'విల్లు- బాణాన్ని చోరీ చేశారు..!’
ముంబయి: శివసేన(Shiv Sena) ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’ను చోరీ చేశారని శివసేన(యూబీటీ) వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) శనివారం మండిపడ్డారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సి ఉందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)ను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. శనివారం ‘మాతో శ్రీ’ వద్ద ఉద్ధవ్ తన మద్దతుదారులతో ఈ మేరకు మాట్లాడారు. శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర(Maharashtra) సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ECI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
‘‘విల్లు- బాణం’ చోరీకి గురయ్యాయి. నిందితుడికి గుణపాఠం చెప్పాలి. విల్లు- బాణంతో మైదానంలోకి రమ్మని ఆయనకు సవాలు విసురుతోన్నా. మేం దానిని మండే ‘కాగడా’తో ఎదుర్కొంటాం’ అని శిందేను ఉద్దేశించి ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ దీనిని కేటాయించింది. పుణె జిల్లాలోని కస్బా పేట్, చించ్‌వాడ్ ఉప ఎన్నికల వరకు ఈ గుర్తు ఉద్ధవ్ వర్గం వద్దే ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు.. ఠాక్రే విధేయులు 'మాతోశ్రీ' వెలుపల పెద్ద సంఖ్యలో గూమిగూడారు. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ శిందేకు వ్యతిరేకంగా, ఉద్ధవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో పర్యటించి క్యాడర్‌ను సమీకరించాలని ఠాక్రే తన శ్రేణులకు సూచించినట్లు ఓ నేత తెలిపారు. అంతకుముందు.. శిందే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. నేడు పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
Feb 18 2023, 19:47