TeluguCentralnews

Mar 18 2023, 13:57

వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రపంచ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ

ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల ప్రెసిడెంట్ కమిషనర్, ల్వోవా-బెలోవాపై కూడా వారెంట్ జారీ చేసినట్లు హేగ్ ఆధారిత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తెలిపింది. ఐసీసీలో రష్యాకు సభ్యత్వం లేదు. ఐసీసీ వారెంట్‌ను ఎలా అమలు చేయాలని యోచిస్తోందనేది అస్పష్టంగా ఉంది.

వ్లాదిమిర్ పుతిన్ “జనాభాను (పిల్లలను) చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల నుండి రష్యన్ ఫెడరేషన్‌కు జనాభా (పిల్లలు) చట్టవిరుద్ధంగా బదిలీ చేయడం వంటి యుద్ధ నేరానికి బాధ్యత వహిస్తాడు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన ఫిబ్రవరి 24, 2022 నాటి నుంచి నేరాలు జరిగినట్లు ఐసీసీ తెలిపింది. ఈ నేరాలకు పుతిన్్ వ్యక్తిగత నేర బాధ్యత వహిస్తాడని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. బాధితులు, సాక్షులను రక్షించేందుకు అరెస్ట్ వారెంట్లను గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.

ఐసీసీ అనేది దేశాల యుద్ధనేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారిస్తుంది. రష్యా దాడి చేసిన కొద్ది రోజులకే ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ దర్యాప్తు ప్రారంభించారు.ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ పర్యటన తర్వాత కరీం ఖాన్ మాట్లాడుతూ, పిల్లల అపహరణల గురించి ” తమ కార్యాలయం ప్రాధాన్యతగా దర్యాప్తు చేస్తోందని అన్నారు. రష్యా తన సైనికుల యుద్ధ నేరాల ఆరోపణలను ఖండించింది.

TeluguCentralnews

Mar 17 2023, 21:16

ఆ రాష్ట్రంలో మందుబాబులకు షాక్.. ప్రతి మద్యం బాటిల్‌పై గో సంరక్షణ పన్ను

ఇటీవల 20 ఏళ్ల పాత కారులో అసెంబ్లీకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కూ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది మందుబాబులకు కొంత వరకు నచ్చకపోవచ్చు. అదేంటంటే మద్యం అమ్మకాల్లో ప్రతి లిక్కర్ బాటిల్ పై పది రూపాయల పన్నును తమ ప్రభుత్వం విధించనుందని తెలిపారు.

 అయితే ఈ పన్ను కూడా గో సంరక్షణ పన్ను కావడం మరో విశేషం. శుక్రవారం రోజున అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధానం వల్ల ఏడాదికి దాదాపు 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే జీడీపీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పన్నులు పెంచడం చర్చనీయాంశమైంది.

2021-22 మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ జీడీపీ రేటు 7.6 నుంచి 6.4 కు పడిపోయింది. హిమాచల్ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే లిక్కర్ బాటిల్ పై 2 రూపాయల గౌ సెస్ ను విధిస్తోంది. ఇందులో నుంచి వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో ఉన్న 12 జిల్లాల్లో గో సంరక్షణ కోసం వినియోగించేవారు. 

అయితే సుఖ్వీందర్ సింగ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడు రాష్ట్రానికి గత పాలకులు 10 వేల కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చారంటూ చురకలంటించారు. 

ప్రస్తుతం తన ముందు రాష్ట్ర ఆర్థిక సవాళ్లున్నాయని తెలిపారు. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా సబ్సీడీ ఇస్తున్నట్లు సుక్విందర్ సింగ్ ప్రకటించారు.

TeluguCentralnews

Mar 17 2023, 21:08

రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగు

అదృష్టం అంటే ఇతడితే ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి కూలీగా పనిచేసేందుకు కేరళకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 75 లక్షల లాటరీని గెలుచుకున్నారు. బెంగాల్ కు చెందిన ఎస్కే బాదేశ్ కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో టికెట్ కొనుగోలు చేశాడు. అయితే అదృష్టవశాత్తు బాదేశ్ ను లాటరీ తగిలింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తనకు మళయాళం రాదు, రాష్ట్రం కానీ రాష్ట్రం, తనను మోసగించి ఎవరైనా లాటరీ టికెట్ లాగేసుకుంటారని భయపడని బాదేశ్ ఏకంగా పోలీసులనే రక్షణ కోరాడు.

లాటరీ గెలుపొందిన వెంటనే తనకు రక్షణ కల్పించాలంటూ మంగళవారం అర్థరాత్రి మువట్టపుజ పోలీస్ స్టేషన్ కు పరుగు తీశాడు. తనకు లాటరీ విధివిధానాలు తెలియవని, తనకు, తన ఫ్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. తన టికెట్ ఎవరైనా లాక్కుంటారనే భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. మువట్టుపుజ పోలీసులు ఆయనకు విధివిధానాలు అర్థమయ్యేలా చేసి అన్ని రకాల భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

గతంలో కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు బాదేశ్. అయితే తనకు ఎప్పుడూ కూడా విజయం వరించలేదని, ఈ సారి మాత్రం అదృష్టలక్ష్మీ తనను కరుణించిందని బాదేశ్ తెగ సంబరపడిపోతున్నాడు. ఎర్నాకులంలోని చొట్టానికరలో ఎస్‌కే బాదేశ్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై టికెట్‌ కొనుగోలు చేశారు. కేరళకు వెళ్లి ఏడాది కూడా కాలేదు, తనకు మళయాళం తెలియకపోవడంతో తన స్నేహితుడు కుమార్ సాయాన్ని కోరాడు. డబ్బు రాగానే బెంగాల్ లోని తన ఇంటికి తిరిగి వెళ్తా అని, కేరళ కేరళ తనకు తెచ్చిన అదృష్టంతో తన ఇంటిని పునరుద్ధరించుకోవాలని, వ్యవసాయాన్ని విస్తరించాలని అతను చెబుతున్నాడు.

TeluguCentralnews

Mar 17 2023, 20:56

నిత్యానంద స్వామి దీవి గురించి ట్విట్టర్‌లో కైలాస సిస్టర్స్ ఏమన్నారు?

వివాదాస్పద బాబా నిత్యానంద స్వామి కైలాస దీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైలాస దీవికి తగిన గుర్తింపు కోసం ఆ దీవికి సంబంధించిన ప్రతినిధులు యూఎన్‌లో ప్రసంగించిన సంగతి తెలిసిందే. తాజాగా కైలాస దీవి ప్రతినిధులు, నిత్యానంద స్వామీజీ అనుచరులు ఓ వీడియో రూపంలో మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తమ కైలాస దీవికి సంబంధిన వివరాలను తెలియజేశారు. 

మానవతా సేవలు, ప్రపంచ శాంతి కోసం కైలాస సిస్టర్స్ సిటీ సంబంధాలను ఏర్పాటు చేసింది. కైలాసం అనేది పురాతన జ్ఞానోదయమైన హిందూ నాగరికత దేశపు పునరుజ్జీవనం అంటూ కైలాస దీవికి చెందిన నిత్యానంద స్వామి శిష్యులు ట్విట్టర్‌లో వీడియో ద్వారా తెలిపారు. 

కైలాసకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు, మా మానవతా సేవలను కొనసాగించడానికి, విభిన్న సంస్కృతులపై మంచి అవగాహన ద్వారా ప్రపంచ శాంతిని పెంపొందించడానికి నెవార్క్‌తో సహా ప్రపంచంలోని అనేక నగరాలతో సోదరి నగర సంబంధాలను ఏర్పరచుకున్నాయని వివాదాస్పద స్వామి నిత్యానంద శిష్యులు చెప్పారు 

ఇటీవల జరిగిన యూఎన్ కార్యక్రమంలో, కైలాసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సంస్థలు హింసకు గురైన హిందువుల కోసం వాదించాయి. కైలాస దీవి, దాని ప్రతినిధులు ఎవరినీ మోసం చేయలేదని వారు స్పష్టం చేశారు. అంతేగాకుండా తాము నకిలీ కాదని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

జగద్గురు మహాసన్నిధానం (SPH) భగవాన్ నిత్యానంద పరమశివం హిందూ మతపరమైన ఆచారాల ప్రకారం అతని పూర్వీకులచే అధికారికంగా శిక్షణ పొంది, ఎన్నుకోబడ్డారని గమనించడం ముఖ్యం. అతను స్వయంగా చెప్పుకునే దేవత కాదు. 

ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని తాము మీడియా సంస్థలను కోరుతున్నట్లు తెలిపారు. కైలాసదీవిపై ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు కైలాస దీవి ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. 

కైలాసదీవిపై ఏవైనా ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ప్రపంచ శాంతి మరియు ఐక్యతను పెంపొందించగలమని తాము ఆశిస్తున్నామని వెల్లడించారు. 

Press Note: Kailasa Establishes Sister City Relationships for Humanitarian Services and Global Peace

Kailasa is the revival of the ancient enlightened Hindu civilizational nation.

Organizations representing Kailasa, have established sister city relationships with many cities… https://t.co/37lBA1KBno pic.twitter.com/gYitUBRWTK

— KAILASA’s SPH Nithyananda March 17, 2023

TeluguCentralnews

Mar 17 2023, 20:29

New Income Tax rules: ఏప్రిల్ ఒకటిన విడుదల.. పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలివి..

ఈ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలు మారుతుంటాయి. కొన్ని పరిమితులు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి.. వాటి గురించి కనీస అవగాహన ఉండటం అవసరం. ప్రధానంగా ప్రతిపాదిత ఆర్థిక బిల్లు అమల్లోకి వచ్చినప్పుడు ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. ఇది మన పోర్ట్‌ఫోలియోను చక్కగా నిర్వహించడానికి అవసరమైన మార్పులను చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఏప్రిల్ 1 నుండి అమలు కానున్న కొన్ని కొత్త పన్ను నియమాలను నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..

వేతన ఉద్యోగులకు టీడీఎస్ తగ్గింపు

కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఫలితంగా జీతాల ద్వారా వచ్చే ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ లో తగ్గింపును పొందుతారు. రూ. 7,00,000 కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్న వారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 87ఏ కింద అందించిన అదనపు రాయితీ వర్తిస్తుంది. దీని కారణంగా టీడీఎస్ కత్తిరింపులుండవు. అలాగే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 కోట్లకు మించిన వ్యక్తులకు, కొత్త పన్ను విధానంలో వర్తించే సర్‌ఛార్జ్ 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. మొత్తం మీద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించవచ్చు.

దీనిపై పన్ను లేదు.. బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదు (ఈజీఆర్)గా మార్చడంపై పన్ను విధించబడదు. SEBI-నమోదిత వాల్ట్ మేనేజర్ ద్వారా బంగారాన్ని ఉచితంగా ఈజీఆర్ గా మార్చుకోవచ్చు.

దీనిపై కూడా టీడీఎస్ మినహాయింపు..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 193లోని నిబంధన ప్రకారం నిర్దిష్ట సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీడీఎస్ నుంచి మినహాయింపును అందిస్తుంది. పైన పేర్కొన్న సెక్షన్‌లోని నిబంధన (ix) ప్రకారం, కంపెనీ జారీ చేసిన ఏదైనా సెక్యూరిటీపై చెల్లించాల్సిన వడ్డీ విషయంలో ఇలాంటి పన్ను మినహాయింపును అందిస్తుంది, అటువంటి సెక్యూరిటీ డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉంటుంది. అంతేకాక ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో ఉంటుంది. అయితే, ఏప్రిల్ నుండి, ఈ మినహాయింపు తొలగిపోనుంది. జాబితా చేయబడిన డిబెంచర్లతో సహా అన్ని వడ్డీ చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.

ఆన్‌లైన్ గేమ్‌ల విజయాలపై.. ఆదాయ పన్ను చట్ట కొత్త సెక్షన్ 115BBJ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమ్‌ల నుండి గెలుపొందిన వాటిపై పన్ను విధించబడుతుంది. 30 శాతం పన్ను వర్తిస్తుంది.

కొన్ని పరిమితులు..

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54, 54F నిబంధనల ప్రకారం రూ. 10 కోట్ల వరకు లాభాలు మాత్రమే మినహాయించబడతాయి. బ్యాలెన్స్ క్యాపిటల్ గెయిన్స్, అంటే రూ. 10 కోట్ల కంటే ఎక్కువ, ఇప్పుడు 20 శాతం ఫ్లాట్ రేట్ (ఇండెక్సేషన్‌తో) పన్ను విధించబడుతుంది. మూలధన లాభాల నుంచి వచ్చే ఆదాయంపై వర్తించే గరిష్ట సర్‌ఛార్జ్ 15 శాతానికి పరిమితం మైంది.

సెక్షన్ 54 ప్రకారం పన్ను చెల్లింపుదారు తన నివాస గృహాన్ని విక్రయించి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం నుండి మరొక నివాస గృహాన్ని పొందేవారికి పన్ను ప్రయోజనం ఇవ్వబడుతుంది. సెక్షన్ 54F కింద ఇంటి ఆస్తి కాకుండా ఇతర మూలధన ఆస్తిని విక్రయించడం ద్వారా పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలు ఇవ్వబడతాయి.

TeluguCentralnews

Mar 17 2023, 20:20

7 రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు.. ప్రధాని ప్రకటన.. జాబితాలో తెలంగాణ కూడా

దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్‌టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ కి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఆత్మనిర్భర్ ప్లాన్ లో భాగంగా భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి, భారత్ ను ప్రపంచ సప్లై చైన్ లో చేర్చడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ)పథకాన్ని ప్రారంభించింది.

టెక్స్ టైల్స్ పరిశ్రమ కోసం ప్రపంచస్థాయిలో ధీటుగా మారడానికి రూ. 10,683 కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎల్ఐని ప్రారంభించింది. ఈ పథకం కింద టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు ₹ 1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2027-28 వరకు రూ. 4445 కోట్లతో ప్రపంచస్థాయిలో ఈ ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టైల్స్ అభివృద్ధి చేసేందుకు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పీఎం మిత్రా) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.

— Narendra Modi March 17, 2023

TeluguCentralnews

Mar 17 2023, 19:28

ఓరీ దేవుడో వీడు మనిషేనా..? మహిళ చంపి గుండెను ఫ్రై చేసి.. అత్తామామలకు భోజనం పెట్టాడు..

ముగ్గురిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో దోషికి జీవిత ఖైదు విధించింది అమెరికా కోర్టు. అతడు చేసిన దారుణ హత్యల ఉదంతం తెలిస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉంది. నిందితుడు మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి బంగాళాదుంపలతో వేయించి ఫ్రై చేశాడు. ఆ వంటకాన్ని అతని బంధువులకు వడ్డించాడు. 

 ఆ తరువాత వారిని కూడా చంపేశాడు.. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడికి అమెరికా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. మరో కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నెల రోజులు కూడా గడవకముందే ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ట్రిపుల్ మర్డర్ 2021లో జరిగింది. ఇప్పుడు కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

అతను జైలు నుండి విడుదలైన కొన్ని వారాల వ్యవధిలోనే ఆండ్రియా బ్లాంకెన్‌షిప్‌ను చంపి ఆమె గుండెను కోసి ఫ్రై చేసిన తన అత్త, మామలు వారి 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌లకు తినిపించేప్రయత్నం చేశాడు. అనంతరం వారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అతను ముందుగా హత్య చేసిన మహిళ గుండెను అతని భార్యకు కూడా తినిపించడానికి దుండగుడు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

గతంలో డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన లారెన్స్ పాల్ ఆండర్సన్‌కు ఆ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ, సత్ప్రవర్తన కారణంగా అక్కడి ప్రభుత్వం అతని శిక్షను తగ్గించి జైలు నుంచి విడుదల చేసింది. అలా డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి 20 ఏళ్లు శిక్ష అనుభవించి కేవలం 3 ఏళ్లకే విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా బుద్ది మారలేదు. జైల్లోంచి బయటపడింది నెలరోజులు కూడా గడవకముందే ముగ్గురిని దారుణంగా హత్య చేసి మళ్లీ జైలుకు వెళ్లాడు. ట్రిపుల్ మర్డర్ కేసులో విచారించిన పోలీసుల ఎదుట అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో అమెరికా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

TeluguCentralnews

Mar 17 2023, 19:22

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ఆర్మీ చీఫ్ మద్దతు.. పొలిటికల్ కెరీర్ ముగింపుగా ఆర్మీ ప్లాన్..

ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ముగింపు పలికే దిశగా అక్కడి ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సమర్థిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడాన్ని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమర్థించినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనకు ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసి చంపాలను ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఆర్మీ, పాకిస్తాన్ రేంజర్లు, పారామిటరీ, దర్యాప్తు సంస్థలపై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు.

ఇదిలా ఉంటే ‘తోషాఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ నెల 15న అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. చివరకు లాహోర్ హైకోర్టు కల్పించుకుని అరెస్ట్ ను వాయిదా తర్వాతి రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పరిణామాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, దీంతో దేశంలో అంతర్యుద్ధం వస్తుందా.?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి సైనిక పాలన వస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం, ఆర్మీ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ప్రజల నుంచి అనుహ్యంగా మద్దతు ఉన్న ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రజలు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ (పీటీఐ) కార్యకర్తలు అడ్డుపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడిగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆర్మీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ నిబద్ధతను కొనియాడారు.

TeluguCentralnews

Mar 17 2023, 18:40

పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే..ఎందుకంటే..?

ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే..జాబ్ కోసమో..లేక తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామాల నుంచి వలసలు వెళ్లడానికి అసలైన కారణం పెళ్లిళ్లేనట. 

సర్వేలో షాకింగ్ నిజాలు..

2020 జూలై నుంచి 2021 జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వలసలపై నేషనల్‌ శాంపిల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయని స్పష్టం చేసింది. పట్నాల్లో పని వెతుక్కుంటూ భర్తలు వెళ్తుండగా..వారితో పాటే భార్యలు వెళ్తున్నారు. దేశంలోని 87 శాతం భార్యా భర్తలు వలస వెళ్లడానికి వివాహాలే కారణమట. పట్టణ ప్రాంతాల్లో 93.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం మంది మహిళలు పెళ్లి కారణంగా వలస వెళ్తున్నారట. 

ఏ ఏ అంశాలపై సర్వే..?

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పట్టణాలకు, లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి ముఖ్యమైన కారణాలేమిటి అన్న కోణంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే జరిపింది. ఉద్యోగం, ఉపాధి, విద్య, పెళ్లిళ్లు, సామాజిక, రాజకీయ సమస్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పోషణ వంటి అంశాలపై సర్వే నిర్వహించింది. వీటిలో పెళ్లిళ్ల కారణంగానే వలసలు వెళ్తున్నారని తేలింది. ఒక వ్యక్తి 6 నెలలకు పైగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే.. దానిని వలస కింద పరిగణిస్తూ.. సర్వే చేశారు. దేశంలో వలసల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో మొదటి స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఉండగా.. రెండో స్థానంలో పంజాబ్‌, మూడో ప్లేస్లో కేరళ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.

TeluguCentralnews

Mar 17 2023, 18:18

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు గడిచిన 24 గంటల్లో ఎన్నంటే...

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,026కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే, కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 98.80 శాతం రికవరీ రేటు ఉందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరి మరణాలు నమోదయ్యాయి. ఈ ఐదు మరణాలతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,30,795కు చేరింది.

కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడ్డవాళ్ల సంఖ్య 4.46 కోట్లకు చేరింది. అయితే, పెరుగుతున్న కేసులను చూసి భయ పడాల్సిన పని లేదని, కాకపోతే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.