తెలంగాణ లో మరో రెండు రోజులు భారీ వర్షాలే..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే.. మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది...

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం, అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది?

ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్గా మారిన వైసీపీ ఎంపీ

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు.

ఈడీకి కీలక సమాచారమిచ్చారు.

ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారగా.. HYD నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది.

20 మంది కీలక వ్యక్తులను విచారించింది.

రాబోయే రోజుల్లో మరికొందరిని ఈడీ ప్రశ్నించే అవకాశముంది.

జీ-20 సదస్సు ముగిశాక దర్యాప్తు ముమ్మరం చేయనుంది..

G20 Summit: భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్‌

లండన్‌: జీ20 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ భారత్‌కు చేరుకున్నారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ సహా ఇతర సీనియర్‌ దౌత్యవేత్తలు ఆయనకు స్వాగతం పలికారు..

వారి గౌరవార్థం ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను వారు ప్రశంసించారు.

అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్‌ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని 'భారతదేశ అల్లుడు'గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ (Rishi Sunak) వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నానని చెప్పారు..

Sunil Yadav: వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సునీల్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును సునీల్‌ యాదవ్‌ కోరారు..

పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శని, ఆదివారం, తర్వాత ఈనెల 17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బంది, వాహనంతో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. వాహనం, ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చును సునీల్ యాదవే భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సునీల్‌ యాదవ్‌ మధ్యంతర బెయిల్‌ గడువు ముగియగానే కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి బెయిల్‌ ఇవ్వాలంటూ సునీల్‌ యాదవ్‌ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్‌ ఇవ్వాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైల్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది..

హోంగార్డు రవీందర్ భార్య సంధ్యకు ఉద్యోగం?

ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్యకు ఉద్యోగం ఇచ్చేందుకు పోలీస్ శాఖ అంగీకరించింది.

దీంతో రవీందర్ అంత్యక్రియలకు భార్య సంధ్య ఒప్పుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని భార్య సంధ్య కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అంతకు‌ముందు తమకు న్యాయం చేయాలని రవీందర్ భార్య సంధ్య ఆందోళనకు దిగారు.

దీంతో పోలీస్ శాఖ ఆమెతో చర్చించారు. ఉద్యోగం ఇస్తామని మామీ ఇవ్వడంతో రవీందర్ భార్య సంధ్య ఆందోళన విరమించారు. తన పిల్లల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనేదానిపై పోలీసు శాఖ స్పష్టత ఇవ్వలేదు.. దీంతో ఆమె సీపీతో మాట్లాడాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం రవీందర్‌కు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రవీంద్రర్ అంత్యక్రియలను శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని పోలీస్ శాఖను సంధ్య కోరారు.

కాగా ప్రాణపాయ స్థితిలో అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు రవీందర్ శుక్రవారం ఉదయం మృతి చెందారు.

పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన రవీందర్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన రవీందర్ ఇటీవలే చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

కాగా సమయానికి వేతనాలు రావడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన రవీందర్ ఈ నెల 5న హోంగార్డు హెడ్ ఆఫీస్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో రవీందర్‌ను వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

55 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ ఈ నెల 6న సాయంత్రం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కంచన్ బాగ్ అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు.

అప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రవీందర్ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో రవీందర్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మంత్రులు కేటీఆర్ కు హరీష్ రావుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

రైతులకు ఇస్తున్న విద్యుత్ విషయంలో మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.

సిద్ధిపేట గజ్వేల్,సిరిసిల్లలో 15 గంటలు త్రీ ఫేజ్ కరెంట్ ఉంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. 24 గంటలు కాదని.. కనీసం 20 గంటలు ఇచ్చినా సరే తన పదవిని వదులుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

కరెంట్ విషయంలో రైతులను మంత్రులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు పదవులు కావాలని.. తనకు అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కరెంట్ ఇస్తున్నామని ఓ ఊదరగొడతం కాదు.. ఏ ఊరికైనా పోదాం.. మీరు చెప్పినట్లు కరెంట్ ఉంటే చూపించండి. నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మీకు చచ్చే వరకూ పదవులు కావాలి. మీరు చెప్పినంత కరెంట్ లేకపోతే కనీసం రైతులకు క్షమాపణ చెప్పాలి.’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు....

Tamilisai Soundararajan: ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: తమిళిసై

హైదరాబాద్: సవాళ్లు, ప్రతిబంధకాలు తనను అడ్డుకోలేవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాను రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు..

తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

''రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాను. కోర్టు కేసులు, విమర్శలకు భయపడను. ప్రోటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉంది. ఇక్కడ జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారు. నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. కన్నింగ్‌ ఆలోచనలతో లేను..

వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తోంది. ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ బిల్లు ప్రభుత్వం నుంచి నాకు అందింది. కొన్ని బిల్లుల్లో లోపాల్ని గుర్తించి తిరిగి పంపాను. బిల్లులను తిరిగి పంపడంలో ఎలాంటి రాజకీయం లేదు. జమిలి ఎన్నికలను నేను సమర్థిస్తాను. సీఎం కేసీఆర్‌కు చాలా రాజకీయ అనుభవం ఉంది. కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నాను '' అని తమిళిసై అన్నారు..

Hyderabad: నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్‌ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య

హైదరాబాద్‌: తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు. రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ఆమె ఆరోపించారు..

దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు..

రవీందర్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడిని హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రవీందర్‌ భార్య ఆందోళనకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతోందని.. ఆందోళన విరమించాలని సీఐ కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. రవీందర్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టారని.. ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు..

ఎమ్మెల్సీ కవిత పోరాటంతో కేంద్రంలో కదలిక: ఎంపీ ఆర్‌ కృష్ణయ్య ప్రశంస

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రంలో కదలిక రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కారణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య ప్రశంసించారు. ఆమె వల్లే దేశంలోని రాజకీయ పార్టీలు ఆ బిల్లుపై పట్టుబడుతున్నాయని చెప్పారు.

గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూనే ఆమెను అభినందిస్తున్నామని కృష్ణయ్య తెలిపారు.

మహిళా బిల్లుపై కవిత ఉద్యమించడం, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు తోడ్పాటును అందించాయని పేర్కొన్నారు.

మహిళా బిల్లును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ బిల్లులో బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కేలా ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్‌ పార్టీ అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కోరారు.

మహిళా బిల్లుకు బీసీలు వ్యతిరేకం కాదని, అయితే బీసీ బిల్లు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ జరిగిన ప్రతిసారీ మహిళా బిల్లును తెరమీదకు తెస్తున్నారని, దీనివల్ల హక్కుల కోసం కొట్లాడే వర్గాల మధ్య తగువు పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని దుయ్యబట్టారు..

G-20 సదస్సు.. ఐటీసీ మౌర్యలో బైడెన్.. శాంగ్రీలాలో సునాక్..

న్యూఢిల్లీ..

జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు బయల్దేరుతున్నారు. వారి కోసం దిల్లీలో ఖరీదైన హోటళ్లు పటిష్ఠ భద్రతతో ముస్తాబయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్కు హోటల్ ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు..

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తొలిసారి ప్రధాని హోదాలో భారత్‌కు వస్తున్నారు. ఆయనకు షాంగ్రి లా హోటల్‌లో బస చేసేందుకు వసతి కల్పించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోస్‌, జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా.. ది లలిత్ హోటల్‌లో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఇంపీరియల్‌ హోటల్‌లో బస చేస్తారు.

దిల్లీలోని మరో ప్రముఖ హోటల్‌ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ ఉంటారు. డాక్టర్‌ జాకిర్‌ హుస్సేన్‌ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్‌ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ బస కోసం బుక్‌ చేశారు. గురుగ్రామ్‌ ఒబెరాయ్‌ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గైర్హాజరవుతున్న వేళ.. ఆ దేశ ప్రతినిధిగా వస్తున్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కూడా ఒబెరాయ్‌లోనే ఉంటారని సమాచారం. చైనా ప్రధాని లీ చియాంగ్ బృందం కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు..