ఇది సమ్మెల తెలంగాణా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
2013లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సభలో మాట్లాడుతూ, ఇక సమ్మెలు లేని తెలంగాణను తెచ్చుకుందాం అని చెప్పినట్లుగా గుర్తుంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన తర్వాత కూడా సమ్మెలు, రోడ్లపై ధర్నాలు ఆగలేదు. గత పది రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
నేను నల్గొండ జిల్లాలోని మునుగోడు, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో వారి సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపాను. నిన్న మొన్నటి వరకు గ్రామాలను అందంగా తీర్చిదిద్ది, అవార్డులు తెచ్చి, ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఉద్యోగులు రోడ్ల మీద కూర్చోవటం చూస్తే, వారి పసిపిల్లలు ‘కేసీఆర్ తాతా! మా అమ్మను రెగ్యులరైజ్ చేయండి!’ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని సమ్మెలో పాల్గొనటం చూస్తే... గుండె బరువెక్కింది. బాగా చదివి పరీక్ష రాసి మెరిట్ ప్రకారం ఉద్యోగం సంపాదించి నాలుగేళ్లు సేవలందించి మళ్లీ రోడ్లపైకి రావడం బహుశా దేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే జరుగుతుంది. వారంతా పీజీ, పీహెచ్‌డీలు చేసిన ఉన్నత విద్యావంతులు. పాలకుల స్వార్థం, కుట్రపూరిత రాజకీయాల వల్ల గతిలేక ఉద్యోగంలో చేరవలసిన పరిస్థితి వచ్చింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయితీ అవార్డుల్లో, 2.5లక్షల గ్రామ పంచాయితీలు పాల్గొనగా, 46 గ్రామాలు అవార్డులు పొందితే, అందులో 13 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని అంటే దాదాపు 30శాతం అవార్డులు సాధించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి దయాకర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. నేడు అదే శాఖకు చెందిన కార్యదర్శులు వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి, మాకు భద్రత కావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ నెం.2560/సీపీఆర్ & ఆర్‌ఈ/బి2/2017 ప్రకారం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మూడేళ్లను ప్రొహిబిషనరీ కాలంగా నిర్ణయించి, ప్రతిభ ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్‌లోని పేరా నెంబరు ఆరు, ఐటమ్ నెంబరు ఐదులో స్పష్టంగా పేర్కొన్నది. వాస్తవానికి ప్రొహిబిషనరీ కాలం ఏ ఉద్యోగానికైనా రెండేళ్లకు మించి ఉండదు. అంటే ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధం. అయినా మూడేళ్ళే కదా అని కష్టపడి పనిచేస్తే, మోసపూరితంగా ప్రభుత్వం జీవో నెం.26 ప్రకారం ప్రొహిబిషనరీ కాలాన్ని మరో ఏడాది కాలం పాటు పెంచింది. అయినా పంచాయతీ కార్యదర్శులు మరో ఏడాది పనిచేసి ప్రభుత్వానికి ఎనలేని సేవ చేశారు. ఈ నాలుగేళ్ళ కాలం పాటు, తమకంటే చిన్న ఉద్యోగి కంటే కూడా తక్కువ జీతం తీసుకొని గొడ్డు చాకిరీ చేశారు. జీవో కాలపరిమితి కూడా ఈ నెల ఏప్రిల్ 11తో ముగిసింది. ప్రభుత్వం మళ్లీ మాట తప్పింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కిందిస్థాయి ఉద్యోగి ఒక్కరు కూడా సంతోషంగా లేరు. గతంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పనిభారం ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.4779 రద్దు చేయాలని, 18 రోజులపాటు సమ్మె చేసినందుకు ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగించింది. తిరిగి రెండేళ్ళ తరువాత డిమాండ్లు నెరవేర్చకుండానే విధుల్లోకి తీసుకుంది. అనంతరం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని చెబుతూ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, వారందరినీ ఇష్టవిరుద్ధంగా ఇతర శాఖలకు బదిలీ చేసి ప్రభుత్వ నిరంకుశ, నియంత పోకడలను ఋజువు చేసుకున్నారు. అనంతరం వీఆర్‌ఏలు తమకు పే స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, దాదాపు 80రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే, మునుగోడు ఎన్నికల సందర్భంగా, స్వయంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ రెండుసార్లు పిలిపించి మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పటి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా పిలిపించి ఉద్యోగులను పిలిపించి బుజ్జగించడంతో వీఆర్‌ఏలు అందరూ నమ్మి తిరిగి విధుల్లో చేరారు. మునుగోడు ఎన్నికలు ముగిసి నేటికి ఆరు నెలలు గడిచాయి. కానీ వారిని పట్టించుకున్న నాధుడే లేడు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు, ఆయాలు పనికి తగ్గ వేతనం, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే, ఇప్పటివరకు వాళ్లనూ పట్టించుకోలేదు. పైగా పనిభారం పెంచుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాల్లో పనిచేసే వీఓఏలు కనీసం ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం, అమలు కోసం మాత్రమే వీరిని వాడుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఒప్పంద ఉద్యోగులను ఆర్టిజన్ ఉద్యోగులుగా మార్చి, ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ పని చేయించుకుంటున్నారు. కానీ ఉద్యోగ భద్రత ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే, రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా సమ్మె చేస్తామంటే, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించి, అక్రమంగా అరెస్టులు చేసి, సమ్మె విరమించాలన్నారు తప్ప, వారి బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు తమకు పదోన్నతులు కల్పించాలని, తమకంటే జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చి తమకు మాత్రం ఇవ్వలేదని, ఇది ఆత్మగౌరవ సమస్య అని, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వేడుకుంటూ దాదాపు 47సార్లు వినతి పత్రం ఇచ్చినా, కనీసం ఫైల్ చూడని దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతుంది. 317 జీవో వల్ల నష్టపోయిన వారు, ఇబ్బంది పడుతున్న వారు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు రాక, సీపీఎస్ పెన్షన్ విధానం వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూపుతూ, అవమానకరంగా వ్యవహరిస్తున్నది.
ఇది బంగారు తెలంగాణ కాదు, సమ్మెల తెలంగాణగా మారింది. ఉద్యోగులే తమకు న్యాయం కావాలని సమ్మె కార్యక్రమాలు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో ఉంది. కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేయడం లేదా, వారికి హక్కులు లేవా? వారికి ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? వారు నెలకు 4.25 లక్షల జీతం అడగడం లేదు కదా? ప్రభుత్వం స్పందించాలి, సమాధానం చెప్పాలి.
ఇది పేద వర్గాల సమస్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలే మెజారిటీ ఉద్యోగులుగా ఉన్నారు. వారంతా ఆ ఉద్యోగాలను నమ్ముకొని, ఇతర అవకాశాలన్నీ వదులుకొని జీవిస్తున్నవారు. ఇది వారి ఆత్మగౌరవ సమస్య, జీవన్మరణ సమస్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించకూడదు.
May 11 2023, 15:13