భాగ్యనగరం.. భూమి బంగారం
భాగ్యనగరం.. భూమి బంగారం
కోన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి..
కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది.
పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం..
నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్
ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా డెవలప్‌మెంట్ 'రింగ్’
ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం
మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం
అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం
పదేండ్లలోనే పదుల కిలోమీటర్లమేర విస్తరణ
ఎల్లలులేని నగరం.. భూములకు భారీ ధరలు
దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామం
చుట్టూ టౌన్‌షిప్పులతో పంచరంగుల సౌధాలు
'రియల్’ భవితకు కేంద్రబిందువుగా మహానగరం
కొన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది.
తెలంగాణ సర్కారు రీజినల్ రింగ్ రోడ్డు లక్ష్యంగా అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు కల్పిస్తుండటంతో అనతికాలంలోనే భాగ్యనగరం.. విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. దేశంలో ఏ నగరానికీ లేనివిధంగా చుట్టూ కిలోమీటర్ల మేర భూములు ఉండగా.. ఎల్లలులేకుండా విస్తరిస్తున్నది.
సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ నిరంతర పరి'శ్రమ'తో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయంగా మారి శాటిలైట్ టౌన్‌షిప్పులతో పంచరంగుల సౌధంగా రూపుదిద్దుకొంటున్నది. 'రియల్’ భవిష్యత్తుకు కేంద్రబిందువుగా మారుతున్నది.
హైదరాబాద్‌లో పదిహేనేండ్ల కిందట గచ్చిబౌలి.. పటాన్‌చెరు.. బోయిన్‌పల్లి.. ఉప్పల్.. ఎల్బీనగర్‌లాంటి ప్రాంతాలు దాటితే జనావాసాలు చాలా తక్కువగా కనిపించేవి. తర్వాత ఆయా మార్గాల్లోని గ్రామాలు వచ్చేవి. కానీ గత తొమ్మిదన్నరేండ్లుగా పట్టణీకరణ.. ఔటర్ రింగు రోడ్డును దాటిపోయింది. తెలంగాణ సర్కారు ఎస్సార్డీపీ కింద భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని చేపట్టడంతో నిమిషాల వ్యవధిలో ప్రధాన నగరంలోకి రాకపోకలు సులువుగా మారడంతో జనాలు అవుటర్ దాటి నివాసాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. ప్రధానంగా ఇన్నర్-ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధాన రోడ్లు (లింక్ రోడ్స్), మెట్రో రైలు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి.
తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఇందుకు తొమ్మిదిన్నరేండ్లలో ఏకంగా రూ.90 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. వచ్చే మూడేండ్లలో మరో రూ. 80 వేల కోట్ల నుంచి 90 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించి, పక్కాగా అమలు చేస్తున్నది. ఇదే సమయంలో దేశంలోని ఇతర మెట్రోల నగరాలను తీసుకొంటే.. హైదరాబాద్‌తో పోల్చితే అన్నీ ప్రతికూల అంశాలే కనిపిస్తున్నాయి. ప్రతి నగరం ఏదో ఒక కీలకమైన మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది.
తమిళనాడు రాజధాని చెన్నైలో అక్కడి జనాభాకు అనుగుణంగా నీటిని అందించే పరిస్థితి లేదు. కృష్ణాజలాల కోసం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలను అభ్యర్థించాల్సిన దుస్థితి. కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకవైపు ట్రాఫిక్ సమస్య వెంటాడుతుంటే.. మరోవైపు కరెంటు కోతలు కుదేలు చేస్తున్నాయి. మహారాష్ట్రలోని పుణె రోజుకు ఎనిమిది గంటల వరకు విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్నది. ముంబై, చెన్నైలకు మహానగరాలుగా పేరున్నా చిన్నపాటి వర్షానికే అతలాకుతలమవుతున్నాయి. వీటన్నింటికీ హైదరాబాద్ భిన్నంగా ఉన్నది. సకల వసతులతో అలరారుతుండడంతో ఇక్కడికి అంతర్జాతీయ పెట్టుబడులు క్యూకడుతున్నాయి. ఫలితంగా నగరం ఎల్లలు లేకుండా విస్తరించి ఔటర్‌కు ఆవల భూముల రేట్లుకూడా వందలరెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ భూమిపై పెట్టుబడి పెట్టేవారికి భవిష్యత్తు అంతా బంగారుమయంగా కనిపిస్తున్నది.
ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా మౌలిక వసతులు
దేశంలోని ఇతర ఏ మెట్రో నగరాలు కూడా చుట్టూ (రేడియల్ డెవలప్‌మెంట్) విస్తరించేందుకు అవకాశం లేదు. చెన్నై, ముంబై ఆ రాష్ర్టాలకు ఒక కొనగా ఉండటంతోపాటు ఒకవైపు సముద్రం ఉన్నది. ఢిల్లీ విస్తరణ సాధ్యం కాక ప్రత్యేకంగా రీజియన్ ఏర్పాటుతో ఇతర రాష్ర్టాలకు అనుసంధానం అవుతున్నది. బెంగళూరు, కోల్‌కతాలాంటి నగరాలు కూడా ఆయా రాష్ర్టాలకు ఒక కొనగా ఉన్నాయి. కానీ హైదరాబాద్ వీటన్నింటికీ భిన్నం. చుట్టూ విస్తరించే భౌగోళిక అనుకూలత ఉండటంతోపాటు పుష్కలమైన ల్యాండ్ బ్యాంకు ఉంది. అందుకే సీఎం కేసీఆర్ ఈ అనుకూలతలను బలంగా చేసుకొని దేశంలోనే తిరుగులేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాన నగరంతోపాటు చుట్టూ ఔటర్ రింగు రోడ్డు వరకు మౌలిక వసతుల కల్పన చాలావరకు పూర్తయింది. తాగునీటి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అనుసంధాన రహదారులు దాదాపుగా పూర్తయ్యాయి. మెరుగైన విద్యుత్తు వ్యవస్థ సైతం అందుబాటులో ఉన్నది. కొంతమేర మిగిలి ఉన్న పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరం ఎంత మేర విస్తరించే అవకాశముందనే దానిపై ఇప్పటికే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆ మేరకు ప్రణాళికల అమలుకు సిద్ధమయ్యారు. ఔటర్‌కు చుట్టూ సుమారు 20-50 కిలోమీటర్ల పరిధి వరకు నిర్మించనున్న రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్‌ఆర్) లక్ష్యంగా విస్తరణ జరగనున్నది. అందుకు అనుగుణంగానే రూ.69,100 కోట్లతో మెట్రో విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. దీంతో ఇప్పుడున్న ఔటర్, మెట్రో విస్తరణ ప్రాజెక్టులతోపాటు భవిష్యత్తులో రానున్న రీజినల్ రింగ్‌రోడ్డు ఏకంగా ఎనిమిది జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారుల మీదుగా వెళ్లడమనేది హైదరాబాద్ విస్తరణలో అత్యంత కీలకమైన అంశం. విజయవాడ హైవే (ఎన్‌హెచ్-65)పై పెద్ద అంబర్‌పేట, ముంబై హైవే (ఎన్‌హెచ్-65)పై ఇస్నాపూర్, బెంగళూరు హైవే (ఎన్‌హెచ్-44)పై శంషాబాద్, నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ, వరంగల్ హైవే (ఎన్‌హెచ్-163)పై ఘట్‌కేసర్, శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్-765)పై తుక్కుగూడ, నర్సాపూర్ హైవే (ఎన్‌హెచ్-765డి)పై దుండిగల్, బీజాపూర్ హైవే (ఎన్‌హెచ్-163)పై టీఎస్ పోలీస్ అకాడమీ వద్ద కలుస్తున్నాయి. దీంతోపాటు రాజీవ్ రహదారిపై తూంకుంట-శామీర్‌పేట, నాగార్జునసాగర్ రహదారిపై బొంగుళూరు వద్ద మెట్రో కలుస్తుంది. తెలంగాణలోని ఏ మూల నుంచి నగరానికి రావాలన్నా వీటి మీదుగానే రావాలి. దీంతో హైదరాబాద్ మరింతంగా విస్తరించడంతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలతో అనుసంధాన ప్రక్రియ మరింత బలోపేతం కానున్నది.
ప్రతి ఇంటర్‌చేంజ్ ఒక నగరం
గతంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందం టే అక్కడ నివాసయోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కడ రవాణా వ్యవస్థ ఏర్పాటవుతుందో అక్కడ నగరాలు వెలుస్తున్నాయి. చైనాలోని షాంఘై నగరానికి దూరంగా పది వరుసల రహదారిని నిర్మించారు. దీంతో మూడేండ్ల వ్యవధిలోనే షాంఘైకి ధీటుగా మరో నగరం ఎదిగింది. అక్కడే కాదు.. హైదరాబాద్‌లోనూ అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు (ఎక్కేందుకు-దిగేందుకు వీలున్న చోటు) ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ఒక్కో నగరంగా ఎదిగాయి. డిమాండ్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నార్సింగి వద్ద ఒక ఇంటర్‌చేంజ్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు అదొక నగరంగా అవతరించింది. దీంతోపాటు కోకాపేట, మల్లంపేట వద్ద మరో రెండు ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ కూడా భూములు, నివాసయోగ్యాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంకా అనేకచోట్ల ఇంటర్‌చేంజ్‌లు కావాలంటూ ప్రభుత్వానికి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. రీజినల్ రింగు రోడ్డులోనూ సుమారు 23-24 ఇంటర్‌చేంజ్‌లు ప్రతిపాదిస్తుండగా.. అనేకచోట్ల మరిన్ని ఏర్పాటు చేయాలంటూ విపరీతమైన ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవుటర్‌కు అనుగుణంగా వచ్చే మెట్రో రైలు ప్రాజెక్టులో సుమారు 25 మెట్రో స్టేషన్లు రానుండటంతో అక్కడ కూడా మినీ నగరాలు ఏర్పాటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇంటర్‌చేంజ్‌లు అనేది కొత్త నగరాలకు పునాదులుగా మారుతున్నాయి
మెట్రోతో మారనున్న నగర ముఖచిత్రం
మెట్రో ఆఫ్ ప్యారిస్.. ప్రశాంతమైన నగర జీవితంతోపాటు ట్రాఫిక్ జంఝాటం, కాలుష్యానికి చెక్ పెడుతున్న మెట్రో మంత్రం ఇది. ఇక్కడ మెట్రోలో రోజుకు సుమారు 41 లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తారంటే ఆ ప్రజా రవాణా వ్యవస్థ ఎంత ప్రభావితంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రధాన నగరంతోపాటు నగరం చుట్టూ మెట్రో ఉంటుంది. దీంతో ప్రధానమంత్రి మొదలు సామాన్యుడి వరకు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాలవారు నగరంలో ఏ మూలకు పోవాలన్నా నగరం వెలుపలే తమ వాహనాలను పార్క్ చేసి.. మెట్రోల్లో ప్రయాణిస్తారు. నిమిషాల వ్యవధిలో గమ్యాలను చేరడంతోపాటు ఎక్కడా ట్రాఫిక్ నరకం అనేది ఉండదు. భవిష్యత్తులో హైదరాబాద్ నగర ముఖచిత్రం కూడా ఇలాగే మారబోతున్నది. ఔటర్ చుట్టూ మెట్రోతోపాటు ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్లకు తోడు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన నగరంలో మరో ఎనిమిది మార్గాలు రానున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సామర్థ్యం 186 మెట్రో స్టేషన్లతో 415 కిలోమీటర్లకు పెరగనున్నది. దీంతో ప్రధాన నగరంపై భారం తగ్గడంతోపాటు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గనున్నది. ఫలితంగా హైదరాబాద్ చుట్టూ వందలాది మినీ నగరాలు వెలిసి.. తెలంగాణ నలుమూలలకు నగరం అనుసంధానం కానున్నది. ప్రధానంగా కొత్తగా వచ్చే మెట్రో ప్రాజెక్టుల్లో స్టేషన్ల వద్ద ఎకరాల మేర పార్కింగ్ సదుపాయాన్ని కల్పించబోతున్నారు. దీంతో నగరం వెలుపల నుంచి వచ్చే వాహనాలు అక్కడే పార్క్ చేసుకొని మెట్రో ద్వారా నగరంలో పని చూసుకొని హాయిగా తిరిగి గమ్యస్థానాలకు వెళ్లే సౌకర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చుట్టూ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఓఆర్‌ఆర్, మెట్రో సేవలు విస్తరిస్తుండడంతో రియల్ వెంచర్లు ఔటర్ వెలుపలే వెలుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో చదరపు అడుగుల్లో భూమి లభిస్తుండగా.. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎకరాలు.. చదరపు గజాల్లో భూమి దొరుకుతున్నది. దీనికితోడు అన్ని రకాల మౌలిక వసతులు.. మెరుగైన ప్రజారవాణా ఉండడంతో ఇక్కడ భూమి భవిష్యత్తులో బంగారం కానున్నది. హైదరాబాద్ నగరం నలుచెరుగులా విస్తరించి.. ఇక్కడ భూములపై పెట్టుబడులు పెట్టేవారికి కల్పతరువుగా మారనున్నది.
యజ్ఞంలా రహదారుల అభివృద్ధి
హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్నది. పట్టణీకరణ నేపథ్యంలో మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నది. కానీ అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరగలేదు. 2000 సంవత్సరంలో సుమారు 54 లక్షల వరకు ఉన్న జనాభా ఇప్పుడు 1.20 కోట్లకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల హయాంలో ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఒక టర్మ్‌లో రెండు ఫ్లైఓవర్లు నిర్మించడమే గగనం. వాహనదారులు ఏండ్ల తరబడి నరకయాతన అనుభవిస్తే తప్ప ఒకటీ, రెండు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరగలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) చేపట్టింది. మహా నగరం నలుమూలలా రాబోయే 40-50 ఏండ్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఓ యజ్ఞంలా రహదారులను అభివృద్ధి చేస్తుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పడింది. దీంతో ఎల్బీనగర్, ఉప్పల్ జంక్షన్లు ఊహించనిరీతిలో దర్శనమిస్తున్నాయి. దేశానికే ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు ఓ వైపు ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. హైదరాబాద్‌లో సుఖవంత ప్రయాణం ఐటీ, వ్యాపార దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్నది. మహానగరం అంతర్జాతీయ మెప్పు పొందుతున్నది.
త్రిమణిహార నగరం
సమీప భవిష్యత్తులో హైదరాబాద్ దేశంలోనే ఏ మెట్రో నగరానికిలేని అద్భుతమైన హంగును సొంతం చేసుకోనున్నది. సాధారణంగా నగరాల చుట్టూ ఒక ఔటర్ రింగు రోడ్డు ఉంటుంది. కానీ సమీప భవిష్యత్తులోనే మూడు మణిహారాల నగరంగా హైదరాబాద్ అవతరించనున్నది. ఇప్పటికే నగరం చుట్టూ 158 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు ఒక మణిహారంలా ఉన్నది. రాబోయే మూడేండ్లలోనే మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగు రోడ్డును అనుసరించి మెట్రో మార్గం ఏర్పాటు కానున్నది. తద్వారా నగరానికి రెండో మణిహారం వస్తుంది. అలాగే, సుమారు 346 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు ఏర్పాటు కానున్నది. ఇది నగరానికి మూడో మణిహారంలా నిలువనున్నది. ఇలా మూడు మణిహారాలతో హైదరాబాద్ నగరం ఇతర ఏ మెట్రోలకు లేని హంగులతో అలరారనున్నది. ఇది కేవలం చూడటానికే కాదు.. దీని ద్వారా హైదరాబాద్ చుట్టూ దాదాపు 50-60 కిలోమీటర్ల వ్యాసంలో అభివృద్ధి వేగంగా విస్తరించనుండటంతో ప్రధాన నగరంపై భారం తగ్గుతుంది. నిమిషాల వ్యవధిలో నగరంలో ఏమూలకైనా ప్రయాణించే మెట్రో, రింగురోడ్డులు ఉండటంతో నగరానికి దూరంగా నివాసం ఉండేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. తద్వారా హైదరాబాద్ చుట్టూ ఎక్కడికక్కడ టౌన్‌షిప్‌లు ఏర్పాటవుతాయి. నగరం ఔటర్ ఆవలకు విస్తరించి విశ్వనగరంగా మారిపోనున్నది.
త్రిమణిహారాలు:1. ఔటర్ రింగ్‌రోడ్డు,
2. ఔటర్‌ను అనుసరిస్తూ ఏర్పాటుకానున్న మెట్రో,
3. 346 కిలోమీటర్లలో విస్తరించనున్న రీజినల్ రింగ్ రోడ్డు
మౌలిక వసతులకు రాష్ట్ర సర్కారు కేటాయింపులు
సంవత్సరం : నిధులు
2014-2023 : 90 వేల కోట్లు
రాబోయే మూడేండ్లు : 80-90వేల కోట్లు(ప్రణాళిక)
హైదరాబాద్ పై ప్రముఖుల కామెంట్స్
హైదరాబాద్‌కు వస్తే న్యూయార్క్‌కు వచ్చినట్టుంది
-సూపర్‌స్టార్ రజనీకాంత్
హైదరాబాద్‌లో ఉంటే లాస్‌ఏంజిల్స్‌లో ఉన్నట్టుంది
-సినీనటి లయ
హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే పెట్టుబడులు పెట్టాలనిపిస్తున్నది
-సినీనటి సోనాల్ చౌహాన్
Sep 10 2023, 11:10