ఎంఎంటీఎస్ ఫేజ్-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతే త్వరగా పనులు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.
ఎంఎంటీఎస్ లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
Feb 18 2023, 19:57