Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..
దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తావనకు వచ్చింది..
పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు.
ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విచారణ జరగనందున తమకు ఇప్పటి నుంచి కనీసం 2 వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫు న్యాయవాదులకే ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమర్థించారు..
ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Feb 06 2023, 16:15