సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. పరిశీలనలో ప్రయాణ మార్గాలు
రైలు ప్రయాణికులు ఎదురుచూస్తున్న సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే త్వరలో పచ్చజెండా ఊపనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రైలు ప్రయాణ మార్గం, టికెట్ ధర, రైలు నంబర్లు వంటి వాటిపై కసరత్తు ప్రారంభించారు.
తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: సికింద్రాబాద్- తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే పరుగులు పెట్టనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తుండగా.. రెండోది సికింద్రాబాద్- తిరుపతి మధ్య పట్టాలెక్కనుంది.
అందుకు సంబంధించి ద.మ.రైల్వే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణ మార్గాలను అన్వేషిస్తున్నారు. మూడు మార్గాలు.. బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మీదుగా, మరొకటి వరంగల్, ఖాజీపేట, కడప మీదుగా.. ఇంకొకటి బీబీనగర్ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా నడపాలని సర్వే చేపట్టారు. వీటితో పాటు పిడుగురాళ్ల జంక్షన్ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా సర్వే నిర్వహించారు. వీటిల్లో తక్కువ దూరం ఉన్న మార్గాన్ని పరిశీలించి, గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్‌ల పటిష్ఠత, వంతెన నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత మార్గాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. వందేభారత్ రైలు టికెట్ ధర జీఎస్‌టీ, తత్కాల్ సర్‌ఛార్జితో కలిపి రూ.1150 నుంచి ప్రారంభం కానుంది. టికెట్ ఛార్జి, రైలు నంబర్లు ఖరారు కాగానే ప్రయాణికుల అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందపరచనున్నారు. సాధారణంగా తిరుపతి- సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ సమయం 12 గంటలు పడుతుండగా, వందేభారత్ రైలు ప్రయాణం ఆరేడు గంటలు పడుతుందని అధికారుల అంచనా. దీంతో తిరుమల, తిరుపతి పర్యాటకులు, భక్తులు వందేభారత్ రైలును ఆశ్రయించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరి నెలాఖరులోగా రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Feb 18 2023, 20:03