తెలంగాణ ::అలంపురం పుణ్యక్షేత్రంలో బుధవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆరుద్రోత్సవంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
అలంపురం పుణ్యక్షేత్రంలో బుధవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆరుద్రోత్సవంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పురేంద కుమార్ , దేవస్థానం ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ తెలిపారు.
శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రమైన ఆలంపురం పుణ్యక్షేత్రంలో ప్రతినెల జరుగుతున్నటువంటి ఆరుద్రోత్సవ మహోత్సవ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది.
ఈ సందర్భంగా ముందుగా దేవస్థానం ధ్వజస్తంభం మండపం దగ్గర ముక్కోటి దేవత మూర్తులకు ప్రతిరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య గో సహితంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు .
ఇలా చేయడం ద్వారా భూమండలంలోని ముక్కోటి పుణ్యక్షేత్రాలు తీర్థాలలో ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆరుద్రోత్సవం సందర్భంగా అలంపురం పుణ్యక్షేత్రంలో చేసే ఆలయ ప్రదక్షణానికి ఏకకాలంలో అలాంటి ఫలితం వస్తుందని అర్చకులు తెలిపారు .
అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు.
అదేవిధంగా మహాన్యాస పారాయణాలు నిర్వహించి బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి నమక చమకాలతో 11 పర్యాయాలు ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.
స్వేతాన్నంతో అన్న సూక్త పారాయణ చేస్తూ బాలబ్రహ్మేశ్వరుడికి అన్నాభిషేకం నిర్వహించారు
అదే అన్నంతో స్వామివారిపైన లింగాకృతిలో చక్కగా అలంకరించి సహస్రనామాలు బిల్వాష్టోత్తరాన్ని పాటించారు .
మహా నివేదనలు సమర్పణ చేసి దశవిద హారతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Mar 29 2023, 13:00