రాహుల్‌ గాంధీ దోషే.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పు.. రెండేళ్ల జైలు శిక్షకు ఛాన్స్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేల్చిచింది గుజరాత్ కోర్టు. 2019 ఎన్నికల సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీని ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. దొంగలందరూ మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారెందుకు? అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. గత శుక్రవారం విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన సూరత్ న్యాయస్థానం.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వయనాడ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినప్పుడు ఈ కేసు 2019కి సంబంధించినది. ఆ తర్వాత అతనిపై పరువు నష్టం కేసు నమోదైంది. ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఒక్కటే ఎందుకు?’ అని రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌ సభలో రాహుల్‌ ఈ కామెంట్స్‌ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై క్రిమినల్‌ డెఫమెషన్‌ కేసు నమోదు చేశారు. రాహుల్‌పై పరువునష్టం దావా కేసుని విచారించిన సూరత్‌ కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించింది.

రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం వల్ల ఆయన సభ్యత్వానికి ముప్పు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రెండేళ్ల శిక్షను కూడా ప్రకటించవచ్చు. అయితే కోర్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నా ప్రకటన వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. శిక్షను తగ్గించాలని కోర్టును ఆశ్రయించాను. మరోవైపు, అశ్విని చౌబే మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ కోర్టు పరిధిలో ఉన్నారు. అతను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. పార్లమెంట్‌కు వచ్చి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద నేరం నమోదు చేశారు.

ఈ కేసులో ఇవాళ మూడోసారి కోర్టుకు హాజరయ్యారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల వాదనలు విని మార్చి 23న తీర్పును ప్రకటించాలని నిర్ణయించింది. ఈరోజు విచారణ అనంతరం రాహుల్ గాంధీని దోషిగా కోర్టు తేల్చింది.

Cyber crime : వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్‌ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్‌ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి సందేశాలపై ప్రతిఒక్కరూ అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను ఇప్పటికే చోరీ చేసినట్లు గుర్తించారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారని తెలుస్తోంది. 

ఇన్‌కాగ్ని సంస్థ నివేదికలో ఏముంది..? 

దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డేటా చోరీ జరిగిందని ఇన్‌కాగ్ని సంస్థ వెల్లడించింది. డేటా చోరీ బాధిత టాప్‌-5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని వివరించింది. అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని ఇన్‌కాగ్ని పేర్కొంది. భారత్‌ తర్వాత యూకే, బ్రెజిల్‌, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా చోరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది.

విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై..

విమాన ప్రయాణం అంటే డీసెంట్.. అందరూ ఎలైట్ పీపుల్స్.. పద్దతిగా ఉంటారు అనే టాక్.. మొన్నటి వరకు అలాగే ఉంది.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విమానంలో గొడవలు కామన్ అయ్యాయి. ఎంతలా అంటే.. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడు సంఘటనలు జరిగాయి. ఒకరు మూత్రం పోస్తే.. మరొకరు ఉమ్మి వేయటం.. మరొకరు సీటు కోసం కొట్టుకోవటం వంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 

లేటెస్ట్ గా.. మార్చి 22వ తేదీ బుధవారం ఇండిగో విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై.. ఇద్దరు వ్యక్తులు బీభత్సం చేశారు. తోటి ప్రయాణికులను బండ బూతులు తిట్టారు. దాడి చేశారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన కో పైలెట్, ఎయిర్ హోస్టస్ పై దాడికి ప్రయత్నించారు ఆ ఇద్దరు ప్రయాణికులు. దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో ఫ్లయిట్ లో ఈ ఘటన జరిగిందని.. గొడవ చేసిన ప్రయాణికులు ఇద్దరినీ.. ముంబైలో ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీస్ అధికారులు. 

ఆ ఇద్దరు ప్రయాణికులను కోర్టులో హాజరుపరిచామని.. వారికి బెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు ముంబై ఎయిర్ పోర్ట్ పోలీస్ అధికారులు. వారిద్దరూ మహారాష్ట్రలోని పాల్ఘర్, కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన వారని.. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నారని.. ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి తెచ్చుకున్న మద్యం తాగి విమానంలోనే సంబరాలు చేసుకున్నారని.. మద్యం మత్తులో.. కిక్ ఎక్కువై.. తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వివరించారు అధికారులు.

విమానాల్లో ఇటీవల జరుగుతున్న వరస ఘటనలపై భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొన్నటికి మొన్న విమానంలోని టాయిలెట్ లో సిగరెట్ తాగి.. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ప్రయాణికులు సహనం కోల్పోతున్నారని.. కోపంతో దాడులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన కనికరం లేని ఖాకీలు.. ఎక్కడ?

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగు రోజుల శిశువును పాషాణ హృదయులైన కొందరు పోలీసులు కాళ్ళతో తొక్కి చంపేశారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని కోసాగోండోడిఘి గ్రామంలో జరిగింది. 

ఈ వివరాలను పరిశీలిస్తే, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ వృద్ధుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు చిన్న శిశువు మాత్రమే కనిపించింది. ఆ బిడ్డ నిద్రపోతుండటంతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. 

ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు గాలించిన పోలీసులకు వారు ఎక్కడా కనిపించకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా నాలుగున్నర నెలల శిశువు మరణించివుండంతో వారు బోరున విలపించసాగారు. నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు కాళ్ళతో తొక్కి చంపారని శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వచ్చిన కథనాలపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందించారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని బుధవారం అన్నారు.

గతేడాది నవంబర్ లో పంజాబ్ ప్రావిన్సులో నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు తనను చంపేందుకు మరో ప్లాన్ వేశారని ఆయన అన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్ పోలీస్ చీఫ్ లు వారి హ్యాండ్లర్లు జమాన్ పార్క్ నివాసంలో మరో ఆపరేషన్ ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు.

ప్లాన్ ఏమిటంటే.. జమాన్ పార్క్ వద్ద రేపు లేదా తర్వాతి రోజు మరో ఆపరేషన్ ఉందని, వారి మనుషులు ప్రజల్లో కలిసిపోయేలా రెండు స్వ్కాడ్ లను తయారు చేశారు. ఆపై నలుగురైదుగురు పోలీస్ అధికారులను కాల్చి చంపుతారు, ఆ తరువాత జరిగే కాల్పుల్లో తన పార్టీ కార్యకర్తలను చంపేస్తారని, గతంలో ముర్తాజా భుట్లో హత్య తరహాలోనే నన్ను చంపేస్తారని ఆయన ఆరోపించారు. 1996 కరాచీ పోలీస్ ఎన్ కౌంటర్ లో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో సోదరుడు ముర్తాజాను చంపేశారు. ఆ సమయంలో ప్రధానిగా బెనజీర్ భుట్టోనే ఉన్నారు. ఈ ఘటన జరిగిన 11 ఏళ్ల తర్వాత 2007 రావల్పిండి ఎన్నికల ర్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ఆమెను హతమార్చారు.

పోలీసులు ఏం చేసినా రెచ్చిపోవద్దని కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ దిశానిర్దేశం చేశారు. సంయమనం పాటించాలని కోరారు. నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కానీ రక్తపాతం మాత్రం వద్దు అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇస్లామాబాద్ కోర్టులో హాజరుపరిచే సందర్భంలో తనను డెత్ ట్రాప్ చేశారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు నన్ను చంపేందుకు వచ్చారని ఆయన ఆరోపించారు.

విరాట్‌ కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా..?

విరాట్‌ కోహ్లీ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. క్రికెట్‌ ప్రపంచంలో ఒక సంచలనం.. సాధరణంగా ఏ క్రికటర్‌కు అయినా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఉంటారు.. కానీ విరాట్‌ కోహ్లీకి మాత్రం..క్రికెట్‌ అంటే తెలియని వాళ్లు కూడా ఫ్యాన్స్‌ ఉంటారు. హీరోలు, హీరోయిన్స్‌ అందరూ కింగ్‌కు అభిమానులే.. అయితే.. విరాట్‌ కోహ్లీ తాగే వాటర్‌ గురించి గతంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. కోహ్లీ ఫిట్ నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. విరాట్‌ తినే బియ్యం కాస్ట్‌ ఎంతో మీకు తెలుసా..?

భారత మాజీ కెప్టెన్ , రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ గురించి ఎప్పుడూ కష్షపడుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు తినడు. వాటికి దూరంగా ఉంటాడు. విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు. ఇది శరీరం కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు.

స్పెషల్‌ రైస్‌..

కోహ్లీ మామూలు అన్నం కాకుండా స్పెషల్ రైస్ తింటారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. గ్లూటెన్ రహితంగా ,కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం సాధారణ రుచిని కలిగి ఉంటుంది. ఈ బియ్యం కిలో ధర రూ.400 నుంచి 500 వరకు ఉంటుందని సమాచారం. తాను పాల ఉత్పత్తులు తినడం పూర్తిగా మానేశానని తెలిపాడు. తాను గోధుమలతో చేసిన రొట్టెలను కూడా తిననని కోహ్లీ తెలిపాడు.

ఫిట్‌గా ఉండటం కోసం.. తాను చాలా స్వీట్లు కూడా తినడం మానేశానని తెలిపారు. 34 ఏళ్ల వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా, బాగానే మెంటైన్ చేస్తున్నాడు.

కోహ్లికి చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బట్టర్ ఒకటి. అయితే తన ఆటపై, తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించే కోహ్లి.. చోలే బట్టర్ తినడం కూడా తగ్గించారట.. అలాగే.. అల్పాహారం గురించి మాట్లాడుతూ, కోహ్లీ రోజును మూడు గుడ్డులు, ఒక గుడ్డుతో కూడిన ఆమ్లెట్‌తో ప్రారంభిస్తాడట.. అలాగే భోజనంలో ఉడికించిన చికెన్, మెత్తని బంగాళదుంపలు, బచ్చలికూర మరియు కూరగాయలను తింటాడు. మొత్తానికి కింగ్‌ తన డైట్‌ను ఇలా మెయింటేన్‌ చేస్తున్నాడు..

ఖైదీలకు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

కరుడుగట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు చేయడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఉరి కంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై సమాచారంతో తిరిగి కోర్టుకు రావాలని అటార్నీ జనరల్ వెంకటరమణికి స్పష్టం చేసింది. ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉరిశిక్షకు బదులుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుత్ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

ఇకపై సోషల్‌ మీడియాలో మీ పిల్లల ఫోటోలు షేర్‌ చేయకూడదు.. కొత్త చట్టం నిబంధన

సోషల్‌ మీడియాలోనే సగం యువత తమ జీవితాన్ని గడిపేస్తున్నారు.. ఏ చిన్న కార్యక్రమం అయినా.. వీడియోలు, ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టేస్తారు. తమ పిల్లలు ముద్దు ముద్దు మాటలను కూడా వీడియో తీసి పెడుతుంటారు. సెలబ్రెటీలు అయితే.. వాళ్ల పిల్లలు ఫోటోలు పబ్లిసిటీ చేయరు.. వారి వ్యక్తిగత జీవితంకు ప్రాధాన్యత ఇచ్చి ఫోటోలను ఎక్కడా పెట్టకుండా..పబ్లిక్‌లోకి వచ్చినా వాళ్ల పిల్లలు ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడతారు. అయితే ఇప్పుడు ఒక కొత్త చట్టం వచ్చింది..దీని ప్రకారం.. మీరు మీ పిల్లలు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడానకి వీల్లలేదు.

తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మన దగ్గర సాధారణ విషయం. అయితే ఇది పిల్లల ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అంటున్నారు ఫ్రాన్స్ చట్టసభల ప్రతినిధులు. అందుకే పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు సైతం వారి ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయకుండా కొత్త చట్టాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది.. ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీని కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని ఆ దేశ ఎంపీలు చెబుతున్నారు. కొత్త చట్టం ఆవశ్యకతను, ప్రయోజనాలను కొందరు నిపుణులు ప్రశంసించగా, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

ఈ చట్టానికి ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.. ఈ ప్రపోజల్‌ను ఎంపీ బ్రూనో స్టూడర్ ప్రెజెంట్‌ చేశారు. 13 ఏళ్ల వయసున్న పిల్లలకు సంబంధించిన ఫోటోలు యావరేజ్‌గా 1,300 ఇంటర్నెట్‌లో సర్క్యులేట్‌ అవుతున్నాయని స్టూడర్ చెప్పారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లల ఇమేజ్‌పై వారి తల్లిదండ్రులకు సంపూర్ణ హక్కు లేదని యువతకు బోధించడం ఈ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. 2022 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసిన పిల్లల హక్కుల ప్రతినిధి బృందంలో స్ట్రూడర్ సభ్యుడు.

ఎందుకు ఈ చట్టం అంటే..

ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసే పిల్లల ఫోటోలను ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ ఫోరమ్‌లలో దుర్వినియోగం చేయవచ్చని, లేదా పాఠశాలల్లో తోటివారు ఏడిపించేందుకు కారణం అవ్వొచ్చని స్టూడర్‌ తెలిపారు.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ ఫోరమ్‌లలో ఎక్స్ఛేంజ్‌ అయిన దాదాపు 50 శాతం ఫోటోలను మొదట వారి తల్లిదండ్రులే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పారు. కొత్త చట్టం పిల్లల ప్రైవసీని రక్షించడానికి, వారి గౌరవాన్ని ఆన్‌లైన్‌లో కాపాడటానికి ఒక ముందడుగు లాంటిదని చెప్పారు.

ఇలాంటి చట్టం ఇండియాలో కూడా తెస్తే బాగుంటుంది.. పేరెంట్స్‌హే..పిల్లలను వీడియోలు తీయడం, రీల్స్‌చేయించడం చేస్తారు.. ఆ వయసు నుంచి వారిని సోషల్‌ మీడియాకు దగ్గర చేస్తారు..తిరిగి మా పిల్లలు అసలు చదువుకోవడం లేదు, ఎప్పుడు ఫోన్‌ వాడతారు అంటారు.. తప్పు మీ వల్లే మొదలవుతుంది అని విషయం వాళ్లు గ్రహించలేకపోతున్నారు.

గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్లు.. యాప్​ డౌన్​లోడ్​ చేయించి నిలువు దోపిడి

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూర్చుని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఒక్క పాస్‌వర్డ్, ఓటీపీ, ఇంటి చిరునామా ఇవ్వడం ద్వారా వారికి కావాల్సిన అంగట్లో వస్తువులన్నీ డెలివరీ చేయబడతాయి. అంతేకాకుండా.. రైలు, బస్సు, విమానం రిజర్వేషన్లు ఇంటి నుంచి సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కస్టమర్​కేర్​ సెంటర్లను ఆన్​లైన్​లో వెతికామంటే.. సైబర్​ నేరగాళ్ల చేతిలో బలైపోయినట్టే.. ఇలాంటి సైబర్‌ కేసులు రెండు నెలల్లో నగరంలో సుమారు 200 దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.

నకిలీ వెబ్‌సైట్లు

నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్‌ నంబర్లను సైబర్​ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్‌ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్‌ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్​లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు. ఇలా భాగ్యనగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదయ్యాయి.

ఈ గూగుల్‌ ఫ్రాడ్‌ వల్ల బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. ఇలాంటి తరహా మోసాలు మున్ముందు పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే.. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్​లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్​ను నమ్మొద్దని, అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. కాగా.. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్​, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్​ను ప్రింట్ చేసి ఉంచుతుందని, వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలని కోరారు.

అయితే.. బ్యాంకులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, తాళం గుర్తుతో మొదలవుతాయి. ఈఫ్రాడ్‌ మెసాలకు ఓ హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.. దానికోసం ఆన్​లైన్​లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు దీంతో బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.

నిలువు దోపిడి..

ఇక మరో హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అదికాస్తా సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్​ నంబర్​ కోసం గూగుల్​లో వెతికాడు. అందులో ఓ నంబర్‌ కనిపించడంతో దానికి కాల్ చేసాడు. అటునుంచి ఓ వ్యక్తి కాల్‌ లో మాట్లాడి ఓ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేస్తే మీకు సులువుగా పని జరుగుతుందని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన కస్టమర్‌ ఆ యాప్‌ ను డౌన్​లోడ్ చేశాడు. అంతే. నిమిషంలో కస్టమర్‌ బ్యాంకు ఖాతాలో వున్న నుంచి రూ.99 వేలు ఖాళీ అయ్యాయి. ఇలా కొత్త తరహామోసాలకు తెర లేపుతున్నారు. వీల్ల ఉచ్చులో పాపం అమాయకులు బలి అవుతున్నారు. తెలివిగా వున్నా వారి అమాయకులను ఆసరాగా తీసుకుని వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. 

ఇలాంటి వారిని నమ్మకూడదని తెలివిగా మసులు కోవాలని అధికారులు ఎన్ని సార్లు చెబుతున్నా బాధితులు .. కిలాడీల మెసాల ఉచ్చులో పడి వారి ఖాతాల్లోని డబ్బులను ఖాలీ చేస్తున్నారు. వీరి మెసాలకు అలర్ట్‌ గా ఉండాలని అధికారులు చెబుతున్నా అయినా సైబర్‌ క్రైం మోసాలకు తెరలేపుతున్న కేటు గాళ్ల చేతుల్లో మోసాపోకండని ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

మీ స్మార్ట్​ఫోన్ హ్యాక్​ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి చాలా సౌకర్యాలను పొందుతున్నారు. చాలా వ్యాపారాలు స్మార్ట్ ఫోన్ మీదనే జరిగిపోతున్నాయి. ప్రజలు తమ దైనందిన జీవితానికి సంబంధించిన సగానికి పైగా పనిని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే నిర్వహిస్తారు. ఆన్‌లైన్ షాపింగ్ అయినా, పేమెంట్ అయినా లేదా ఏదైనా టికెట్ బుకింగ్ అయినా, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పనులన్నీ చేసేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ మనుషులకు వరం అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఒకవైపు దీని వినియోగం పెరిగిన చోట.. మరోవైపు దీని వల్ల ప్రజల సీక్రెట్ సమాచారం కూడా దుర్వినియోగం కావడం మొదలైంది. సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసి వారి ఫోన్ లోని కీలక సమచారంతో హ్యాకింగ్ చేసి అకౌంటు నుంచి డబ్బులు కొట్టేయడం లాంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. లేదా మరేదైనా పర్సనల్ సమాచారం వారి చేతికి చిక్కినా వారు ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల మీ ఫోన్ దొంగిలించకుండానే హ్యాకింగ్ చేసే వీలుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలి. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించాలి…

స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా పేమెంట్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ పేమెంట్ యాప్స్ వాడవద్దు.

ఇది కాకుండా, మీకు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా లింకులను టచ్ చేయవద్దు. అలాగే, అనుమానాస్పద లింక్‌లు, అనుమానాస్పద మెయిల్‌లు అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు.

స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తుండాలి. ఇది మాల్‌వేర్‌ను తీసివేయడంలో లేదా దానికి నష్టం కలిగించడంలో సహాయపడుతుంది.

కొందరు ఆగంతుకులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతుంటారు. అలాంటి పనులు చేయకండి. అలాగే విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను బ్లాక్ చేయండి.

మీకు అవసరం లేనప్పుడు మొబైల్ డాటాను ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్ కాకుండా బయట లింకుల నుంచి యాప్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేయవద్దు. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వాటిని ఆన్సర్ చేయకండి. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.