ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆగని సమ్మె ప్రకంపనలు

నేతల తీరుపై ఆగ్రహంఏం సాధించారంటూ వాట్సప్‌ గ్రూపుల్లో నిలదీత..

అమరావతి: ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరకుండానే.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..

ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందంపై ఏర్పాటు చేసిన మన్మోహన్‌ సింగ్‌ కమిటీ నివేదికలో ప్రస్తావించిన అంశాలనే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించినా సమ్మె ఎందుకు విరమించారని నేతలను ప్రశ్నిస్తున్నారు. మాస్టర్‌ స్కేల్‌ను రూ.1.99 లక్షలకు పరిమితం చేసి.. స్టాగ్నేటెడ్‌ ఇంక్రిమెంట్లతో కలిపి రూ.2.60 లక్షలుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. 'పీఆర్‌సీ స్ట్రగుల్‌ కమిటీ' పేరుతో కొత్తగా ఏర్పాటైన కమిటీ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

బుధవారం రాత్రి వరకు జరిగిన సమ్మె చర్చల నుంచి అర్ధంతరంగా వైదొలగిన విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పింది. ఆ సంఘం గురువారం నుంచి విధులకు హాజరుకావాలని సభ్యులకు సమాచారం పంపడంతో వారంతా యథావిధిగా హాజరయ్యారు. చర్చల్లో కీలకంగా వ్యవహరించిన ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం (1104) ఏలూరు డివిజన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.మురళీమోహన్‌ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సమ్మె విరమించడం వల్ల భావితరాల ఉద్యోగులకు అన్యాయం చేసినట్లుగా భావిస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

వాట్సప్‌ గ్రూపుల్లో విమర్శల వెల్లువ

సమ్మె వల్ల ఆర్థికంగా ప్రయోజనం లేకపోగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. బుధవారం రాత్రి సమ్మె విరమిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఉద్యోగులు వాట్సప్‌ గ్రూపుల్లో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

సమ్మె కార్యాచరణకు కొన్ని సంఘాలు సిబ్బంది నుంచి కనీసం రూ.2 వేలు చందా వసూలు చేశాయి. 'ఎలాగూ సమ్మె జరగలేదు. మా డబ్బులు వెనక్కివ్వండి' అంటూ నేతలను ఉద్దేశించి కొందరు సిబ్బంది వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.

2023 ఆగస్టు 9న పీఆర్‌సీ మరణిందన్న అర్థం వచ్చేలా ఫొటోకు పూలదండ వేసి.. కాలనీ గ్రౌండ్‌లో గురువారం పెద్దకర్మ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ లంచ్‌ బాక్సుతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నది మరో వ్యంగ్య పోస్టు.

జెన్‌కో సిబ్బంది భత్యాలపై నేడు చర్చ

ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న భత్యాలు (ఎలవెన్సులు), పీఆర్సీ వర్తింపజేసిన తర్వాత వాటిలో చేయాల్సిన మార్పులపై శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సౌధలో ఏపీ జెన్‌కో చర్చించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగులతో చర్చిస్తుందని, అసోసియేషన్‌ నుంచి ఇద్దరు వంతున చర్చలకు రావాలని విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలకు జెన్‌కో లేఖ రాసింది..

నేడు భక్తుల రద్దీ పెరిగింది

తిరుపతి :ఆగస్టు 11

తిరుమల తిరుపతి భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్రమంలోనే నేడు శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది.

అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి భక్తులు క్యూలైన్ వెలుపలకు వచ్చేశారు.

స్వామివారి దర్శనానికి నేడు 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న గురువారం శ్రీవారిని 57,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారికి 28,198 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ (Renu Desai) పేర్కొన్నారు..

ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా 'బ్రో' సినిమా శ్యాంబాబు వివాదంపైనా ఆమె మాట్లాడారు..

''మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు.

ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే'' అని ఆమె చెప్పారు..

ఇదే వీడియోలో ఆమె శ్యాంబాబు విషయంపై మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. '' అని ఆమె అన్నారు..

మణిపూర్ మారణహోమానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

•మానవ హక్కుల వేదిక నాయకులు జి.మోహన్

మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణ అఘాయిత్యాన్ని, లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నేరస్తులను కఠినంగా శిక్షించాలనీ, మణిపూర్ లో జరుగుతున్న మానవ హక్కుల హాననంపై స్పందిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ కుకీ మహిళలపై ఆకృత్యాల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న, నల్లగొండలోని స్థానిక (అంబేద్కర్ భవనం)యందు ఉదయం 10 గంటలకు జరిగే సభకు సంబంధించిన కరపత్రంను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో పట్టణంలో ని స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కరపత్రం ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గోసుల మోహన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ మణిపూర్ మహిళలపై జరిగిన అమానుషానికి దేశమంతా దిగ్భ్రాంతికి గురైందన్నారు.

మే 4న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం సరైనది కాదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నగ్న ప్రదర్శనలు, గృహ దహనాలు తదితర హింసాత్మక సంఘటనలకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, మోడీ ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ సంఘటనలకు అక్కడి పాలకుల స్వార్థపూరిత రాజకీయాలే కారణమని విమర్శించారు. కొండ ప్రాంతాలలో నివసించే ఆదివాసులను ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టి అక్కడి సంపదను మొత్తం బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని కుట్ర ఇందులో దాగి ఉందన్నారు.

మణిపూర్ లో మహిళలను వివస్త్ర లను చేసి నడి బజార్లో ఊరేగించి, సామూహిక అత్యాచారానికి, హత్యలకు పాల్పడ్డారని, ఎంతోమంది అమాయక ప్రజలను హత్య చేశారని, సభ్య సమాజం తలదించుకునే విధంగా అనేక ఆకృత్యాలు మణిపూర్ లో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ దాష్ఠీకాలకు వ్యతిరేకంగా ఆగస్టు,14,2023 న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగే సభకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొనగలరని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో రైతు కూలీ పోరాట సమితి నాయకులు పలస యాదగిరి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు: మానుపాటి బిక్షం, PDSU (విజృంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, పల్లెబోయిన జానీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జనార్ధన్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ఫాదర్ అలెగ్జాండర్, అంబేద్కర్, బొలుగూర్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

మూడు జిల్లాలకు కాంగ్రెస్ డీసీసీ చీఫ్‌ల నియామకం

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచెంది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ చీఫ్‌లను నియమించింది.

ఈ మేరకు మూడు జిల్లాలకు డీసీసీ చీఫ్ లను ఏఐసీసీ ప్రకటించింది.

జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నిర్మల్ జిల్లాకు శ్రీహరిరావు, భువనగిరి జిల్లాకు సంజీవరెడ్డిలను నియమిస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 10

తిరుమలలో భక్తుల రద్దీ నేడు గురువారం కూడా కొనసాగుతోంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

బుధవారం 75594 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్‌లో ఎన్‌ఐఏ దాడులు కలకలం..

కరీంనగర్‌: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.

కరీంనగర్‌ హుస్సేపురాలో గురువారం ఉదయం ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది..

తబ్రేజ్‌ అనే వ్యక్తికి పీఎఫ్‌ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది.

ప్రస్తుతం తబ్రేజ్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది.

పీఎఫ్‌ఐ టెర్రర్‌ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

నేడు అవిశ్వాసంపై ఓటింగ్

•ప్రధాని మోడీ హాజరయ్యేనా?

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు (గురువారం) ఓటింగ్ జరగనుంది.

పార్లమెంట్ కు రాకుండా ఉన్న ప్రధాని మోడీని సభకు రప్పించి, మాట్లాడించడా నికి ఒక సాధనమే ఈ అవిశ్వాస తీర్మానమని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి.

అది నేడు నెరవేరనుంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ నేడు సమాధానం ఇవ్వాల్సి ఉన్నది.

అయితే ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్లో నేడు అవిశ్వాసంపై ఓటింగ్..ఎలాగూ ప్రభుత్వమే గెలుస్తుందని అందరికీ తెలుసు.

అయితే ప్రస్తుత లోక్ సభ అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వానికి మద్దతుగా 369, ప్రతిపక్షానికి మద్దతుగా 154, తటస్థంగా 16 మంది మద్దతు ఉంది.

వైయస్సార్ టిపి కాంగ్రెస్‌లో విలీనం కానుందా❓️

కాంగ్రెస్‌ లో షర్మిల పార్టీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు.

ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నారు.

విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ అధికారికంగా ఇంకా తేదీని ఖరారు చేయలేదు.

గతంలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. కాగా గతంలో రేవంత్ వర్గం షర్మిల పార్టీని విలీనం చేసే అంశాన్ని వ్యతిరేకించారని, మరికొంతమంది షర్మిల రాకను స్వాగతిస్తున్నామని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి.

ఏదీ ఏమైనప్పటికీ ఈ వారంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశమున్నట్లు సమాచారం...

రాహుల్‌పై 'ఫ్లయింగ్‌ కిస్‌'ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

దిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul gandhi) అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు.

అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) పేర్కొన్నారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్‌ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన బయటికెళ్లారు. వెళ్తూవెళ్తూనే ఆయన ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు.

రాహుల్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఆయన తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ.. భాజపా మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై భాజపా ఎంపీ పూనమ్ మహాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నవారికి ఆయన వ్యవహరించిన తీరు కనిపించి ఉంటుంది. ఆ ప్రవర్తన సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎలా ప్రవర్తించాలో తెలిసుండాలి' అని విమర్శించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆయన ఆ సంజ్ఞ చేయలేదని పేర్కొన్నాయి..