Nirmala sitharaman: మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కు తెలియదా?: నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో తెలియదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

'అమృతకాల బడ్జెట్‌' అంశంపై దూరదర్శన్‌ న్యూస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్రమంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎంత? ఇప్పుడు తెలంగాణ అప్పులు ఎంత? అని ప్రశ్నించారు..

2014లో తెలంగాణకి రూ.60వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రూ.3లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని ప్రశ్నించారు. నో డేటా అవైలబుల్‌ గవర్నమెంట్‌ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని భారాస నేతలు మాట్లాడాలన్నారు. కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీలు ఉన్నా అవే జిల్లాల పేర్లు మళ్లీ మెడికల్‌ కాలేజీల కోసం పంపించారని.. అందుకే తిరస్కరించి పంపించినా కొత్త జిల్లాల పేర్లు ఇప్పటికీ పంపించలేదని నిర్మలా సీతారామన్‌ తెలిపారు..

డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూలం.. నిర్మలమ్మకు మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: డేటా సెంటర్ల నిర్వహణలో తెలంగాణ ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకొందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) తెలిపారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూల ప్రదేశంగా ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాల అంశంపై కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ (Minister Nirmala sitharaman)కు ఆయన లేఖ రాశారు.

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలనే బడ్జెట్ ప్రతిపాదన గురించి లేఖలో ప్రస్తావించారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. భూకంపాలకు ఎక్కువ అవకాశమున్న రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మరొక దేశంతో సరిహద్దు పంచుకొనే రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ ముప్పు ఉంటుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది: హరీశ్‌రావు

యాదాద్రి: బీబీసీ(BBC)లో కథనం ప్రసారం అయ్యిందని.. ఆ సంస్థలపై దాడులు జరుపుతోన్న కేంద్రం తీరుతో ప్రపంచం ముందు దేశం పరువుపోతోందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) అన్నారు. వార్తా కథనంలో తప్పులుంటే వివరణ ఇవ్వాలి కానీ, ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయటమే అవుతుందని విమర్శించారు. యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎంపీ బడుగుల లింగయ్య, స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యారోగ్యంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే యాదాద్రి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తామన్నారు.

రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలల ఏర్పాటును త్వరలో చేపడతామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే భాజపా నేతలు కుట్రలు అంటున్నారని వారిపై విరుచుకుపడ్డారు. ‘‘ఉద్యోగ ప్రకటనలు ఇస్తే భాజపా అధ్యక్షుడు కుట్రలు అంటుంటారు. ఇలాంటి వింత నేతను ఎక్కడైనా చూశామా? అంబేడ్కర్‌ పేరుతో సచివాలయం నిర్మిస్తే దాన్నీ కూల్చేస్తామంటున్నారు. పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది. కూల్చేస్తాం.. తవ్వేస్తాం.. అనేది భారాస విధానం కాదు. దేవుణ్ని రాజకీయాలకు వాడుకునే సంస్కృతి మాదికాదు. భాజపా నేతల్లా భారాస అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. చేసింది చెప్పుకొన్నా.. ప్రజలు భారాసకే ఓటు వేస్తారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణ మాదిరి పంజాబ్‌లోనూ కొత్త జల విధానం: సీఎం భగవంత్‌ మాన్

సిద్దిపేట: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరి నీటి సేకరణ కోసం కొత్త జల విధానం రూపొందిస్తామని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ జలాశయాలను సీఎం గురువారం సందర్శించారు. అనంతరం రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. ‘‘ రైతులతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. దిల్లీలో చూసి ఇక్కడ బస్తీ దవాఖానా ప్రారంభించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దిల్లీ వెళ్లి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకుని అదే తరహాలో తమ రాష్ట్రంలో రూపొందించారు.

వినూత్నంగా ఆలోచించి మంచి వ్యవస్థను తీసుకురావడమే నాయకుడి పని. పంజాబ్‌లో వ్యవసాయ వ్యవస్థ 1947 కంటే ముందుదే ఉంది. దీనిలో మార్పులు చేసి కొత్త వ్యవస్థను తీసుకురావాలి. మా రాష్ట్రంలో చాలా పెద్ద డ్యామ్‌లు ఉన్నాయి. కానీ చెరువులు లేక సమస్యగా ఉంది. అక్కడ గ్రౌండ్ వాటర్ తక్కువ కాబట్టి నూతన ఒరవడి కోసం ప్రయత్నిస్తున్నాం. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక నాసా వాటిని రెడ్ జోన్‌గా ప్రకటించింది. రానున్న కాలానికి నీళ్ల అవసరం ఎక్కువ ఉన్నందున నీటి సేకరణ కోసం చర్యలు చేపడుతున్నాం. మంచి మనసున్న నాయకుడు ఉంటే ఆ ప్రాంతం ఎల్లప్పుడూ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యాక దిల్లీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందింది. ఉచిత కరెంట్‌, విద్యా వ్యవస్థ, బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. రానున్న రోజుల్లో పంజాబ్‌ను రంగీలా పంజాబ్‌గా తిరిగి తీసుకొస్తాం’’ అని భగవంత్‌ మాన్‌ అన్నారు.

Latur: భూమి నుంచి వింత శబ్దాలు.. ‘భూకంపం’ వదంతులతో స్థానికుల్లో భయం

లాతూర్‌: తుర్కియే, సిరియాలో చోటుచేసుకున్న భారీ భూకంపం (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ స్వల్ప భూకంపం సంభవించినా.. అక్కడి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని లాతూర్‌ (Latur) జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు (Mysterious Sounds ) రావడం కలకలం రేపింది. భూకంపం వస్తుందనే వదంతులు వ్యాప్తి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు మాత్రం భూకంపం వదంతులు (Rumours) నమ్మవద్దని.. ఎటువంటి ప్రకంపనలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.

లాతూర్‌లోని వివేకానంద నగర్‌ ప్రాంతంలో భూమి నుంచి శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఇది భూకంపానికి సూచనేనంటూ ఆందోళన చెందారు. దాంతో ఆ ప్రాంతమంతా భూకంప వదంతులు వ్యాపించాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి రావడంతో.. జిల్లా విపత్తు నియంత్రణ విభాగం అప్రమత్తమయ్యింది. లాతూర్‌ నగరంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకున్నామని.. ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు.

మరాఠ్వాడా ప్రాంతంలో కొంతకాలంగా ఇటువంటి శబ్దాలు వినిపిస్తున్న మాట వాస్తవమేనని జిల్లా అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో లాతూర్‌కు సమీపంలోని హిసోరి, కిల్లారీతోపాటు సమీప గ్రామాల్లో భూమి నుంచి ధ్వనులు వినిపించాయి. నీతుర్‌-డాంగేవాడీ ప్రాంతాల్లోనూ ఇటువంటి శబ్దాలు వచ్చాయి. గతంలో ఇక్కడ సంభవించిన భూకంపం తాజా భయాలకు కారణమవుతోందని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. లాతూర్‌లో 1993లో సంభవించిన భారీ భూకంపంలో (Killari Earthquake) 9700 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీపై వివాదం.. సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గురువారం పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు.

తనకు చెప్పకుండా మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కొందరికి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో స్థలాలు ఇచ్చారన్న బాలరాజు.. మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Kohinoor diamond : కోహినూర్‌.. రాజులకు అరిష్టం.. రాణులకు అదృష్టం!

వలస పాలనకు గుర్తుగా బ్రిటన్‌(britain) రాచకుటుంబం చేతిలో ఇప్పటికీ కోహినూర్‌ వజ్రం(Kohinoor diamond) ఉంది. గతేడాది రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూశారు. మరణించే వరకు ఆమె కిరీటంలోనే కోహినూర్‌ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె దాన్ని ధరిస్తూ వచ్చారు. రాణి మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్‌ ఛార్లెస్‌-3(king charles) పట్టాభిషిక్తుడు కానున్నాడు. విక్టోరియా మహారాణి కోహినూర్‌ గురించి రాసిన వీలునామా ప్రకారం ఛార్లెస్‌ భార్య, బ్రిటన్‌ రాణి కెమిల్లా(camilla) దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని ఇటీవల బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు తెలిపాయి. చరిత్రలో కోహినూర్‌ ధరించిన రాజులందరూ చరిత్రలో కలిసిపోయారు. అందుకే ఛార్లెస్‌-3, కెమిల్లా కోహినూర్‌ను దూరం పెడుతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

తెలుగు నేలపై కోహినూర్‌ పుట్టుక!

కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలున్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్‌ దొరికిందని చెబుతారు. అప్పుడు దాని బరువు గురించి కచ్చితమైన రికార్డులు లేవు. ప్రస్తుతం కోహినూర్‌ 105.6 క్యారెట్లు ఉంది. ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. వారి ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. దిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకొని అపారమైన సంపద, కోహినూర్‌ వజ్రం సమర్పించుకున్నాడని అంటారు.

చేతులు మారుతూ.. రాజ్యాలు తిరుగుతూ..

ఈ వజ్రాన్ని 1304లో దిల్లీ రాజు అల్లావుద్దీన్‌ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని సమర్‌ఖండ్‌కు పంపించారు. 1526 నాటికి ఈ వజ్రం మొఘల్‌ రాజు బాబర్‌ చేతికి వచ్చింది. ఆయన ‘బాబర్‌ నామా’లో ప్రత్యేకంగా వజ్రం గురించి రాశాడు. దానిని సుల్తాన్‌ ఇబ్రహీం లోడి తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ప్రపంచంలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే సంపదలో సగం ధరకు సమానమైనది కోహినూర్‌ అని బాబర్‌నామాలో వ్యాఖ్యానించాడు. బాబర్‌ నుంచి ఔరంగజేబు వరకు ఈ వజ్రం మొఘల్‌ వారసుల చేతులు మారుతూ వచ్చింది. ఔరంగజేబు మనవడైన సుల్తాన్‌ మహమ్మద్‌ కాలంలో ఇది పరాయివారి సొంతమైంది.

పర్షియన్‌ జనరల్‌ నాదిర్‌ షా 1739 నాటికి భారత్‌లో అడుగుపెట్టాడు. ఆ వెంటనే సుల్తాన్‌ మహమ్మద్‌ కిరీటంపై కన్నేశాడు. నాదిర్‌ షాకు లొంగిపోయిన సుల్తాన్‌ మహమ్మద్‌ ఖరీదైన వజ్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పుడే నాదిర్‌ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్‌గా నామకరణం చేశాడు. పర్షియన్‌ భాషలో కోహినూర్‌ అంటే ‘కాంతిశిఖరం’ అని అర్థం. అయితే కోహినూర్‌ను చేజిక్కించుకుని భారత్‌ విడిచి పర్షియా(ఇరాన్‌) వెళ్లిన నాదిర్‌షా దాన్ని తన బంగారు సింహాసనంలో పొదిగాడు. షా 1747లో హత్యకు గురికావడంతో షా జనరల్స్‌లో ఒకరైన అహ్మద్‌ షా దుర్రాని చేతుల్లోకి కోహినూర్‌ వెళ్లింది. దుర్రానీ వారసుడు షా షుజా దుర్రానీ 1813లో కోహినూర్‌ను తిరిగి భారత్‌కు తీసుకొచ్చాడు. సిక్కు రాజ్యం స్థాపించిన రంజిత్‌ సింగ్‌కు దానిని అప్పగించాడు. ప్రతిగా అఫ్గాన్‌ సింహాసనం షా షుజా దక్కించుకునేందుకు రంజిత్‌ సింగ్‌ సహాయం చేశాడు.

ఆంగ్లో-సిక్కు యుద్ధం

బ్రిటిష్‌ వారు పంజాబ్‌ ఆక్రమణకు దండెత్తడంతో సిక్కు రాజులకు, బ్రిటిష్‌ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. 1849 నాటికి బ్రిటిష్‌ పాలకులు పంజాబ్‌ను పూర్తిగా ఆక్రమించి ఆభరణాలను జప్తు చేశారు. రంజిత్‌ సింగ్‌ చనిపోవడంతో ఆయన సతీమణి రాణి జిందన్‌ను ఖైదు చేసి జైలుకు పంపించారు. వారి కుమారుడైన బాలుడు దులీప్‌సింగ్‌తో బ్రిటిష్‌ వారు లాహోర్‌ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. వెంటనే కోహినూర్‌ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అటు నుంచి భారీ ఓడలో డైమండ్‌ను తరలిస్తుండగా కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. 1850వ సంవత్సరంలో బ్రిటన్‌లో ఉన్న క్వీన్‌ విక్టోరియా వద్దకు డైమండ్‌ చేరింది. ఆమె దాన్ని లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే కోహినూర్‌ వన్నె తగ్గిందని భావించిన విక్టోరియా 1852లో దానికి మెరుగులు దిద్దించాలని నిర్ణయించారు. డచ్‌కు చెందిన జువెలర్‌ కాంటోర్‌కు ఆ పనిని అప్పగించగా కోహినూర్‌ 108.93 క్యారట్లకు తగ్గిపోయింది.

విక్టోరియా వీలునామా

కోహినూర్‌ చరిత్రలో దానిని ధరించిన లేదా తమ వద్ద దాచుకున్న రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దాంతో విక్టోరియా జాగ్రత్తపడింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే దానిని ధరిస్తూ వచ్చింది. మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీలునామా కూడా రాసింది. ఒక వేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రాణికి ఆ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని అందులో పేర్కొంది. విక్టోరియా తరువాత దాన్ని క్వీన్‌ అలెగ్జాండ్రా, క్వీన్‌ మేరీ, క్వీన్‌ ఎలిజబెత్‌-2(queen elizabeth) తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్‌ ఆఫ్‌ లండన్‌ వద్దనున్న జువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం మాకు ఇవ్వాలని భారత్‌(india) పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ తిరస్కరించింది. పాక్‌, అఫ్గాన్‌ దేశాలు కూడా ఈ వజ్రం తమ సొంతమని.. తమకే ఇవ్వాలని అడుగుతున్నాయి.

Kanna Laxminarayana: సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే భాజపాకు రాజీనామా: కన్నా

గుంటూరు: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భాజపా(BJP)లో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) చెప్పారు..

చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ప్రవర్తన బాగాలేకనే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని చెప్పారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు..

''2014లో భాజపాలో చేరా. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి 2019 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించా. 2024 ఎన్నికల్లో ఏపీలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశా. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశా. ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాడా. కరోనా తర్వాత నన్ను మార్చి సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేశారు. ఆయన ప్రవర్తన నచ్చకే రాజీనామా చేశా. స్థానిక నాయకుల వైఖరి కారణంగా పార్టీలో మనుగడ సాగించలేను. నాతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు'' అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

JEE Main: ‘జేఈఈ’ దరఖాస్తు గడువు మార్చి 12

•ఎట్టకేలకు మొదలైన తుది విడత అర్జీ ప్రక్రియ

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడతకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఎట్టకేలకు బుధవారం మొదలైంది. అభ్యర్థులు వచ్చే మార్చి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ప్రకటించిన ప్రకారం అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

అందుకోసం లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నా ఉలుకూపలుకూ లేని ఎన్‌టీఏ వారం రోజులు ఆలస్యంగా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్‌ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఏప్రిల్‌ 13, 15 తేదీలను ఎన్‌టీఏ రిజర్వు చేసింది. పరీక్ష అనంతరం.. ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటి స్తారు.

5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ.. దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఇటీవల నియామక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు తుది గడువును తొలుత ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటలుగా ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఈ గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది.

దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాల్లేవని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెల్లడించింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో అన్నీ బహుళ ఐచ్ఛిక (మల్టీపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నలే ఉంటాయి. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. వీరికి వేతనం స్కేలు రూ.36,750-1,06,990గా పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు అన్నీ కూడా వర్తిస్తాయి. స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్‌ ఉంటుంది.