాలి, అక్టోబర్ 5న చలో ఢిల్లీ: పిలుపునిచ్చిన మల్లు లక్ష్మి
మహిళా హక్కుల పరిరక్షణకై అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అక్టోబర్ 5 న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని, మహిళా లోకానికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని, మహిళా హక్కులు కాలరాయబడుతున్నాయని ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు. పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా, ఆచరణలో ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. దేశంలో మహిళలపై ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మేలుకొని ఒక చట్టాన్ని రూపొందించి వదిలేస్తున్నాయన్నారు. బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందని విమర్శించారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ, మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం, మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మహిళలపై గౌరవం ఉంటే మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బిజెపి ఎందుకు అరికట్టడం లేదో ఈ సమాజానికి స్పష్టం చేయాలన్నారు.
మహిళపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా తలపెట్టిన అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మహిళలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఐద్వా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Sep 22 2023, 20:42