తమ సమస్యల్ని, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ సిబ్బంది పాదయాత్ర
•కొండపాక మండలంలో పాదయాత్ర చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది•
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(కొండపాక):- తమ సమస్యల్ని, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి రాష్ట్ర నాయకులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా మంగళవారం రోజున కొండపాక మండలంలోని వెలికట్ట చౌరస్తా నుండి దుద్దెడ అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2500మంది గ్రామ పంచాయితీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై, కారోబార్, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నరసయ్య పాల్గొని మాట్లాడుతూ వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు,బలహీనవర్గాలకు చెందిన పేదలే. రాష్ట్రంలోనూ మరియు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీరు నిరాదరణకు గురవుతున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అయిన తర్వాత వీరి వేతనాలను రూ.8500లకు పెంచినా, ఆ పెంపు శాస్త్రీయ పద్ధతిలో లేదని 2023లోని జనాభా, పంచాయితీ విస్తరణకనుగుణంగా వీరు సేవలందిస్తున్నారని అన్నారు. కానీ 2011 జనాభాను మాత్రమే లెక్కలోకి తీసుకొని 500 జనాభాకు ఒక కార్మికుడిగా పరిగణించారని క్షేత్రస్థాయిలో గ్రామ అవసరాల ప్రాతిపదికన మీద పంచాయితీ పాలకవర్గం మరికొంత కార్మికులను నియమించుకుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పెంచిన వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి మాత్రమే వస్తున్న వేతనాలను అందరూ పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అత్యధిక మంది కార్మికులకు రూ.3500ల నుండి రూ.4500ల వరకు మాత్రమే వస్తున్నాయని గుర్తు చేశారు. వేతనాలు పెంచామనే సాకుతో వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొస్తూ ప్రభుత్వం 51 జీవోను తెచ్చిందన్నారు. దీంతో కార్మికులకు పని భారం పెరిగిందని కారోబార్‌తో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్స్ డ్రైవర్, చివరికి ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులను కూడా చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా 4నుండి 7 నెలల వరకు బకాయిలుగా ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో కార్మికులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారన్నారు.గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 12 నుండి పాదయాత్ర జరుగుతుందన్నారు. జీఓ నెం.60 గ్రామపంచాయితీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ, పారిశుద్ధ్య కార్మికులకు రూ.15600లు, కారోబార్, బిల్‌కలెక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై కార్మికులకు రూ.19500లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22750ల వేతనం చెల్లించాలని, యాక్ట్ 2/94ను రద్దు చేసి పంచాయితీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని, జీఓ నంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని, పంచాయితీ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు మరియు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5,50,000లు ఆర్ధిక సహాయం చేయాలని, ఇప్పటికే మల్టీపర్పస్ వర్కర్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై డ్యూటీ చేయలేని స్థితిలో ఉన్న వారి మరియు మరణించిన వారి కుటుంబ సభ్యులకు పంచాయితీల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని, దళితబంధును ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని పాదయాత్ర బృందం కోరుతున్నదని తెలిపారు.ఇవి గొంతెమ్మ కోర్కెలు కావని కావున వీరి న్యాయమైన సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . మరియు ఈ నెల 28న జరిగే పాదయాత్ర బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సంఘీభావ పాదయాత్ర కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బర్మ కొమురయ్య,మండల కార్యదర్శి జాలిగామ ప్రభాకర్,కార్మికులు పల్లె శ్రీనివాస్, ఎల్లయ్య,దబ్బెట సుధాకర్,గొడుగు నారాయణ,నీరటి కలవ్వ, లచ్చవ్వ,మల్లవ్వ,వెంకటవ్వ, మల్లేశం, రాజు,తలారి ఐలయ్య,నాగవ్వ, మండలంలోని కార్మికులందరూ పాల్గొన్నారు.
Feb 22 2023, 07:17