పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే..ఎందుకంటే..?
ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే..జాబ్ కోసమో..లేక తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామాల నుంచి వలసలు వెళ్లడానికి అసలైన కారణం పెళ్లిళ్లేనట.
సర్వేలో షాకింగ్ నిజాలు..
2020 జూలై నుంచి 2021 జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వలసలపై నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయని స్పష్టం చేసింది. పట్నాల్లో పని వెతుక్కుంటూ భర్తలు వెళ్తుండగా..వారితో పాటే భార్యలు వెళ్తున్నారు. దేశంలోని 87 శాతం భార్యా భర్తలు వలస వెళ్లడానికి వివాహాలే కారణమట. పట్టణ ప్రాంతాల్లో 93.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం మంది మహిళలు పెళ్లి కారణంగా వలస వెళ్తున్నారట.
ఏ ఏ అంశాలపై సర్వే..?
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పట్టణాలకు, లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి ముఖ్యమైన కారణాలేమిటి అన్న కోణంలో నేషనల్ శాంపిల్ సర్వే జరిపింది. ఉద్యోగం, ఉపాధి, విద్య, పెళ్లిళ్లు, సామాజిక, రాజకీయ సమస్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పోషణ వంటి అంశాలపై సర్వే నిర్వహించింది. వీటిలో పెళ్లిళ్ల కారణంగానే వలసలు వెళ్తున్నారని తేలింది. ఒక వ్యక్తి 6 నెలలకు పైగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే.. దానిని వలస కింద పరిగణిస్తూ.. సర్వే చేశారు. దేశంలో వలసల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో మొదటి స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ ఉండగా.. రెండో స్థానంలో పంజాబ్, మూడో ప్లేస్లో కేరళ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.
Mar 17 2023, 19:22