YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ..

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు..

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు..

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ చేతిలోకి వైఎస్ఆర్ టీపీ పార్టీ ❓️

షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో ఆమె గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు.

అనంతరం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఆమె తన భర్త అనిల్‌తో కలిసి హస్తిన చేరుకున్నారు. వైఎ్‌సఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతాసిబ్బందికి గానీ సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబరు 2న వైఎస్‌ వర్ధంతి ఉన్నందున ఈలోపే విలీనంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు తెలిసింది.

సోనియాతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావించినా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్‌ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, అన్న జగన్‌ జైలులో ఉండగా.. ఆయన వదిలిన బాణంగా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని బలోపేతం చేసిన షర్మిల.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆస్తిలో వాటా ఇచ్చేందుకూ జగన్‌ నిరాకరించడంతో.. ప్రత్యామ్నాయం వైపు మళ్లారు.

తెలంగాణలో వైఎస్ఆర్‌ టీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. తొలుత తెలంగాణకే పరిమితమైన ఆమె.. తల్లి విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి జగన్‌ నిర్దాక్షిణ్యంగా తొలగించిన దరిమిలా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయనతోను, ఆ పార్టీ నేతలతోను పలు దఫాలు చర్చలు జరిపిన ఆమె.. రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి ఇది సంకేతమని ఆనాడే వార్త లు వెలువడ్డాయి.

గురువారం సోనియాతో సమావేశం తర్వా త విలీన ప్రక్రియ పూర్తిగా కొలిక్కి వస్తుందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.......

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పెరుగనున్న ఉష్ణోగ్రతలు !

తెలంగాణ మరింత ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యం కాగా, జూన్ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు..

దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదయింది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు దంచి కొట్టాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. జూలై నెలలో రికార్డు వర్షపాతం నమోదయింది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుం టున్నారు. అయితే… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది..

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 15 దుకాణాలు!

నంద్యాల: శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా సుమారు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం..

Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీ భగ్నం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అధికారులు భగ్నం చేశారు. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు..

ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలో పాల్గొన్న వారి నుంచి టీఎస్‌ న్యాబ్‌ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు..

తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల‌ నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే ర‌క్షా బంధన్రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంద‌న్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం పేర్కొన్నారు.

మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసాను అందిస్తున్నాయన్నారు.

సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సీఎం అన్నారు .

అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు........

Amitabh Bachchan: అమితాబ్‌ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన సీఎం మమత..

ముంబయి: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబయికి చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరగనున్న విపక్ష కూటమి 'ఇండియా' కీలక భేటీలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరుకున్న ఆమె..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. రక్షాబంధన్‌ పర్వదినం వేళ జుహూలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన దీదీ.. అమితాబ్‌కు రాఖీ కట్టారు. ముంబయి పర్యటన నేపథ్యంలో దీదీని అమితాబ్‌ తేనీటి విందుకు ఆహ్వానించినట్టు సమాచారం. అమితాబ్‌ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు..

అమితాబ్‌ నివాసానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం మమత అన్నారు. ఆయను రాఖీ కట్టినట్టు వెల్లడించారు. అమితాబ్‌ కుటుంబం అంటే తనకు అమితమైన ఇష్టమన్న దీదీ.. ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని, దేశంలోనే నంబర్‌ వన్‌ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించినట్టు తెలిపారు. గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి అమితాబ్‌ హాజరు కాగా.. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు భారతరత్న అవార్డుతో సత్కరించాలని దీదీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే..

టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర అర్హ‌త ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్ల‌డించారు. టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఆగ‌స్టు 29తో ముగియ‌గా, అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ల ఉద్యోగాల‌కు అర్హ‌త కోసం టీఎస్ సెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రూ. 1500 ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు, రూ. 2 వేల ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 18 వ‌ర‌కు, రూ. 3 వేల ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ ఫీజు ఆల‌స్య రుసుంకు అద‌నం. సెప్టెంబ‌ర్ 26, 27 తేదీల్లో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

అక్టోబ‌ర్ 20 నుంచి అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 28, 29, 30 తేదీల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్, క‌ర్నూల్, క‌రీంన‌గ‌ర్, తిరుప‌తి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మెద‌క్, వైజాగ్, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాల్లో ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు...

Yuvagalam: లోకేష్‌ పాదయాత్రకు రేపటితో 200 రోజులు..

లోకేష్‌ పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. జన నీరాజనాల మధ్య విజయవంతంగా నడుస్తోంది. లోకేష్‌ పాదయాత్ర రేపటితో 200వ రోజుకు చేరుకుంటోంది. రికార్డులను బద్దలుకొడుతూ లోకేష్‌ పాదయాత్ర ముందుకెళ్తోంది..

లోకేష్‌ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు.

జనవరి 27న కుప్పంలో వరదరాజస్వామి ఆశీస్సులతో ప్రారంభమైన లోకేష్‌ పాదయాత్ర జైత్రయాత్రను తలపించేలా సాగుతోంది. ఇప్పటి వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర పూర్తయ్యింది. 77 నియోజకవర్గాల్లో 2 వేల 710 కిలోమీటర్ల మేర నారా లోకేష్‌ నడిచారు. ఎండ, వాన, అలసట ఇలాంటి వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటివరకు విరామం లేకుండా పాదయాత్ర సాగుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా లోకేష్‌ పాదయాత్ర ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు..

199 రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు, 185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్‌ పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 64 బహిరంగ సభలకు లోకేష్‌ హాజరయ్యారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు బలయిన బాధితులను ఓదారుస్తూ.. దగాపడ్డ ప్రజలకు భరోసా ఇస్తూ.. టీడీపీ చేసిన అభివృద్ధి వివరిస్తూ..అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ లోకేష్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కంటగింపుతో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సంయమనంతో అడ్డుకుంటూ ముందుకు సాగుతున్నారు. పదునైన మాటలతో.. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ లోకేష్‌ ప్రసంగాలు ఉంటున్నాయి. విరామ సమయంలో నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. పాదయాత్రలో లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

పక్కా ప్లాన్‌ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు

ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై కత్తితో దాడి

హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం

ఎన్‌ఐఏకి రికార్డులు ఇవ్వని సిట్‌

నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర

విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు.

కాగా, సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏకి సిట్‌ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్‌ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్‌ఐఏకి రికార్డ్‌ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్‌ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు..

ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?..

ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్‌ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్‌ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్‌ వేశారు.

ప్లాన్‌ ప్రకారమే దాడి..

సీఎం జగన్‌పై పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో శ్రీనివాస్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు..