విద్యుత్ డిమాండ్ 14,649 మెగావాట్లు.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికమిదే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డు స్థాయిలో శనివారం నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 14,649 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు విద్యుత్‌శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. నిన్న 14,169 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఇవాళ అంతకు మించి 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయినట్టు వెల్లడించారు. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారత దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వ్యవసాయ నాట్లు ముగింపు దశలో ఉండటం, మొదట్లో వేసిన పంటలు ఏపుగా పెరగడంతో నీటి వినియోగం భారీగా పెరిగింది. ఉద్యాన పంటలకు సైతం నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం బోరుబావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు.
దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయానికి 35శాతం మాత్రమే విద్యుత్ వినియోగించేవారు. ప్రస్తుతం ఆ వినియోగం 37శాతానికి పెరిగిందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం 6,666 మెగావాట్లు మాత్రమే ఉండేదన్నారు. రానున్న రోజుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంత డిమాండ్ వచ్చినా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
Feb 12 2023, 09:53