CM KCR: 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్
•అంజన్న క్షేత్రం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌పై చర్చ!
హైదరాబాద్-మల్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ 14న ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి ఆదివారం కొండగట్టు వెళ్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన రూపొందించనున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రితరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శాభావం వ్యక్తం చేశారు.
త్వరలో లాల్ దర్వాజ ఆలయ పనులు: తలసాని
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పాతనగరంలోని ప్రసిద్ధ లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ చేపడతామని కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు అక్కడ 10 రోజుల్లో భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం శాసనసభలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆలయ అభివృద్ధిపై మజ్లిస్ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే బలాలతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘లాల్ దర్వాజ ఆలయ విస్తరణకు 1100 గజాల స్థలం గుర్తించాం. ఆ భూముల యజమానులకు పరిహారం ఇచ్చేందుకు కేసీఆర్ రూ.8.95 కోట్లు మంజూరు చేశారు. కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలకు రూ.19 కోట్లు ఇచ్చారు’’ అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ అమోయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2023, 09:46