'జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష'కు అత్యంత ప్రాధాన్యం: సీఎం జగన్
తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు..
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేపట్టడం లేదని.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం అని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామన్నారు.
ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని సీఎం పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు..
జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించారు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్న సీఎం.. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం అన్నారు.
Mar 31 2023, 20:19