*రూ.2వేల నోట్ల రద్దు*

ముంబయి: రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే, నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది.

1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంటోంది? 

ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు మాత్రమే.

2. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందా? 

అవును. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది.

3. సాధారణ లావాదేవీలకు ఈ నోట్లను ఉపయోగించవచ్చా? 

వినియోగించొచ్చు. రూ.2వేల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.

4. రూ.2 వేల నోటు కలిగి ఉన్నవారు ఏం చేయాలి? 

రూ.2నోటు ఉన్నట్లయితే బ్యాంకుకు వెళ్లి వాటిని తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమో చేయాలి. అయితే, ఈ సదుపాయం 2023 సెప్టెంబర్‌ 30వరకు ఉంటుంది. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.

5. బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఏదైనా పరిమితి ఉందా? 

బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఎటువంటి ఆంక్షలూ లేవు. కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి వాటిని డిపాజిట్‌ చేసుకోవచ్చు.

6. రూ.2 నోటు మార్చుకునేందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? 

ప్రజలు ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.

7. ఈ నోట్లను బిజినెస్‌ కరెస్పాండెంట్‌ (బీసీ)లతో మార్చుకోవచ్చా? 

మార్చుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఉండే బిజినెస్‌ కరెస్పాండెంట్‌ల నుంచి రోజుకు కేవలం రూ.4వేలు మాత్రమే మార్చుకోవచ్చు.

8. ఏ తేదీ నుంచి నోట్లను మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది? 

2023 మే 23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది.

9. అకౌంటు ఉన్నవారు అదే బ్రాంచీలో మార్చుకోవాలా? 

లేదు. ఏ బ్యాంకులోనైనా రూ.2నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.

10. ఎవరికైనా రూ.20వేలకంటే ఎక్కువ అవసరమైతే ఏం చేయాలి? 

డిపాజిట్‌పై ఆంక్షలు లేవు. రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయవచ్చు. అనంతరం తమ అవసరానికి అనుగుణంగా వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.

11. నోట్లను మార్చుకోవడానికి అదనంగా ఏమైనా చెల్లించాలా? 

లేదు. నోట్ల మార్పిడి పూర్తిగా ఉచితం

12. వయోవృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకుల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా? 

వయోవృద్ధులు, వికలాంగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించాం.

13. తక్షణమే రూ.2వేల నోటును డిపాజిట్‌ చేయకుంటే ఏమవుతుంది? 

ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువులోగా వాటిని డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమే చేయాలని సూచిస్తున్నాం.

14. రూ.2వేల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే ఏం చేయాలి..? 

సేవల్లో ఏదైనా లోపం జరిగితే వినియోగదారుడు తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు స్పందించకపోవడం లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే రిజర్వు బ్యాంకు-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ (RB-IOS), 2021 కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఊసరవెల్లి..

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి కలకలం రేపాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు..

ఒక మహిళా మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే 13 విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు..

మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ ను తనిఖీ చేశారు. మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు..

పాములు పట్టే వారిని రప్పించి పాములను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

టెక్సాస్‌లో భారీ పేలుడు... మృత్యువాత పడ్డ 18 వేల అవులు

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ప్రమాదం జరిగింది. డిమ్మిట్‌లోని సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 18,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ ఘటన ఏప్రిల్‌ 10న జరిగినట్లు సమాచారం.

డెయిరీఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్‌ అధికమొత్తంలో విడుదలైందని అందుకే ఆవులు మృతి చెంది ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలో సాధారణంగానే మీథేన్‌ వాయువు వెలువడుతుంది. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దాని ద్వారా మీథేన్‌ బయటికి వస్తుంది.

2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారిని అక్కడి జంతు సంరక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.

చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు హుగ్లీ నది క్రింద విజయవంతంగా ట్రయల్ రన్

 దేశంలో మొట్ట మొదటిసారిగా హుగ్లీ నది క్రింద సొరంగం ద్వారా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది కోల్‌కతా మెట్రో. ఇది దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మార్గంలో వచ్చే 7 నెలల పాటు రెగ్యులర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని,

ఆ తరువాత, సాధారణ ప్రజలకు సాధారణ సేవలు ప్రారంభమవుతాయని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.

 హౌరా నుండి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం పొడవు సుమారు 4.8 కి.మీ. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది. సొరంగం నీటి ఉపరితల మట్టం క్రింద 32 మీటర్లు ఉంది.

గ్రేటర్ నోయిడా షాకింగ్ సంఘటన... తప్పిపోయిన పాప పక్కింట్లో వారి సూట్‌కేస్‌లో శవమై...

గ్రేటర్ నోయిడా లోని సూరజ్‌పూర్ ప్రాంతంలోని దేవ్లా గ్రామంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 

రెండు రోజుల గా కనిపించని 2 సంవత్సారాల పాప పొరుగువారి ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.  

వివరాల్లోకి వెళ్ళితే...

దేవ్లాలో అద్దెకు ఉంటున్న శివ కుమార్, అతని భార్య ఇద్దరు పిల్లలలో నివసిస్తున్నారు. శివకుమార్ స్థానిక కర్మాగారం లో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 7న శివకుమార్ డ్యూటీలో ఉండగా, అతని భార్య పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా ఆమె జాడ కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.

ఆదివారం మధ్యాహ్నం ఇంటి తాళం వేసి ఉన్న పక్కింటి నుంచి దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

 సూరజ్‌పూర్‌కు చెందిన పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుని ఇంటిని వెతకగా అక్కడ సూట్‌కేస్‌లో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు రాఘవేంద్ర అనే వ్యక్తికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్...

 గడిచిన 24 గంటల్లో దేశంలో 5880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,96,318 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,23,527 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 85, 980 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,62,496 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 99 శాతంగా ఉంది.ఇక దేశంలో 14 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,979 కి చేరింది.

Karnataka: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తొలి జాబితా విడుదల చేయనున్న BJP

 రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అన్ని పార్టీలు. 

ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. అధికార బీజేపీ ఈ రోజు తొలి జాబితా రిలీజ్ చేయనుంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. బీజేపీ నేడు 120 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని తెలిసింది. కర్ణాటకలోనే ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాని ఖరారు చేసినట్లు తెలిసింది. 

ఐతే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జ్యోషి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.

 ఇవాళ్టి జాబితా రిలీజ్‌తో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం

బంగారం - వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధరరూ.55, 940.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.61,010 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ 60,860 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ.61,520.

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860.

 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 24 క్యారెట్ల బంగారం ధర 60,860  

 విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర 60,860.  

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200.

అది ఓ వజ్రాల గని.. మీరు తవ్విన డైమండ్స్‌ అన్నీ మీకే..!!

భూమి మనదైనా.. అందులో ఏమైనా బంగారం, వజ్రాలు దొరికితే అది ప్రభుత్వానికే ఇవ్వాలి.. అలాంటిది.. అక్కడ భూమి మనది కాదు.. కానీ వజ్రాలు ఉంటాయి.. మీకు గానీ అవి దొరికాయంటే.. అవి మీకే ఇస్తారట. మధ్య అమెరికాలో ఉన్న అర్కాన్సాస్ నైరుతి భాగంలో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ అనే ప్రదేశం ఉంది. దేశంలోనే అన్ని రకాల వ్యక్తులకు అనుమతి ఉన్న వజ్రాల గని ఇదే.

911 ఎకరాల స్టేట్ పార్క్‌లో భాగంగా డైమండ్ పిట్ 1972లో ప్రజల కోసం తెరవబడింది. అప్పటి నుంచి, విలువైన రాళ్లను తవ్వడానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు సందర్శిస్తారు. విలువైన రాళ్లు పెద్ద సంఖ్యలో ఉండవు. 1972 నుండి ఇప్పటి వరకు దాదాపు 35,000 రాళ్ళు ఇక్కడ గుర్తించారట.. 1906లో జాన్ హడిల్‌స్టోన్ తన పొలంలోని మట్టిలో రెండు వింత స్ఫటికాలను కనుగొన్నాడు.. అప్పుడే మొదటిసారు వజ్రాలు బయటపడ్డాయి.. తన పొలం లాంప్రోయిట్ ధాతువుతో నిండిన లావా ట్యూబ్ పైన ఉందని తరువాత మాత్రమే అతను గ్రహించాడు. అప్పటి నుంచి భూమి చేతులు మారింది. ఈ భూమిలో లభించే విలువైన రాళ్ల గురించి పట్టణంలోని ప్రతి ఒక్కరికి తెలిసింది.

1800లలో ఆఫ్రికాలో వజ్రాల వేట జరిగినట్లే ఇక్కడ కూడా వజ్రాల వేట జరిగింది. కానీ 1919లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఆ ప్రదేశం మూతపడింది. 1950లో పునఃప్రారంభించారు.. ఇదే క్రమంలో… 1972లో పబ్లిక్ స్పేస్‌గా మారింది. ఆ తర్వాత ఇక్కడ తవ్విన పదార్థాలన్నీ తవ్వినవారి సొత్తుగా మారాయి.. వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ గని వజ్రం మాత్రమే కాదు, అమెథిస్ట్ కూడా – గోమేదికం, కాల్సైట్, పెరిడోట్, సుమారు 40 వివిధ విలువైన ఖనిజాలను వీటిని తవ్విన వారికే తీసుకెళ్లేందుకు కూడా అనుమతించారు..

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ లభించిన కొన్ని రత్నాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటివరకు కనుగొనబడిన రెండు అతిపెద్ద వజ్రాలు ఉన్నాయి, 40.23-క్యారెట్ అంకుల్ సామ్ (1924), 34.25-క్యారెట్ స్టార్ ఆఫ్ ముర్‌ఫ్రీస్‌బోరో (1964), తర్వాత 15.33-క్యారెట్ స్టార్ ఆఫ్ అర్కాన్సాస్ (1956). ), ప్రజాదరణ పొందింది. ఇతర రాళ్లు పరిమాణంలో ఇవి చిన్నవి కానీ విలువలో మాత్రం ఎక్కువే. ఇక్కడకు ఎవరైనా వెళ్లొచ్చట..

ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ బల్లగుద్ది మరీ చెబుతుంది.

అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షణ కొరియా 2017 నుంచి 2020 మధ్యలో తమ మాతృభూమిని వదిలి వచ్చిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

నర్సుల చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి.. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్ లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించిన ఏదైనా ఆన్ లైన్ లో షేర్ చేసినా.. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజీన్ చూస్తు.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు పేర్కొంది.

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టానుసారంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ.. అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ మంత్రిత్వశాఖ సమర్పించింది.