7 రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు.. ప్రధాని ప్రకటన.. జాబితాలో తెలంగాణ కూడా

దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్‌టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ కి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఆత్మనిర్భర్ ప్లాన్ లో భాగంగా భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి, భారత్ ను ప్రపంచ సప్లై చైన్ లో చేర్చడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ)పథకాన్ని ప్రారంభించింది.

టెక్స్ టైల్స్ పరిశ్రమ కోసం ప్రపంచస్థాయిలో ధీటుగా మారడానికి రూ. 10,683 కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎల్ఐని ప్రారంభించింది. ఈ పథకం కింద టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు ₹ 1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2027-28 వరకు రూ. 4445 కోట్లతో ప్రపంచస్థాయిలో ఈ ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టైల్స్ అభివృద్ధి చేసేందుకు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పీఎం మిత్రా) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.

— Narendra Modi March 17, 2023

ఓరీ దేవుడో వీడు మనిషేనా..? మహిళ చంపి గుండెను ఫ్రై చేసి.. అత్తామామలకు భోజనం పెట్టాడు..

ముగ్గురిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో దోషికి జీవిత ఖైదు విధించింది అమెరికా కోర్టు. అతడు చేసిన దారుణ హత్యల ఉదంతం తెలిస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉంది. నిందితుడు మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి బంగాళాదుంపలతో వేయించి ఫ్రై చేశాడు. ఆ వంటకాన్ని అతని బంధువులకు వడ్డించాడు. 

 ఆ తరువాత వారిని కూడా చంపేశాడు.. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడికి అమెరికా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. మరో కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నెల రోజులు కూడా గడవకముందే ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ట్రిపుల్ మర్డర్ 2021లో జరిగింది. ఇప్పుడు కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

అతను జైలు నుండి విడుదలైన కొన్ని వారాల వ్యవధిలోనే ఆండ్రియా బ్లాంకెన్‌షిప్‌ను చంపి ఆమె గుండెను కోసి ఫ్రై చేసిన తన అత్త, మామలు వారి 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌లకు తినిపించేప్రయత్నం చేశాడు. అనంతరం వారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అతను ముందుగా హత్య చేసిన మహిళ గుండెను అతని భార్యకు కూడా తినిపించడానికి దుండగుడు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

గతంలో డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన లారెన్స్ పాల్ ఆండర్సన్‌కు ఆ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ, సత్ప్రవర్తన కారణంగా అక్కడి ప్రభుత్వం అతని శిక్షను తగ్గించి జైలు నుంచి విడుదల చేసింది. అలా డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి 20 ఏళ్లు శిక్ష అనుభవించి కేవలం 3 ఏళ్లకే విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా బుద్ది మారలేదు. జైల్లోంచి బయటపడింది నెలరోజులు కూడా గడవకముందే ముగ్గురిని దారుణంగా హత్య చేసి మళ్లీ జైలుకు వెళ్లాడు. ట్రిపుల్ మర్డర్ కేసులో విచారించిన పోలీసుల ఎదుట అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో అమెరికా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ఆర్మీ చీఫ్ మద్దతు.. పొలిటికల్ కెరీర్ ముగింపుగా ఆర్మీ ప్లాన్..

ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ముగింపు పలికే దిశగా అక్కడి ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సమర్థిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడాన్ని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమర్థించినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనకు ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసి చంపాలను ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఆర్మీ, పాకిస్తాన్ రేంజర్లు, పారామిటరీ, దర్యాప్తు సంస్థలపై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు.

ఇదిలా ఉంటే ‘తోషాఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ నెల 15న అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. చివరకు లాహోర్ హైకోర్టు కల్పించుకుని అరెస్ట్ ను వాయిదా తర్వాతి రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పరిణామాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, దీంతో దేశంలో అంతర్యుద్ధం వస్తుందా.?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి సైనిక పాలన వస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం, ఆర్మీ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ప్రజల నుంచి అనుహ్యంగా మద్దతు ఉన్న ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రజలు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ (పీటీఐ) కార్యకర్తలు అడ్డుపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడిగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆర్మీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ నిబద్ధతను కొనియాడారు.

పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే..ఎందుకంటే..?

ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే..జాబ్ కోసమో..లేక తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామాల నుంచి వలసలు వెళ్లడానికి అసలైన కారణం పెళ్లిళ్లేనట. 

సర్వేలో షాకింగ్ నిజాలు..

2020 జూలై నుంచి 2021 జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వలసలపై నేషనల్‌ శాంపిల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయని స్పష్టం చేసింది. పట్నాల్లో పని వెతుక్కుంటూ భర్తలు వెళ్తుండగా..వారితో పాటే భార్యలు వెళ్తున్నారు. దేశంలోని 87 శాతం భార్యా భర్తలు వలస వెళ్లడానికి వివాహాలే కారణమట. పట్టణ ప్రాంతాల్లో 93.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం మంది మహిళలు పెళ్లి కారణంగా వలస వెళ్తున్నారట. 

ఏ ఏ అంశాలపై సర్వే..?

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పట్టణాలకు, లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి ముఖ్యమైన కారణాలేమిటి అన్న కోణంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే జరిపింది. ఉద్యోగం, ఉపాధి, విద్య, పెళ్లిళ్లు, సామాజిక, రాజకీయ సమస్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పోషణ వంటి అంశాలపై సర్వే నిర్వహించింది. వీటిలో పెళ్లిళ్ల కారణంగానే వలసలు వెళ్తున్నారని తేలింది. ఒక వ్యక్తి 6 నెలలకు పైగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే.. దానిని వలస కింద పరిగణిస్తూ.. సర్వే చేశారు. దేశంలో వలసల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో మొదటి స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఉండగా.. రెండో స్థానంలో పంజాబ్‌, మూడో ప్లేస్లో కేరళ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు గడిచిన 24 గంటల్లో ఎన్నంటే...

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,026కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే, కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 98.80 శాతం రికవరీ రేటు ఉందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరి మరణాలు నమోదయ్యాయి. ఈ ఐదు మరణాలతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,30,795కు చేరింది.

కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడ్డవాళ్ల సంఖ్య 4.46 కోట్లకు చేరింది. అయితే, పెరుగుతున్న కేసులను చూసి భయ పడాల్సిన పని లేదని, కాకపోతే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలపై అత్యాచారం చేసిన ఎన్నారై

మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసి.. 13మందిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎన్నారై. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూలకు పిలిపించి.. మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 

ఈ అకృత్యాలను వీడియో తీసి బెదిరించేవాడు. అతడు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్‌కర్. ఇతడికి కొరియా మహిళంటే పిచ్చి. ఇతడిచే బాధితులైన వారు ఎక్కువ కొరియా మహిళలే. 

2018 నుంచి ఇతడు ఇలా 13 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 అక్టోబరులో పోలీసులు ఇతడి సొంత ఫ్లాటులో జరిగిన సోదాల్లో మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్, బాటిల్స్, వీడియోలతో పాటు 47 వీడియోలతో కూడిన హార్డ్ డ్రైవ్ దొరికింది. ఇక బాలేశ్ నేరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉద్యోగం చేస్తా అందుకు కొడలిపై దాడి చేసిన మామా... ఎక్కడంటే...?

మహిళలు రాకెట్లలో అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నా.. అకృత్యాలు, వివక్ష ఏమాత్రం తగ్గడం లేదు. తను కూడా ఏదో ఒక పనిచేస్తానని ఇంటర్వ్యూకు వెళ్లడానికి సిద్ధమైన మహిళపై ఆమె సొంత మామ దారుణంగా దాడి చేశాడు. ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 

కాజల్, ప్రవీణ్ కుమార్ దంపతులు. ప్రవీణ్ చిరుద్యోగి. తను కూడా ఏదో ఒక జాబ్ చేస్తానని కాజల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటోంది. భర్త సరేనన్నా మామకు గుర్రుగా ఉంటున్నాడు. 

జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందన్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇటుకపెళ్లతో దాడి చేశాడు. ఆమె నడినెత్తిపై బాదాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. స్థానికులు ఆమెను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు 17 కుట్లుపడ్డాయి. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.

అరె ఫుళ్లుగా తాగి పెళ్లి మరిచిన పెళ్లి కొడుకు... తరువాత ఏమైందంటే...

బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉంది. అయినా మద్యపాన సేవనం ఆగట్లేదు. ఫలితంగా మద్యం మత్తులో జీవితాలను కోల్పోతున్నారు. భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తంగంజ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఒక యువకుడు తన పెళ్లి ఊరేగింపుకు వెళ్లడం మర్చిపోయాడు. 

మరుసటి రోజు మత్తు తగ్గడంతో బంధువుల ఒత్తిడితో పెళ్లికి వెళ్లగా.. ఆపై పెళ్లికి యువతి నిరాకరించింది. అంతేకాదు పెళ్లికి చేసిన ఖర్చును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెళ్లికొడుకును, అతని సహోద్యోగిని కూడా బందీలుగా ఉంచారు యువతి బంధువులు. 

విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లికి ముందు పెళ్లికొడుకు మద్యం సేవించాడు. అంతే స్పృహ కోల్పోయాడు. అంతే పెళ్లి ఊరేగింపుకు రాలేకపోయాడు. పదేపదే కాల్ చేసినప్పటికీ, పెళ్లి కొడుకు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. 

ఊరేగింపు సోమవారమే వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం వరకు కూడా చేరుకోలేదు. మరుసటి రోజు, అమ్మాయి తరపువారు సంప్రదించడంతో, బంధువుల ఒత్తిడితో, వరుడు ఎలాగోలా పెళ్లికి సిద్ధమయ్యాడు.

తన సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఈసారి అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని సహాయకుడిని బందీలుగా ఉంచి పెళ్లికి ఖర్చు చేసిన డబ్బును డిమాండ్ చేశారు.

రాహుల్ గాందీ కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ ... క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్...

లండన్‌ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్‌ ప్రసంగంపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తన దాడిని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేతపై వ్యాఖ్యలపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని కాషాయ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ప్రకటనలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కోరారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్యం, దేశ వ్యవస్థలను అవమానించడమేనని బీజేపీ వాదించింది. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ముగించేందుకు కమిటీ పరిశీలించాలని దూబే అన్నారు.

దీని గురించి మాట్లాడుతూ నిషికాంత్ దూబే 2005 నాటి ప్రత్యేక కమిటీ గురించి ప్రస్తావించారు. ఇది పార్లమెంటు ప్రశ్నల కుంభకోణానికి సంబంధించిన నగదును పరిశీలించి, 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసింది. వారు పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీశారని కమిటీ తెలిపిందని, ఆ కమిటీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని దూబే చెప్పారు. యూరప్, అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా పార్లమెంటు, దేశ గౌరవం నిరంతరం మసకబారుతున్నాయని.. అందువల్ల ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. 

గత వారం కూడా, కాంగ్రెస్ నాయకుడిపై తన ప్రత్యేక హక్కు నోటీసుపై పార్లమెంటరీ ప్యానెల్ ముందు నిలదీస్తూ, లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే కోరినట్లు తెలిసింది. హిండెన్‌బర్గ్-అదానీ సమస్యపై వ్యాఖ్యానించిన బడ్జెట్ సెషన్‌లోని మొదటి భాగంలో రాహుల్‌ గాంధీ ప్రసంగంపై ఎంపీ ప్రివిలేజ్ నోటీసును తరలించారు. ఈరోజు తెల్లవారుజామున ఎనిమిది మంది కేంద్ర మంత్రులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించారు.

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయడం, క్షమాపణలు చెప్పడానికి కాంగ్రెస్ నిరాకరించడం బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో గందరగోళానికి కారణమైంది. రాహుల్‌ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పే ప్రస్తక్తేలేదని కాంగ్రెస్‌ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాహుల్‌ గాంధీ స్పందించారు. తనెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని లోక్‌సభ ఎంపీ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు. 

విదేశాల్లో భారత్‌ను అవమానించానంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు స్పందించాల్సి వస్తే.. నాకు మాట్లాడానికి అనుమతి ఇస్తే సభలోనే మాట్లాడతాను’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేశం సాధించిన విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనల్లో తరచూ దాడి చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తాజాగా బ్రిటన్ లో కూడా ‘టిక్‌టాక్‌’ పై నిషేదం.

చైనా యాప్‌ ‘టిక్‌టాక్‌’కు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్ అయిన ఈ యాప్ తాజాగా బ్రిటన్ లో నిషేధించారు. అయితే పూర్తిగా మాత్రం కాదు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఫోన్‌లలో ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు బ్రిటన్‌ వెల్లడించింది. మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు.

‘ప్రభుత్వ సమాచారాన్ని టిక్‌టాక్‌ ఏ విధంగా వినియోగిస్తోందోనన్న విషయంలో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వానికి చెందిన సున్నితమైన సమాచార భద్రతకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి, ప్రభుత్వ పరికరాల్లో ఈ యాప్‌ను నిషేధిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. డేటాను యాక్సెస్‌ చేసే ఇతర యాప్‌లపైనా దృష్టి సారించాం. థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ల నిర్వహణపై ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తాం’ అని డౌడెన్‌ అన్నారు.

బ్రిటన్‌లో ప్రస్తుతం ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్ వినియోగం పరిమితంగా ఉంది. తాజాగా దాన్ని పూర్తిగా నిషేధించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని డివైజ్‌లకు ఇది వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, సాధారణ ప్రజల వ్యక్తిగత పరికరాలపై ఈ నిషేధం ఉండదు. ఇంటర్నెట్‌ దుర్వినియోగం వంటి అంశాలపై పనిచేసే ప్రభుత్వ విభాగాల్లోని ఫోన్‌లలో టిక్‌టాక్ వినియోగానికి నిర్దిష్ట మినహాయింపులు కల్పిస్తున్నట్లు క్యాబినెట్ కార్యాలయం తెలిపింది.