పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యలకు సీఎం కేసీఆర్ (CM KCR) కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. పోడు భూములపై సీఎంకు గుబులు పుట్టిందని ఆయన విమర్శించారు.
అర్హులైన వారికి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూముల పట్టాలు ఇస్తామని 2014 నుంచి చెబుతున్నారు.. కానీ, 9ఏళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. హాథ్ సే హథ్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లెందు సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
అసెంబ్లీని వేదికగా చేసుకుని సీఎం కేసీఆర్ పేద ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ సభకు వెళ్తే పోడు భూములకు పట్టాలు రావని భారాస నేతలు బెదిరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే.. ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Feb 12 2023, 09:48