ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్‌ చేశారు..

వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు.

ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు..

కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ .. !

- కాంగ్రెస్ టికెట్ల కోసం ఓయూ విద్యార్థుల ఆశలు ..

- ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాల్ ..

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుండి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి నేతల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం పోరాటం మొదలైంది. ఇది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి, అలాగే టీ పీసీసీ సభ్యులు, సిఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్కకు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని వారు కోరారు.

వినతి పత్రం ఇచ్చిన వారిలో సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మానవతారాయ్, చెన్నూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగాం నుంచి టికెట్ ఆశిస్తున్న బాల లక్ష్మి, గద్వాల నుంచి టికెట్ ఆశిస్తున్న కురువ విజయ్ కుమార్, మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత డాక్టర్ లింగం యాదవ్, కరీంనగర్ నుంచి కొనగాల మహేష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తోన్న తమకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థి ఉద్యమాల నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. అంతేకాకుండా ఇది ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అని గుర్తుచేసిన విద్యార్థి నేతలు.. ఆ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.

డిసెంబర్‌లోనే డీఎస్సీ ఎగ్జామ్‌.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహణ?

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. పరీక్షను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు.

ఒక్కో రోజు ఒక పేపర్‌కు మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి షిప్టుల వారీగా నిర్వహించాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనుండడంతో అందుకు కావాల్సిన పరీక్షా కేంద్రాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

దరఖాస్తులు భారీగా వస్తే దానికనుగుణంగా పరీక్షా కేంద్రాలను జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పేపర్‌ తయారి, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎస్‌సీఈఆర్టీకి అప్పగించనున్నారు.

ఈక్రమంలోనే దరఖాస్తుల స్వీకరణ, విద్యార్హతలు, పరీక్ష తేదీ, సిలబస్‌, రోస్టర్‌ పాయింట్‌, అభ్యర్థుల స్థానికత, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, లోకల్‌, ఓపెన్‌ కోటా తదితర అంశాలపై అధికారులు కొన్ని రోజులుగా భేటీ అవుతూ కసరత్తులు చేస్తూవస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నేడు లేదా రేపు డీఎస్సీ మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయనుంది.

మొన్న జరిగిన గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌,సీబీటీ,పద్ధతిలో గురుకుల బోర్డు అధికారులు రోజుకు మూడు షిప్టుల్లో విజయవంతంగా నిర్వహించారు.

డీఎస్సీని సైతం కూడా ఇదే తరహాలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు టీఎస్‌ ఆన్‌లైన్‌ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో మాదిరిగానే ఎస్జీటీ అభ్యర్థులకు ఒక రోజు, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ పడడంతో ఎలాంటి కోర్టు చిక్కులు, లీకులు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 6612 పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే సర్కారు జీవోలు కూడా జారి చేసింది.

అయితే 2017లో 8972 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ టీఆర్టీ, ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఈసారి మాత్రం పాఠశాల విద్యకే నియామక బాధ్యతలను అప్పగించారు.

డిసెంబర్‌ 15వ తేదీలోపు డీఎస్సీని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎడ్‌ వారు మాత్రమే అర్హులుగా తేలుస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

నేడు మహారాష్ట్రకు మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ!

మహారాష్ట్ర పర్యటనకు బీఆర్ఎస్ మంత్రులు వెళ్తున్నారు.బుధవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పర్యటించనున్నారు.

పద్మశాలీలు ఘనంగా నిర్వహించే మార్కండేయ రథోత్సవానికి ఆహ్వానం అందడంతో వెళ్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు రథోత్సవంలో పాల్గొననున్నారు.

అనంతరం పార్టీ నాయకులతో భేటీ అయి పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ టు బల్లార్ష పలు రైళ్ల కుదింపు

కాజీపేట రైల్వే జంక్షన్‌ బలార్ష సెక్షన్‌లో జరుగుతున్న మూడోలైన్‌ ఇంటర్‌ లాకింగ్‌, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా మంగళవారం నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు రైళ్లను బెల్లంపల్లి వరకు కుదిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సెక్షన్‌లోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ రెండు ముఖ్య రైల్వేస్టేషన్లలో మూడోలైన్‌ పనులు జరుగుతున్నందున ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు హైదరాబాద్‌ సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్‌-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలను బెల్లంపల్లి వరకు కుదించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

బెల్లంపల్లి-బలార్ష సెక్షన్‌ మూడో లైన్‌ పూర్తయ్యే దశలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటుగా ఇంతకు ముందు రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్‌ ప్యాసింజర్‌, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్‌ 2వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

రాఖీ పౌర్ణమి కి మహిళలకు అదిరిపోయే బహుమతులు

రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది.

ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థ‌కున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనుంది.

ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.

ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.

మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది.

సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించి పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు...

MP Komatireddy: నల్గొండ సీటు త్యాగం చేయడానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఆరు దరఖాస్తులు వచ్చాయని అందరి బలాబలాలు పరిశీలిస్తామని తెలిపారు..

సమర్థులైన వారికే టికెట్లు ఇస్తామన్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్‌ టూ వన్‌ మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనకు అందరం ఆమోదించినట్టు తెలిపారు.

ఎన్నికల ముందు కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు..

Ministers Botsa: ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..!

జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సృహుద్భావ వాతావరణంలో జరిగింది అని పేర్కొన్నారు.

మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సంయమనం పాటించాలి.. చంద్రబాబు మిమ్మల్ని అనటం, మాతో అనిపించుకోవడం దేనికి?.. వయస్సు కాదు మనిషికి ఆలోచన ఉండాలి అని ఆయన అన్నారు.

ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి కదా.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది.. ఢిల్లీలో ఎవరి గేట్ల ముందు ఎవరు తిరుగుతున్నారు? అనేది తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు జగన్ సర్కార్ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా.. సరే వెంటనే తీర్చేస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Hyderabad: 12వేల మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్‌..

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న ఇళ్లను కేటాయించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు..

నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్‌గా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు..

తమ కల నెరవేరబోతున్న సందర్భంగా మంత్రితో మాట్లాడిన బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌, యూసుఫ్‌గూడ, బేగంబజార్‌, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆంనదం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి తలసాని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. సెప్టెంబరు 2న లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల కాలనీల వద్ద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు తెలియజేస్తారన్నారు..

KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్..

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది..

అయితే, పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేసుందుకు రావడంతో ఆయన ఓవరాక్షన్ చేశాడు. తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో ఆయన గొడవకు దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్ ను కేఏ పాల్ పట్టుకున్నాడు. పోలీసులపై అరుస్తూ, కేకలు పెడుతూ నానా హంగామా చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదిలిపెట్టాలని పాల్ గొడవకు దిగాడు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేఏ పాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఇవాళ ( మంగళవారం ) పోలీసులు భగ్నం చేశారు..

కేఏ పాల్ చేస్తున్న దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా పోలీసులు తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకుపోయారు. అయితే ఆసుపత్రికి లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే కేఏ పాల్ పోలీసులతో గొడవకు దిగాడు. ఆరోగ్యంగా ఉన్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు..