70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా.తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా.
AP BRS Office
70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా...
తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా...
ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర సూటి ప్రశ్న
విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఉక్కు సంకల్ప పోరు....
8వ తేదీన విశాఖ పర్యటనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ప్లాన్
ఈ నెల పదో తేదీని వైజాగ్ స్టీల్ ఉద్యోగ సంఘాలతో భేటీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు భారత రాష్ట్ర సమితి ఆంధప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ను తన వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. పరిశ్రమలన్న తర్వాత లాభనష్టాలుంటాయని.. ప్రైవేటు రంగంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉన్న టాటా ప్లాంట్ కూడా 70 వేల కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కానీ.. టాటా కంపెనీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనేందుకు ఆసక్తి చూపుతోందని తెలిపారు. అసలు నష్టాల్లో ఉన్న టాటా స్టీల్.. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా టేకప్ చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. జిందాల్ స్టీల్, అదానీ గ్రూప్ ఇలా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 2014 నుంచీ ఉద్దేశపూర్వంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు. అయినా 2021-22 వార్షిక సంవత్సంలో స్వల్ప లాభాలు ఆర్జించిన విశాఖ ఉక్కు కర్మాగారం.. ఇవాళ 30 వేల కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని వివరించారు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న తోట.. ఏపీలో పార్టీలన్నీ ప్రేక్షక వహించడం ద్వారా బీజేపీ సహకరిస్తున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా దొడ్డిదారిన ప్రైవేటు భాగస్వామ్యాల్ని ఆహ్వానించేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసుని కేంద్రం విడుదల చేసిందని బీఆర్ఎస్ మాత్రమే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రి కేటి రామారావు రాసిన బహిరంగ లేఖకు సమాధానం చెప్పే దమ్ముందా అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని పార్టీలు ఏమీ చేయలేవనే ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు తెలిపారు. ఏపీలో పార్టీలన్నీ బీజేపీ చేతిలో తోలు బొమ్మలుగా మారాయని.. కేంద్రం చెప్పినదానికి జీహుజూర్ అంటూ తలాడించేలా తయారయ్యాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని ఆ దిశగా బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాంతాలకు అతీతంగా 32 మంది తెలుగు వాళ్లు బలిదానాలు చేశారని, వాటిని పట్టించుకోకుండా వ్యవహరించడం చారిత్రక తప్పిదం అవుతుందని తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఏకమైతే ఈ దుశ్చర్యని కచ్చితంగా అడ్డుకొని తీరతామని వెల్లడించారు. విశాఖ ప్లాంట్కు 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని వాటిని కారుచౌకగా కొట్టేసేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీ ఇందులో ముందు వరుసలో ఉన్నారని ఈ విషయం గూగుల్ కూడా చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గూగుల్లో 'హూ వాంట్స్ టు బై వైజాగ్ స్టీల్ ప్లాంట్' అని కొడితే అదానీ పేరే చూపిస్తోందని తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం గంగవరం పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకున్నట్లే.. విశాఖ స్టీల్ ప్లాంట్ను చౌకగా కొట్టేసే కుట్రలు జరగుతున్నాయ చంద్రశేఖర్ విమర్శించారు. అదానీ కాకపోతే మోదీ వ్యాపార మిత్రులు మరొకరైనా దీన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాలతో భేటీ కానున్నట్టు డాక్టర్ తోట చంద్రశేఖర్ వెల్లడించారు. ఈనెల పదో తేదీన విశాఖలో ఆయా బృందాలతో చర్చలు జరుపుతామని, పార్టీ అధిష్టానంతో చర్చించి స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన వివరించారు.
Apr 07 2023, 17:48