హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు.

రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్రి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి శుక్రవారం ఉదయం కొత్తగూడెం చేరుకుంటారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్ హౌజ్​లో బస చేస్తారు. రాములోరి పట్టాభిషేకంలో పాల్గొన్న తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు.

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

తెనాలి టూ టౌన్ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఐతానగర్ ప్యాడిసన్ పేట కమ్యునిటీ హాలు వద్ద ఐలా శ్రీనివాస్, మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు..

కమ్యునిటీ హాలు వద్ద కూర్చుని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు. నర్సీపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్ధానికంగా విక్రయిస్తున్న ముఠాను తెనాలి టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డిఎస్పీ కె స్రవంతి రాయ్ తెలియజేశారు..

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…ఐతానగర్‌కు చెందిన ఐలా శ్రీనివాస్‌ గతంలో గంజాయి, దొంగతనం, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నర్సీపట్నం నుండి విష్ణు అనే వ్యక్తి ద్వారా గంజాయి దిగుమతి చేసుకుని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఐతానగర్‌లోని ప్యాడిసన్ పేటలో గల కమ్యూనిటీ హాలు వద్ద మరో ఐదుగురితో కలిసి గంజాయిని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు చేస్తుండగా టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ బి శివరామయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్దలానికి వెళ్లి ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌తో పాటు నందులపేటకు చెందిన దేవరకొండ మను శివ శంకర్‌, ఐతానగర్‌కు చెందిన తాడికొండ చంద్రశేఖర్‌, తాతపూడి సునీల్‌, పల్లె సంజయ్‌, వల్లభాపురపు సునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 15 కేజీల జంగాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు.

ఏపీ ::ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ పలువురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..

వారిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తరువాత.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఆయనను నియోజకవర్గం నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చాయి.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. నేడు రోడ్డు మీదకు వచ్చారు. బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చున్నారు. తాను వస్తే తరిమేస్తానని సవాల్ చేసిన వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు.

బస్టాండ్‌ సెంటర్‌లో కలియతిరిగారు. వైసీపీ నాయకత్వం తనపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. తాను. పార్టీలో లేనని చెప్పి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను ఇక్కడి నుంచి నుంచి తరిమికొట్టాలని సవాల్ విసిరారు.

మధ్యప్రదేశ్ ::శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి..11 మంది మృతి.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి..11 మంది మృతి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావి కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. 11 మంది మృతదేహాలు బయటకు తీశామని..మరో 19 మందిని సిబ్బంది సురక్షితంగా రక్షించామని ఇండోర్ కలెక్టర్ డాక్టర్ టి. ఇళయరాజా వెల్లడించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్రప్రదేశ్ సీఎం చౌహాన్.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 కు పైగా మంది మెట్ల బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికులు సైతం బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తు్న్నారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

న్యూడిల్లీ :కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో. ఏపీ.ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ,

న్యూఢిల్లీ

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం

ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు

ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు

1. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరిన సీఎం. 

2. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించిన సీఎం. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం

3. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరిన సీఎం.

4. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరిన సీఎం. 

5. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరిన సీఎం. 

6. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలన్న సీఎం.  

7. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలన్న సీఎం.

8. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించిన సీఎం. 

9. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం.

బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు.

బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు


‘బలగం’ సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6 తెలుగు వార్తా ఛానెల్ లో ప్రసారమైన కథనంపై స్పందించిన మంత్రి… పుట్టెడు కష్టాలతో, అనారోగ్య సమస్యలతో సతమవుతున్న మొగిలయ్యకు కావాల్సిన మందులు అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాలసిస్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలని సూచించారు.  

కరోనా టైంలో మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. దీంతో ఆయన రోజు తప్పించి రోజు డయాలసిస్ కోసం దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మొగిలయ్యను మరో హెల్త్​ ప్రాబ్లమ్​ చుట్టుముట్టింది. బీపీ, షుగర్‍ పెరగడంతో.. ఆయన రెండు కండ్లపై ఎఫెక్ట్ పడింది. ఎప్పట్నుంచో బీపీ, షుగర్‍ తో బాధపడుతున్న ఆయనకు .. ఇప్పుడు ఆ ప్రభావం మిగతా అవయవాలపైనా పడింది. ‘బలగం’ సినిమా చేస్తున్న సమయంలోనూ ఓ సారి ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. హాస్పిటల్​ కు తీసుకెళ్లి చెక్​ చేయిస్తే.. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. టెస్టులు చేయిస్తే.. రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు రిపోర్ట్​ వచ్చింది. ఇంతకుముందు కరోనా సోకడం వల్లే మొగిలయ్య కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు అన్నారు. ఇక డయాలసిస్ చేయించడం కంపల్సరీ అని చెప్పారు. దీంతో అప్పటినుంచి వారానికి మూడు రోజులు హాస్పిటల్​ కు వెళ్లి డయాలసిస్​ చేయించుకుంటున్నారు.

వరంగల్​ సిటీకి వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతున్నది. ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని మొగిలయ్య భార్య కొమురమ్మ ఏడుస్తూ చెప్పారు. నమ్ముకున్న కళ ద్వారా సంపాదించుకున్న రూ.8 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేశామని, మరో రూ.6 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో డయాలసిస్‍ చేయడానికి కూడా మొగిలయ్య శరీరం సహకరించడం లేదని డాక్టర్లు అంటున్నారు. మెరుగైన ట్రీట్‍మెంట్‍ కోసం రూ.3 లక్షలు అవసరమని చెప్తున్నారు.


 కండ్లు మళ్లీ కనపడాలంటే మొగిలయ్యకు రెండుసార్లు ఆపరేషన్‍ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు కావాల్సిన దాదాపు రూ.2 లక్షలు కూడా ప్రస్తుతం మొగిలయ్య దగ్గర లేవు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా.. అన్ని రకాల ట్రీట్‍మెంట్‍, మందుల కోసం దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతాయని కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న మారాజులు తమను ఆదుకోవాలని ఈ దంపతులు కోరుతున్నారు.  

లైంగికవాంఛ తీర్చమన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపేసిన యువతి.. ఎక్కడ?

లైంగికవాంఛ తీర్చమన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపేసిన యువతి.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం, ఎర్రలవాడలో ఓ యువకుడు యువతి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. లైంగికవాంఛ తీర్చాలంటూ తనను వేధిస్తుండటాన్ని తట్టుకోలేని ఆ యువతి యువకుడిని విచక్షణా రహితంగా చంపేసింది. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఎర్రలవాడ మండలానికి చెందిన శ్రీను (30) అనే వ్యక్తి తనను ప్రేమించాలని వేధింపులకు పాల్పడుతుండటంతో అదే గ్రామానికి చెందిన 24 యేళ్ల యువతి ఈ హత్యకు పాల్పడింది. ఆ యువకుడిని నమ్మించి ఆ తర్వాత ఆ యువకుడి చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేసింది. హత్య అనంతరం ఆమె స్థానిక పోలీస్ సేషన్‌లో లొంగిపోయింది. శ్రీను హత్యకుగురైన విషయం తెలుసుకున్న స్థానికులు ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

*సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో శ్రీ సీత రామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం 20 లక్షలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు వచ్చే సంవత్సరం శ్రీ రామనవమి వరకు కల్యాణ మండపం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం నెలకొల్పారని ఆయన పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ సీతారాముల క్షల్యాణం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణా రాష్ట్ర ప్రజలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణా లో ఊరూరా జరుపుకుంటున్న శ్రీరామ నవమి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సీతారాముల దీవెనలు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ జెడ్పిటిసి మాద ధనలక్ష్మినగేష్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, గుడి చైర్మన్, సర్పంచులు,ఎంపిటిసిలు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆదిపురుష్ : రామనవమి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆదిపురుష్‌ టీం.. సోషల్ మీడియాలో విమర్శలు.

ఆదిపురుష్ : రామనవమి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆదిపురుష్‌ టీం.. సోషల్ మీడియాలో విమర్శలు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురినిగా సైఫ్ అలిఖాన్ నటిస్తున్నాడు. అయితే, శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫొటో ప్రతి రూపంగా ఈ పోస్టర్ ని నిర్మించారు. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్‌’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది.

ఈ పోస్టర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రాముడికి తలపై కిరీటం లేదని, అతడికి ఇచ్చిన దుస్తుల్లో, లుక్స్ లో సాత్వికం కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రాముడి లుక్ కంటే.. సీత లుక్ పైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సీతకు ఒక శాలువ లాంటిది కప్పడంపై విమర్శలకు తావిస్తోంది. అటు లక్ష్మణుడి పాత్రలో కూడా భక్తిభావం కాకుండా, వీరత్వం కనిపిస్తోందని అంటున్నారు విమర్శకులు.

దసరా మూవీ రివ్యూ : నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘

దసరా మూవీ రివ్యూ :

 

దసరా మూవీ రివ్యూ : నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’! అతని గత చిత్రాలు రెండు, మూడు భాషల్లో విడుదలైతే ఇప్పుడీ ‘దసరా’ ఏకంగా ఫైవ్ లాంగ్వేజెస్ లో జనం ముందుకొచ్చింది. తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఎలా ఉందో చూద్దాం.

ఇది 1995లో మొదలయ్యే కథ. అప్పట్లో ఎన్టీయార్ అధికారంలోకి వచ్చి రావడంతోనే మద్య నిషేధాన్ని ప్రకటించారు. వీర్లపల్లి గ్రామంలోని జనాలకు గొంతులోకి మందు దిగకపోతే పిచ్చెక్కిపోతుంది. దాంతో లోపాయికారిగా సిల్క్ బార్ ను నిర్వహించే వారికే సర్పంచ్ పదవి అనే షరతు పెడతారు. అలా శివన్న (సముతిర ఖని) సర్పంచ్ గా గెలుస్తాడు. రాజన్న (సాయికుమార్) ఓడిపోతాడు. అదే గ్రామానికి చెందిన ధరణి (నాని), సూరి బాబు (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుండి వెన్నల అంటే ధరణికి ఇష్టం. అయితే సూరిబాబుతో స్నేహం అంటే ప్రాణం. సూరి కూడా ధరణిని ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను చంపుకుంటాడు. గూడ్స్ బండిలో బొగ్గును దొంగిలించి, తాగి తందనాలు ఆడుతూ ధరణి, సూరి బాబు జీవితాన్ని గడిపేస్తుంటే… వెన్నెల అంగన్ వాడి టీచర్ గా పని చేస్తుంటుంది. ఆ గ్రామం నడిబొడ్డులోని సిల్క్ బార్ కేంద్రంగా ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. స్నేహం, ప్రేమలకు ప్రాధాన్యమిచ్చే ధరణి జీవితంలోకి పగ, ప్రతీకారాలు ఎలా ప్రవేశించాయి? తన వారికి జరిగిన అన్యాయానికి అతను ఎలాంటి ముగింపు పలికాడు? అనేదే మిగతా కథ.

ఇది దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి కథ కావడంతో అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిని రాసుకున్నాడు. మద్య నిషేధం, దాని ఆధారంగా సాగే గ్రామ రాజకీయాలు, కుల వివక్ష, దొరల కామదాహం… వీటన్నింటినీ ఈ సినిమాలో ఆయా సందర్భాలలో చూపించే ప్రయత్నం చేశాడు. స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే కథలు, తన స్నేహితుడికి అన్యాయం జరిగితే జీవితాన్ని పణంగా పెట్టే హీరో స్టోరీస్ మనకు కొత్త కాదు. పైగా ఈ సినిమా చూస్తున్నంత సేపు మొన్నటి ‘రంగస్థలం’, నిన్నటి ‘పుష్ప’ కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఇక చాలా సన్నివేశాలు పాత వాసలే వేస్తాయి. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏమిటీ సహజత్వం! ఈ కథను తెరకెక్కించడానికి దర్శకుడు, కథా దర్శకుడు పెద్ద తపస్సు చేశారనిపిస్తుంది. ఆ కారణంగా మనం సినిమా ఆరంభమైన కొద్ది నిమిషాలకే వీర్లపల్లి గ్రామంలోకి వెళ్ళిపోతాం. అందులోని పాత్రలు మన మధ్య జరుగుతున్నట్టుగానే అనిపిస్తాయి. ఆ పాత్రలు అంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి.


ఫస్ట్ హాఫ్ లో ధరణి, సూరిబాబు, వెన్నెల మధ్య స్నేహం, ప్రేమతో సాగిపోతుంది. అలాంటి సమయంలో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేసి ఆడియెన్స్ ను షాక్ కు గురిచేశాడు దర్శకుడు. ఇక దానికి కొనసాగింపుగా, సెకండ్ హాఫ్ లో హీరో రివేంజ్ పై దృష్టి పెట్టాడు. కథలో బోలెడన్ని మలుపులు, సెంటిమెంట్ సీన్స్ ఉన్నా… వాటితో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. ఏ సన్నివేశంకు అది బాగానే ఉంటుంది తప్పితే ఆ ఫీల్ ను క్యారీ ఫార్వర్డ్ చేయదు.

నేచురల్ స్టార్ అనే బిరుదుకు తగ్గట్టు నాని చాలా సహజంగా ధరణి పాత్రను పోషించాడు. ఇది అతని ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో మింగుడు పడటానికి కాస్తంత టైమ్ పడుతుంది. ఒక నటుడికి ఎలాంటి పాత్ర అయినా చేయగలనని నిరూపించుకోవాలనే కోరిక ఉంటుంది. దానిని నాని ఈ సినిమాతో తీర్చుకున్నట్టు అయ్యింది. అయితే వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్‌ ను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ రకంగానూ ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయింది. పైగా మునుపటి ఛార్మ్ కూడా లేదు. నాని స్నేహితుడిగా దీక్షిత్ శెట్టి బాగా నటించాడు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో అస్సలు నప్పలేదు. సముతిర ఖనికి ఎత్తు పళ్ళు పెట్టి కాస్తంత కొత్తగా తెర మీద చూపించారు తప్పితే, ఆయన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఝాన్సీ, పూర్ణ, సాయికుమార్, సురభి ప్రభావతి, రవితేజ నన్నిమాల తదితరులు తమ పాత్రలకు బాగానే న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సత్యన్ గురించి. కెమెరాపనితనం ఆసమ్. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ లో ఒకటి రెండు మాత్రామే బాగున్నాయి. మిగిలినవి సో… సో… గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ సీన్స్ లో అతని నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కానీ మోతాదుకు మించిన హింసను తెర మీద చూపించారు. నిర్మాణ విలువలు బాగుండం, నాని సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఓపెనింగ్స్ కు ఢోకా లేదు. నాని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ తరహా కథతో ఎంతవరకూ కనెక్ట్ అవుతారనేది సందేహమే!

రేటింగ్ : 2.75/5

ప్లస్ పాయింట్స్

నాని నటన

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్

పేలవమైన కథ

ఆకట్టుకోని సెంటిమెంట్

అతిగా యాక్షన్ సీన్స్

ట్యాగ్ లైన్: సరదా తీరింది!