Road Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాల్లో రికార్డు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మావల-గుడిహత్నూర్‌ మండలాల మధ్య 44వ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది.

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ వాఘపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది..

ఈ ఘటనలో లారీలోని డ్రైవర్స్‌తో సహా ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రవాణాకు కాసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తొలగించారు..

సీఎం జగన్, చంద్రబాబు ఒకే చోట - ప్రతిష్ఠాత్మకం, ఉత్కంఠ..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు..

ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది..

పోలవరంలో ఇద్దరు నేతలు:సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్ర వరంలో బస చేయనున్నారు.

'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు.

సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..

తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 07

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా కొనసాగుతోంది.

నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 83,856 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణ SI ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్పీఆర్బీ ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల అభ్యర్థుల చివరి లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి.

మొత్తం 587 ఎస్సై పోస్టులకు గాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది.

మరోవైపు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం....

ఆర్టీసి బిల్లుకు రైట్ రైట్...!

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సందిగ్ధత తొలగింది. ఆర్టీసీ విలీనం బిల్లు డ్రాప్టుకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. శానససభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ కన్సెంట్ ఇచ్చారు. గవర్నర్ ఆమోదంతో బిల్లుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇవాళ మధ్యాహ్నం రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ అధికారులతో రాజ్‌భవన్‌లో అర్ధగంటకు పైగా జరిగిన చర్చల అనంతరం గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

డ్రాఫ్టు బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తలెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన వివరణతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ బిల్లుకు ఆమోదం తెలిపారు.ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని.. వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రెండుసార్లు వివరణ వెళ్లినా.. ఆమె సంతృప్తి చెందకపోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇవాళ క్లారిఫికేషన్‌ ఇవ్వగా.. ఆమె సంతృప్తి చెందారు. ఆ తర్వాత రవాణాశాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్‌తో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించనున్నట్లు సమాచారం.

గవర్నర్ తమిళ సై ప్రభుత్వానికి చురకలు ..

ఆర్టీసీకి ఉన్న ఆస్తులు, భూములు, ఇతర ప్రాపర్టీస్ ఆ సంస్థతోనే ఉండాలి. ఈ మేరకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అండర్‌టేకింగ్ ఇవ్వాలి.

ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. అవసరమైతే ఔట్ సోర్సింగ్ సంస్థకు బాధ్యత అప్పజెప్పి సంస్థ (ఆర్టీసీ)పై ఆర్థిక భారం లేకుండా చూడాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆర్టీసీ ఆస్తుల పంపిణీ విభజన చట్టం ప్రకారం పూర్తికావాలి.

సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఉనికిలో ఉన్నప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలి.

ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర డిపార్టుమెంట్లలోకి డిప్యూటేషన్‌పై వెళ్తే వారి వేతనం, గ్రేడ్, పే స్కేల్, పదోన్నతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పే స్కేల్, సర్వీస్ రూల్స్, నియమ నిబందనలు, బదిలీలు, వేతనాల చెల్లింపు, పదోన్నతులు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛన్, పీఎఫ్, గ్రాట్యుటీ తదితరాలు అమలుకావాలి.

ఆర్టీసీ కార్మికులు స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటి ఒత్తిడులతో బాధపడుతూ ఉద్యోగానికి ‘అన్‌ ఫిట్’గా మారితే మెడికల్ గ్రౌండ్స్‌కు అనుగుణంగా వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం అందాలి.

ఆర్టీసీ సంస్థలో సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇకపైన ప్రభుత్వంలో విలీనమవుతున్నందున మానవతా దృక్పథంలో ఉండేలా సర్వీస్ రూల్స్ నిబంధనల్లో మార్పులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అమలు చేయాలి.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి సమానంగా ఉండేలా చూడాలి. వారికి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం అందాలి.

రెగ్యులర్ లేదా నాన్-పర్మినెంట్ ఉద్యోగులు సర్వీసులో ఉన్నంతకాలం ప్రస్తుతం ఆర్టీసీలో వైద్యపరంగా అందుకుంటున్న సౌకర్యాలన్నీ ఇకపైన కూడా కొనసాగాలి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా కంటిన్యూ కావాలి.గవర్నర్ ఆమోదంతో ఇవాళే బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును రూపొందించాలని అధికారులను ఆదేశించారు. స్వల్పకాలిక చర్చ అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రజాగాయకుడు గద్దర్‌ (74) కన్నుమూత

హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో గద్దర్‌ కన్నుమూత

తన పాటలతో ప్రజాగాయకుడిగా గుర్తింపు పొందిన గద్దర్‌

ప్రజాయుద్ధనౌకగా పేరు తెచ్చుకున్న గాయకుడు గద్దర్‌

ప్రజాగాయకుడు గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు

1949లో జన్మించిన ప్రజాగాయకుడు గద్దర్‌

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్‌

ప్రజాగాయకుడు గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు

Tomato: రెండు నెలల్లో టమాటా అమ్మి కోటీశ్వరుడయ్యాడు.. కారు, ట్రాక్టర్ కొన్నాడు

Tomato: టమాటా ధరలు సామాన్య ప్రజలను కంటతడి పెట్టించగా.. కొంతమంది రైతులను మాత్రం ధనవంతులను చేసింది. కేవలం రెండు నెలల్లో చాలా మంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులు అయ్యారు..

ప్రస్తుతం టమాటా ధరలు కిలో 250 నుంచి 300 రూపాయలకు చేరుకున్నాయి. దీంతో చాలా మంది రైతుల ఆదాయం కోట్లకు చేరింది.

కరోడ్‌పతి క్లబ్‌లో చేరిన తర్వాత రైతులు తమ ఇళ్ల నుంచి ట్రాక్టర్లు, కార్ల వరకు అన్నీ కొనుగోలు చేశారు. అటువంటి పరిస్థితిలో విపరీతమైన ప్రయోజనాల కారణంగా 2023 సంవత్సరాన్ని రైతులు ఎప్పటికీ మరచిపోలేరు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం పులమామిడిలో నివాసముంటున్న కె అనంత్ రెడ్డి టమాటా విక్రయిస్తూ కొత్త ట్రాక్టర్, హ్యుందాయ్ వెన్యూ కారు కొనుగోలు చేశారు. ఈ కారు ధర లక్షల్లో ఉంటుంది. ఈ ఏడాది ఎకరాకు రూ.20లక్షలు అధిక ధరతో టమాటా పండించిందని రైతు తెలిపాడు.

కర్ణాటకలోని తలబిగపల్లికి చెందిన 35 ఏళ్ల అరవింద్ టమాటాల ద్వారా వచ్చిన ఆదాయంతో రూ.1.4 కోట్లు సంపాదించాడు. ఈసారి ఐదెకరాల భూమిలో టమాటా సాగు చేశాడు. ఈ సంపాదనతో తల్లి కోసం ఓ విలాసవంతమైన ఇల్లు కొన్నారు. అరవింద్ ఈ ఏడాది టమాటా అమ్మడం ద్వారా రూ.3 కోట్లు సంపాదించాడు..

Chandrababu: ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవు..

నెల్లూరు: ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt) కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్దభేరి చేపట్టామని, సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు..

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు (Nellore) వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని, నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చునని చెప్పారు.

సోమశిల (Somashila), కండలేరు (Kandaleru) పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు..

2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి కోసం ఒక విజన్‌తో ముందుకెళ్ళామని, ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీర్చిన తరువాతే చెన్నైకి నీరిస్తమని ఆనాడు ఎన్టీఆర్ (NTR) తేల్చి చెప్పారని చంద్రబాబు అన్నారు.

రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి చేసింది టీడీపీయేనన్నారు. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ నెల్లూరుకు నీళ్లు అందించామన్నారు. వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీలు తీసుకొస్తే మొత్తం 250 టీఎంసీ నీరు రాయలసీమ, నెల్లూరుకు ఇవ్వవచ్చునన్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు..

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది..

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు.

తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు.

ధూల్‌పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్‌ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్‌పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు.

గుడుంబా నిషేధం తర్వాత ధూల్‌పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్‌పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి..

అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క

సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు.

అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.

జీరో అవర్‌లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని చాలా మంది తమకు చెప్తున్నారన్నారు. మరి తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలా మాట్లాడేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు కానీ తాము ఒక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని విమర్శించారు. సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని సీతక్క అన్నారు.

మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారని అడిగారు.అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ధ్వజమెత్తారు.

నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారని అన్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సభ నిర్వాహణ తీరు తమలాంటి వారికి బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిపై లఘు చర్చ ప్రారంభమైంది.

ఈ చర్చను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ముగింపు ప్రసంగం చేయనున్నారు..