వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాధ్ స్వయంగా వాహనల తనిఖీ

వ‌రంగ‌ల్ జిల్లా:ఆగస్టు 11

ఐపిఎస్ అధికారి ఎ.వి.రంగనాధ్ ప్రజా పోలీసింగ్ కి కేరాఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదు. నిత్యం సామాన్యులకు అండగా..సామాన్యుల్లో ఒకడిగా ఉండటానికి ఇష్టపడే ఈ అధికారి ప్రజలకోసం..ప్రజల మధ్యనే పోలీసులు అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు .

తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన స్పెషల్ వెహికిల్ చెకింగ్ కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటూ అధికారులు.. సిబ్బందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

సాధారణంగా పోలీసుల వాహనాల తనిఖీ అంటే ఒక రోడ్డుపై ఓ ఇద్దరు ముగ్గురు సిబ్బంది వాహనాలు నిలుపుతూ..చలాన్లు విధిస్తూ వాహనాలను నియంత్రించడం పరిపాటి. కాని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో వాహన తనిఖీల్లో ఎస్ఐ స్థాయి అధికారి నుండి కమిషనర్ స్థాయి అధికారి వరకూ స్వయంగా పాల్గొంటూ నకిలీ పత్రాలతో తిరుగుతున్న వాహనాలే టార్గెట్ గా నిర్వహిస్తున్న డ్రైవ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పోలీసులకు ఆదర్శనీయంగా నిలుస్తోంది.

గత రెండ్రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రంగనాధ్ స్వయంగా పాల్గొంటూ వాహనాల పత్రాలు

తనిఖీ చేయడంతో పాటు రహదారి భద్రత..ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు.

కమిషనర్ స్థాయి సీనియర్ ఐపిఎస్ అధికారి స్వయంగా రోడ్డెక్కి తనిఖీలలో పాల్గొనడంతో వరంగల్ పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతో విధులు నిర్వహించడమే కాకుండా ..వాహన తని‎ఖీల సందర్భంలో తగిన రక్షణ చర్యలు పాటిస్తూ..రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసింగ్ లో వచ్చిన మార్పులు..పోలీసు అధికారులు..సిబ్బంది ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది....

కేంద్రానికి కాకపోతే బైడెన్‌కి చెప్పుకోండి.. ఎవరికి భయం?: పవన్‌కి మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు..

వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటించిన పవన్‌.. స్టీల్‌ప్లాంట్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

''కేంద్రానికి చెబితే ఎవరికి భయం? మేం చేసిన తప్పేంటి? ఎవరికో చెబితే భయపడే ప్రభుత్వం జగన్‌ది కాదని తెలుసుకోవాలి. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పుకోండి'' అని అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు..

50 ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్‌..

దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి రష్యా తన రాకెట్ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం..

మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి ఇవాళ వేకువజామున 2.10 గంటలకు 'లునా – 25' రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్‌ చేసేలా రష్యా ప్రణాళికలు రచిస్తోంది.

దీని ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్‌కాస్మోస్‌ వెల్లడించింది.

1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'చంద్రయాన్-3' ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు.. 'లునా -25' ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది.

Cm Jagan: నేడు అమలాపురంలో సీఎం జగన్ పర్యటన.. సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల

సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులకు దాదాపు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో ఏపీ సీఎం జమ చేయనున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది మహిళలకు ఈ లబ్ది పొందుతారు.

అనంతరం జనుపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, వైఎఎస్ఆర్ సున్నావడ్డీ నిధులు ఇవాళ విడుదల చేయడం వరుసగా ఇది నాలుగో ఏడాది కావడం విశేషం..

ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

రాష్ట్రంలోని మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి జగన్‌ సర్కార్ బాటలు వేసింది..

పశువుగా ప్రవర్తించిన మనిషి

మంచిర్యాల జిల్లా:ఆగస్టు 11

జిల్లా లోని షెట్‌పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

గురువారం సాయంత్రం బాపు అనే వ్యక్తిని కొయ్యకు రెఁడుచేతులు కట్టివేసి రాంరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా చితకబాదాడు.

తన చేనులో పశువులు పడి పంటను మేశాయని దానికి కారణం బాపు అని గ్రహించి, ఆగ్రహంతో ఊగిపోయాడు.

బాపుని కొయ్యకు కొట్టేసి పొలం యజమాని చితకబాదాడు. స్థానికులు వచ్చి నచ్చజెప్పడంతో బాధితుడిని యజమాని వదిలేశాడు.

బాధితుడు కోటపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

శంషాబాద్‌లో సంచలనం రేపిన మరో దిశ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా :ఆగస్టు 11

శంషాబాద్‌లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ ఎంత సంచలనం రేపిందో తెలియనిది కాదు. అదే తరహాలో నిన్న రాత్రి మహిళ దారుణ హత్య సంచలనం రేపింది.

శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. మహిళకు 35 - 36 ఏళ్లు ఉండొచ్చని సమాచారం.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. శంషాబాద్ లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ తర్వాత ఇది రెండవ కేసు కావడం గమనార్హం. అసలు ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి...

ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆగని సమ్మె ప్రకంపనలు

నేతల తీరుపై ఆగ్రహంఏం సాధించారంటూ వాట్సప్‌ గ్రూపుల్లో నిలదీత..

అమరావతి: ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరకుండానే.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..

ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందంపై ఏర్పాటు చేసిన మన్మోహన్‌ సింగ్‌ కమిటీ నివేదికలో ప్రస్తావించిన అంశాలనే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించినా సమ్మె ఎందుకు విరమించారని నేతలను ప్రశ్నిస్తున్నారు. మాస్టర్‌ స్కేల్‌ను రూ.1.99 లక్షలకు పరిమితం చేసి.. స్టాగ్నేటెడ్‌ ఇంక్రిమెంట్లతో కలిపి రూ.2.60 లక్షలుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. 'పీఆర్‌సీ స్ట్రగుల్‌ కమిటీ' పేరుతో కొత్తగా ఏర్పాటైన కమిటీ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

బుధవారం రాత్రి వరకు జరిగిన సమ్మె చర్చల నుంచి అర్ధంతరంగా వైదొలగిన విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పింది. ఆ సంఘం గురువారం నుంచి విధులకు హాజరుకావాలని సభ్యులకు సమాచారం పంపడంతో వారంతా యథావిధిగా హాజరయ్యారు. చర్చల్లో కీలకంగా వ్యవహరించిన ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం (1104) ఏలూరు డివిజన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.మురళీమోహన్‌ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సమ్మె విరమించడం వల్ల భావితరాల ఉద్యోగులకు అన్యాయం చేసినట్లుగా భావిస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

వాట్సప్‌ గ్రూపుల్లో విమర్శల వెల్లువ

సమ్మె వల్ల ఆర్థికంగా ప్రయోజనం లేకపోగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. బుధవారం రాత్రి సమ్మె విరమిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఉద్యోగులు వాట్సప్‌ గ్రూపుల్లో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

సమ్మె కార్యాచరణకు కొన్ని సంఘాలు సిబ్బంది నుంచి కనీసం రూ.2 వేలు చందా వసూలు చేశాయి. 'ఎలాగూ సమ్మె జరగలేదు. మా డబ్బులు వెనక్కివ్వండి' అంటూ నేతలను ఉద్దేశించి కొందరు సిబ్బంది వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.

2023 ఆగస్టు 9న పీఆర్‌సీ మరణిందన్న అర్థం వచ్చేలా ఫొటోకు పూలదండ వేసి.. కాలనీ గ్రౌండ్‌లో గురువారం పెద్దకర్మ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ లంచ్‌ బాక్సుతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నది మరో వ్యంగ్య పోస్టు.

జెన్‌కో సిబ్బంది భత్యాలపై నేడు చర్చ

ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న భత్యాలు (ఎలవెన్సులు), పీఆర్సీ వర్తింపజేసిన తర్వాత వాటిలో చేయాల్సిన మార్పులపై శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సౌధలో ఏపీ జెన్‌కో చర్చించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగులతో చర్చిస్తుందని, అసోసియేషన్‌ నుంచి ఇద్దరు వంతున చర్చలకు రావాలని విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలకు జెన్‌కో లేఖ రాసింది..

నేడు భక్తుల రద్దీ పెరిగింది

తిరుపతి :ఆగస్టు 11

తిరుమల తిరుపతి భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్రమంలోనే నేడు శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది.

అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి భక్తులు క్యూలైన్ వెలుపలకు వచ్చేశారు.

స్వామివారి దర్శనానికి నేడు 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న గురువారం శ్రీవారిని 57,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారికి 28,198 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ (Renu Desai) పేర్కొన్నారు..

ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా 'బ్రో' సినిమా శ్యాంబాబు వివాదంపైనా ఆమె మాట్లాడారు..

''మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు.

ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే'' అని ఆమె చెప్పారు..

ఇదే వీడియోలో ఆమె శ్యాంబాబు విషయంపై మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. '' అని ఆమె అన్నారు..

మణిపూర్ మారణహోమానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

•మానవ హక్కుల వేదిక నాయకులు జి.మోహన్

మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణ అఘాయిత్యాన్ని, లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నేరస్తులను కఠినంగా శిక్షించాలనీ, మణిపూర్ లో జరుగుతున్న మానవ హక్కుల హాననంపై స్పందిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ కుకీ మహిళలపై ఆకృత్యాల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న, నల్లగొండలోని స్థానిక (అంబేద్కర్ భవనం)యందు ఉదయం 10 గంటలకు జరిగే సభకు సంబంధించిన కరపత్రంను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో పట్టణంలో ని స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కరపత్రం ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గోసుల మోహన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ మణిపూర్ మహిళలపై జరిగిన అమానుషానికి దేశమంతా దిగ్భ్రాంతికి గురైందన్నారు.

మే 4న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం సరైనది కాదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నగ్న ప్రదర్శనలు, గృహ దహనాలు తదితర హింసాత్మక సంఘటనలకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, మోడీ ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ సంఘటనలకు అక్కడి పాలకుల స్వార్థపూరిత రాజకీయాలే కారణమని విమర్శించారు. కొండ ప్రాంతాలలో నివసించే ఆదివాసులను ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టి అక్కడి సంపదను మొత్తం బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని కుట్ర ఇందులో దాగి ఉందన్నారు.

మణిపూర్ లో మహిళలను వివస్త్ర లను చేసి నడి బజార్లో ఊరేగించి, సామూహిక అత్యాచారానికి, హత్యలకు పాల్పడ్డారని, ఎంతోమంది అమాయక ప్రజలను హత్య చేశారని, సభ్య సమాజం తలదించుకునే విధంగా అనేక ఆకృత్యాలు మణిపూర్ లో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ దాష్ఠీకాలకు వ్యతిరేకంగా ఆగస్టు,14,2023 న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగే సభకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొనగలరని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో రైతు కూలీ పోరాట సమితి నాయకులు పలస యాదగిరి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు: మానుపాటి బిక్షం, PDSU (విజృంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, పల్లెబోయిన జానీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జనార్ధన్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ఫాదర్ అలెగ్జాండర్, అంబేద్కర్, బొలుగూర్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.