ఆదిపురుష్ : రామనవమి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆదిపురుష్‌ టీం.. సోషల్ మీడియాలో విమర్శలు.

ఆదిపురుష్ : రామనవమి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆదిపురుష్‌ టీం.. సోషల్ మీడియాలో విమర్శలు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురినిగా సైఫ్ అలిఖాన్ నటిస్తున్నాడు. అయితే, శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫొటో ప్రతి రూపంగా ఈ పోస్టర్ ని నిర్మించారు. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్‌’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది.

ఈ పోస్టర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రాముడికి తలపై కిరీటం లేదని, అతడికి ఇచ్చిన దుస్తుల్లో, లుక్స్ లో సాత్వికం కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రాముడి లుక్ కంటే.. సీత లుక్ పైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సీతకు ఒక శాలువ లాంటిది కప్పడంపై విమర్శలకు తావిస్తోంది. అటు లక్ష్మణుడి పాత్రలో కూడా భక్తిభావం కాకుండా, వీరత్వం కనిపిస్తోందని అంటున్నారు విమర్శకులు.

దసరా మూవీ రివ్యూ : నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘

దసరా మూవీ రివ్యూ :

 

దసరా మూవీ రివ్యూ : నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’! అతని గత చిత్రాలు రెండు, మూడు భాషల్లో విడుదలైతే ఇప్పుడీ ‘దసరా’ ఏకంగా ఫైవ్ లాంగ్వేజెస్ లో జనం ముందుకొచ్చింది. తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఎలా ఉందో చూద్దాం.

ఇది 1995లో మొదలయ్యే కథ. అప్పట్లో ఎన్టీయార్ అధికారంలోకి వచ్చి రావడంతోనే మద్య నిషేధాన్ని ప్రకటించారు. వీర్లపల్లి గ్రామంలోని జనాలకు గొంతులోకి మందు దిగకపోతే పిచ్చెక్కిపోతుంది. దాంతో లోపాయికారిగా సిల్క్ బార్ ను నిర్వహించే వారికే సర్పంచ్ పదవి అనే షరతు పెడతారు. అలా శివన్న (సముతిర ఖని) సర్పంచ్ గా గెలుస్తాడు. రాజన్న (సాయికుమార్) ఓడిపోతాడు. అదే గ్రామానికి చెందిన ధరణి (నాని), సూరి బాబు (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుండి వెన్నల అంటే ధరణికి ఇష్టం. అయితే సూరిబాబుతో స్నేహం అంటే ప్రాణం. సూరి కూడా ధరణిని ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను చంపుకుంటాడు. గూడ్స్ బండిలో బొగ్గును దొంగిలించి, తాగి తందనాలు ఆడుతూ ధరణి, సూరి బాబు జీవితాన్ని గడిపేస్తుంటే… వెన్నెల అంగన్ వాడి టీచర్ గా పని చేస్తుంటుంది. ఆ గ్రామం నడిబొడ్డులోని సిల్క్ బార్ కేంద్రంగా ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. స్నేహం, ప్రేమలకు ప్రాధాన్యమిచ్చే ధరణి జీవితంలోకి పగ, ప్రతీకారాలు ఎలా ప్రవేశించాయి? తన వారికి జరిగిన అన్యాయానికి అతను ఎలాంటి ముగింపు పలికాడు? అనేదే మిగతా కథ.

ఇది దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి కథ కావడంతో అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిని రాసుకున్నాడు. మద్య నిషేధం, దాని ఆధారంగా సాగే గ్రామ రాజకీయాలు, కుల వివక్ష, దొరల కామదాహం… వీటన్నింటినీ ఈ సినిమాలో ఆయా సందర్భాలలో చూపించే ప్రయత్నం చేశాడు. స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే కథలు, తన స్నేహితుడికి అన్యాయం జరిగితే జీవితాన్ని పణంగా పెట్టే హీరో స్టోరీస్ మనకు కొత్త కాదు. పైగా ఈ సినిమా చూస్తున్నంత సేపు మొన్నటి ‘రంగస్థలం’, నిన్నటి ‘పుష్ప’ కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఇక చాలా సన్నివేశాలు పాత వాసలే వేస్తాయి. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏమిటీ సహజత్వం! ఈ కథను తెరకెక్కించడానికి దర్శకుడు, కథా దర్శకుడు పెద్ద తపస్సు చేశారనిపిస్తుంది. ఆ కారణంగా మనం సినిమా ఆరంభమైన కొద్ది నిమిషాలకే వీర్లపల్లి గ్రామంలోకి వెళ్ళిపోతాం. అందులోని పాత్రలు మన మధ్య జరుగుతున్నట్టుగానే అనిపిస్తాయి. ఆ పాత్రలు అంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి.


ఫస్ట్ హాఫ్ లో ధరణి, సూరిబాబు, వెన్నెల మధ్య స్నేహం, ప్రేమతో సాగిపోతుంది. అలాంటి సమయంలో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేసి ఆడియెన్స్ ను షాక్ కు గురిచేశాడు దర్శకుడు. ఇక దానికి కొనసాగింపుగా, సెకండ్ హాఫ్ లో హీరో రివేంజ్ పై దృష్టి పెట్టాడు. కథలో బోలెడన్ని మలుపులు, సెంటిమెంట్ సీన్స్ ఉన్నా… వాటితో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. ఏ సన్నివేశంకు అది బాగానే ఉంటుంది తప్పితే ఆ ఫీల్ ను క్యారీ ఫార్వర్డ్ చేయదు.

నేచురల్ స్టార్ అనే బిరుదుకు తగ్గట్టు నాని చాలా సహజంగా ధరణి పాత్రను పోషించాడు. ఇది అతని ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో మింగుడు పడటానికి కాస్తంత టైమ్ పడుతుంది. ఒక నటుడికి ఎలాంటి పాత్ర అయినా చేయగలనని నిరూపించుకోవాలనే కోరిక ఉంటుంది. దానిని నాని ఈ సినిమాతో తీర్చుకున్నట్టు అయ్యింది. అయితే వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్‌ ను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ రకంగానూ ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయింది. పైగా మునుపటి ఛార్మ్ కూడా లేదు. నాని స్నేహితుడిగా దీక్షిత్ శెట్టి బాగా నటించాడు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో అస్సలు నప్పలేదు. సముతిర ఖనికి ఎత్తు పళ్ళు పెట్టి కాస్తంత కొత్తగా తెర మీద చూపించారు తప్పితే, ఆయన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఝాన్సీ, పూర్ణ, సాయికుమార్, సురభి ప్రభావతి, రవితేజ నన్నిమాల తదితరులు తమ పాత్రలకు బాగానే న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సత్యన్ గురించి. కెమెరాపనితనం ఆసమ్. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ లో ఒకటి రెండు మాత్రామే బాగున్నాయి. మిగిలినవి సో… సో… గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ సీన్స్ లో అతని నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కానీ మోతాదుకు మించిన హింసను తెర మీద చూపించారు. నిర్మాణ విలువలు బాగుండం, నాని సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఓపెనింగ్స్ కు ఢోకా లేదు. నాని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ తరహా కథతో ఎంతవరకూ కనెక్ట్ అవుతారనేది సందేహమే!

రేటింగ్ : 2.75/5

ప్లస్ పాయింట్స్

నాని నటన

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్

పేలవమైన కథ

ఆకట్టుకోని సెంటిమెంట్

అతిగా యాక్షన్ సీన్స్

ట్యాగ్ లైన్: సరదా తీరింది!

ఏపీ : తిరుపతి:టీటీడీ ఏంటి జరిమానా కట్టడం ఏంటి.వడ్డీ కాసుల స్వామి కి ఏంటి ఈ గోల అనుకుంటున్నారా..

టీటీడీ ఏంటి జరిమానా కట్టడం ఏంటి వడ్డీ కాసుల స్వామి కి ఏంటి ఈ గోల అనుకుంటున్నారా..?

టీటీడీకి ఆర్బీఐ జరిమానా.. రూ.3కోట్లు ఫైన్‌ కట్టామన్న వైవీ సుబ్బారెడ్డి..

టీటీడీ నిర్లక్ష్యంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం కట్టాల్సి వచ్చింది.

రూల్స్‌ బ్రేక్‌ చేశారంటూ తిరుమల శ్రీవారికి మూడు కోట్ల రూపాయల ఫైన్‌ విధించింది కేంద్రం.

ఇదిప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారికి జరిమానా ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.

అసలింతకీ ఏం జరిగింది?. వడ్డీ కాసులవాడు ఎందుకు ఫైన్‌ కట్టాల్సి వచ్చింది!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. శ్రీవారి దర్శనం దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలివస్తారు. కోటానుకోట్ల రూపాయలను కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా వచ్చిన బంగారం, కరెన్సీ విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుందంటే తిరుమల శ్రీవారికున్న క్రేజ్‌ అలాంటిది.

అయితే, వేంకటేశ్వరస్వామి ఖజానాకి కేవలం ఇండియన్‌ కరెన్సీయే కాదు, ఫారిన్‌ కరెన్సీ కూడా కుప్పలుతెప్పలుగా వస్తుంది. అలా, పేరుకుపోతున్న ఫారిన్‌ కరెన్సీపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం చెల్లించాల్సి వచ్చిందిప్పుడు.

టీటీడీ జరిమానా కట్టడం వెనక తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్‌. ఫారిన్‌ కరెన్సీ కన్వర్షన్‌ లైసెన్స్‌ 2018లోనే ముగిసినా రెన్యువల్‌ చేసుకోవడంలో జాప్యం జరిగినట్టు టీటీడీ ఛైర్మన్‌ మాటల్లో క్లియర్‌గా తెలుస్తోంది. అంతేనా, తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో వేస్తారు, దానికి టీటీడీని తప్పుబడితే ఎలా అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి.

కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌తో ఈ గుట్టు రట్టయ్యింది. ప్రస్తుతం టీటీడీ దగ్గర 30కోట్ల రూపాయల విలువైన ఫారిన్‌ కరెన్సీ మూలుగుతోంది. అయితే, నిబంధనలు పాటించడం లేదంటూ 2018లో FCRA లైసెన్స్‌ను రద్దు చేసింది కేంద్రం. ఇప్పుడు ఏకంగా 3కోట్ల ఫైన్‌ విధించింది. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీరును కొందరు తప్పుబడుతున్నారు. టీటీడీ వ్యాపార సంస్థ కాదనే సంగతి గుర్తించాలని అంటున్నారు. అయినా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి జరిమానా విధించమేంటంటున్నారు భక్తులు.

భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్తున్నారు.

భద్రాద్రి: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. ప్రధాన ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబై.. పూజలు, సీతారామ కల్యాణం కోసం సిద్ధం అయ్యాయి. ఇక భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.

మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ తమిళిసైతో పాటు చిన్నజీయర్‌ స్వామి ఇతర ప్రముఖులు హజరయ్యే అవకాశం కనిపిస్తోంది. భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు. భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు.

మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్‌కు లఘుకల్యాణం నిర్వహిస్తారు. ఆపై అభిజిత్‌ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చిన భక్తులు...

జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. తాజాగా నిర్మలా సీతారామన్ తో భేటీ*

జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. తాజాగా నిర్మలా సీతారామన్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగానే అనుకున్న విధంగా బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ, పర్యటనలో మార్పు చేసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కూడా జగన్ భేటీ అయ్యారు. తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు.

కానీ, చివరి నిమిషంలో రావాలని జగన్‌కి సీతారామన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం జగన్.. ఆమెతో సమావేశం అయ్యారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్‌ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన చర్చలు జరిపారు.

ఏపీ :ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు.

ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం సర్వ ఏకాదశి..

ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు..

ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి పౌర్ణమి గరుడసేవ..

ఏప్రిల్ 16న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం..

ఏప్రిల్ 23న అక్షయతృతీయ..

ఏప్రిల్ 25న శ్రీ భాష్యకారుల శాత్తుమొర శ్రీ రామానుజ జయంతి శంకర జయంతి శ్రీ అనంతాళ్వారు ఉత్సవారంభం..

ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది..

ఏపీ :శ్రీ రామ నవమి సెలెబ్రేషన్స్ : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి..

శ్రీ రామ నవమి సెలెబ్రేషన్స్ : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి..

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా.. భయంతో పరుగులు తీశారు భక్తులు.. అంతా సురక్షితంగా బయటపడడంతో.. అటు భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్:తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం. చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.*టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం.

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ

హైదరాబాద్, : చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో వెల్లడించారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమని వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నాడు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కావాలని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పినట్లు వెల్లడించారు. తెలుగుజాతి వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని తెలిపారు. తెలుగుజాతిని ఉద్ధరించడానికి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. మానవత్వమే తన సిద్ధాంతమని చాటి చెప్పారన్నారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమన్న చంద్రబాబు అందరి అవసరం కోసం అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఉందని వివరించారు. మార్చ్ 29 చరిత్రను తిరగరాసింది. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పది కోట్ల తెలుగువారు ఒక కుటుంభం దానికి ప్రతినిధి టీడీపీ. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ గుర్తు ఉంటారు. ఆహార భద్రతపై ఆలోచించింది ఎన్టీఆర్. ప్రజలవద్దకు పరిపాలన తెచ్చేందుకు మండల వ్యవస్త తెచ్చారు అది వికేంద్రీకరణ. యుగ పురుషుడి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని గొంతెత్తారు. ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. నిరుపేదలను చదివించాలని రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తెచ్చారన్నారు.

ఆడబిడ్డలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. నేను వచ్చాక రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాను.

తెలుగుజాతి చిహ్నం.. ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌*

రాజమహేంద్రవరంలో మహానాడు సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తాం. తెలుగుజాతి గర్వపడేలా భవిష్యత్తుకు నాంది పలికేలా కార్యక్రమాలు చేపడుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎన్టీఆర్‌కు గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందన్నారు. టీడీపీ హయాంలో సంస్కరణలు తీసుకువచ్చామని వ్యాఖ్యానించారు. విద్యుత్‌, పోర్టులు, రోడ్లు తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చామని వివరించారు. మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని వెల్లడించారు.

పులివెందుల డి.ఎస్.పి కార్యాలయం. పులివెందుల డి.ఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం

పులివెందుల డి.ఎస్.పి కార్యాలయం.

పులివెందుల డి.ఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం

వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుందని పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పులివెందులలో మీడియాతో డి.ఎస్.పి మాట్లాడారు. కాల్పుల కేసులో నిందితుడైన భరత్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు పిస్టల్ ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. ఈ కేసు విషయంలో ఇంకా అవాస్తవ ప్రచారాలు, వదంతులు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో 28 న మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దిలీప్(27) భరత్ యాదవ్ లు గొడవపడి అంతట భరత్ యాదవ్ తన ఇంటిలోని పిస్టల్ ను తీసుకుని వచ్చి దిలీప్ మరియు మహబూబ్ బాషా(38) లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడన్నారు. ఘటన స్థలంలో తీవ్రంగా గాయపడిన దిలీప్ వేంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని డి.ఎస్.పి తెలిపారు. గాయపడ్డ మహబూబ్ బాషా ను మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి అనంతరం చిత్తూరు కు తరలించడం జరిగిందని వివరించారు.

భరత్ యాదవ్ కు గతంలో నేర చరిత్ర లేదు...కేసులు లేవు...డి.ఎస్.పి స్థాయిలో తాను గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు... డి.ఎస్.పి శ్రీనివాసులు

తాను డి.ఎస్.పి స్థాయిలో గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదనేది పూర్తిగా అవాస్తవమని శ్రీనివాసులు తెలిపారు.

భరత్ యాదవ్ 2019 సం లో తనపై హత్యాయత్నం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదయింది. తాను ఓ ప్రముఖ కేసులో సాక్షిగా ఉన్నందున తనకు ప్రాణ హాని ఉందని, సి.బి.ఐ అధికారులకు వినతి పత్రం అందచేశారు. అదే ఫిర్యాదును జిల్లా ఎస్.పి గారికి కూడా అందచేసినట్లు తెలిపారు. విట్ నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్లాజ్ 7(O) క్రింద భరత్ యాదవ్ తనకు రక్షణ కావాలని 2021, జూన్ లో మీడియా లో స్టేట్ మెంట్ ఇచ్చాడని, 2021 నవంబర్ లో దీనిపై తాను థ్రెట్ పెర్సెప్షన్ రిపోర్ట్ (టి.పి.ఆర్) నివేదిక ను ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేయడం జరిగింది. అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎం.ఎల్.సి ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ మేరకు భరత్ యాదవ్ తన పిస్టల్ ను ఫిబ్రవరి 26 న పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేసి ఎన్నికల అనంతరం మార్చి 24 న తిరిగి తీసుకున్నాడు.

ఏపీ :అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అమరావతి:

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.