Telangana News: చేవెళ్లలో కారు బీభత్సం.. 2 కార్లు, 15 ద్విచక్రవాహనాలు ధ్వంసం..
చేవెళ్ల: అతి వేగంతో వచ్చిన ఓ కారు .. 15 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది..
చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యవకుడు కారులో చేవెళ్ల వెళ్తుండగా.. జర్నలిస్టు కాలనీకి రాగానే అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న రెండు కార్లు, 15 ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ధ్వంసమయ్యాయి.
కారు బీభత్సంతో ఒక్కసారిగా కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.
మధ్యాహ్న సమయం కావడంతో జనసంచారం లేక ప్రమాదం తప్పిందని, సాయంత్రం సమయంలో అయితే ప్రాణనష్టం సంభవించేదని వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను జేసీబీ సాయంతో తొలగించారు. స్వల్పంగా గాయపడిన రాజశేఖర్‌ను ఆసుపత్రికి తరలించారు..
Mar 02 2023, 18:28