ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతే త్వరగా పనులు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

ఎంఎంటీఎస్‌ లైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్‌ రెడ్డి ప్రారంభించారు.

అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

రెండో రోజు ఆట పూర్తి.. ఆసీస్‌ 62 పరుగుల లీడ్‌

దిల్లీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 262 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ ఖవాజా (6)ను జడేజా ఔట్‌ చేశాడు.

ప్రస్తుతం ట్రావిస్‌ హెడ్‌ (39), లబుషేన్‌ (16) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లోని సాధించిన ఒక పరుగు ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్‌ 62 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.

తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

బెంగళూరు: గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna)కు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్‌డేట్‌ వచ్చింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

కాసేపట్లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జనసంద్రమైన శ్రీశైలం.. కనీస సదుపాయాలు కల్పించలేదని భక్తుల ఆగ్రహం

శ్రీశైలం ఆలయం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తెల్లవారుజామున 2గంటల నుంచే ఆలయంలో రద్దీ కొనసాగుతోంది.

ఉచిత దర్శనానికి 7గంటలు, శీఘ్ర దర్శనానికి 4గంటలకుపైగా సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండటం, కనీసం తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు సున్నిపెంట వద్ద శివ దీక్ష భక్తులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌, తెలంగాణ ప్రాంతం నుంచి వాహనాల్లో ఉదయం శ్రీశైలం వస్తుండగా పోలీసులు సున్నిపెంట వద్ద అడ్డుకున్నారు. శ్రీశైలంలో పార్కింగ్‌ సదుపాయం లేదంటూ వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు భక్తులను శ్రీశైలంలోకి అనుమతించారు.

'విల్లు- బాణాన్ని చోరీ చేశారు..!’

ముంబయి: శివసేన(Shiv Sena) ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’ను చోరీ చేశారని శివసేన(యూబీటీ) వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) శనివారం మండిపడ్డారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సి ఉందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)ను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. శనివారం ‘మాతో శ్రీ’ వద్ద ఉద్ధవ్‌ తన మద్దతుదారులతో ఈ మేరకు మాట్లాడారు. శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర(Maharashtra) సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ECI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

‘‘విల్లు- బాణం’ చోరీకి గురయ్యాయి. నిందితుడికి గుణపాఠం చెప్పాలి. విల్లు- బాణంతో మైదానంలోకి రమ్మని ఆయనకు సవాలు విసురుతోన్నా. మేం దానిని మండే ‘కాగడా’తో ఎదుర్కొంటాం’ అని శిందేను ఉద్దేశించి ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్‌ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ దీనిని కేటాయించింది. పుణె జిల్లాలోని కస్బా పేట్‌, చించ్‌వాడ్ ఉప ఎన్నికల వరకు ఈ గుర్తు ఉద్ధవ్‌ వర్గం వద్దే ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు.. ఠాక్రే విధేయులు 'మాతోశ్రీ' వెలుపల పెద్ద సంఖ్యలో గూమిగూడారు. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ శిందేకు వ్యతిరేకంగా, ఉద్ధవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో పర్యటించి క్యాడర్‌ను సమీకరించాలని ఠాక్రే తన శ్రేణులకు సూచించినట్లు ఓ నేత తెలిపారు. అంతకుముందు.. శిందే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. నేడు పార్టీ నేతలతో ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

Lockup death: మెదక్‌ లాకప్‌ డెత్‌ ఘటనపై డీజీపీ అగ్రహం.. ఐజీ చంద్రశేఖర్‌కు విచారణ బాధ్యతలు

హైదరాబాద్‌: మెదక్‌ (Medak) పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ (Lockup death) ఘటనపై డీజీపీ అంజనీకుమార్‌ (DGP Anjani Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు..

దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్‌ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని,

ఐజీ చంద్రశేఖర్‌ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. మెదక్‌ సీఐ, ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

viveka Murder case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

కడప: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది..

గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి

ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్‌ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు. అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు రెండోసారి నోటీసులివ్వటం గమనార్హం.

చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి: మంత్రి వేణు

రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు.

''చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందే. పోలీసుల పట్ల చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు'' అని మంత్రి వేణు అన్నారు.

Chandrababu: సజ్జల డైరెక్షన్‌లోనే పోలీసుల అరాచకం: మండిపడ్డ చంద్రబాబు

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

నిన్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు తెదేపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని.. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రజల్లో వ్యతిరేకత గమనించే వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. నిన్న అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి... అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయి. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. చట్టవ్యతిరేకంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే కొంతమంది పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కావాలనే తెదేపా కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారు. కార్యకర్త ప్రకాశ్‌నాయుడిని గుండెలపై కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని కోరుతున్నాను. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి'' అని చంద్రబాబు పోలీసులకు సూచించారు..

Cheetahs: మళ్లీ ఎగిరొచ్చిన చీతాలు.. దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్‌ చేరుకున్న విమానం

గ్వాలియర్‌: దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు (Cheetahs) ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికా (South Africa)తో ఒప్పందంలో భాగంగా 12 చీతాలు శనివారం భారత్‌ చేరుకున్నాయి..

ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్‌ జిల్లాలోని కునో జాతీయ పార్కు (Kuno National Park)కు తరలించనున్నారు.

ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ వీటిని కునో నేషనల్‌ పార్క్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటి కోసం కునో పార్కులో పది క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం.. నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచనున్నారు.