Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెరుగుతాయి. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-వరంగల్ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి.
విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. రోజుకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా సుమారు 30 వేలకు పైగా, గూడురు టోల్‌ప్లాజా వద్ద 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుంటాయి. తాజాగా టోల్‌ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనాలకు వాటి స్థాయిని బట్టి ఒకవైపు, ఇరువైపులా కలిపి రూ.5 నుంచి రూ.40 వరకు, స్థానికుల నెలవారీ పాస్‌లపై రూ.275 నుంచి రూ.330 వరకు టోల్ రుసుములు పెరిగాయి. ఈ ధరలు 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
Apr 01 2023, 09:16