Telangananews

Oct 22 2021, 08:52

యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా

 


తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. ఈ రోజు సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు. నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 

Telangananews

Oct 22 2021, 08:44

స్క్రోలింగ్ :

 


రాచకొండ : సరూర్ నగర్ ఎస్ఐ సైదులు పై సస్పెన్షన్ వేటు

 

సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సిపి 

క్రిమినల్ కేసులో డబ్బులు డిమాండ్ చేస్తూ సెటిల్మెంట్ చేస్తున్నట్లు నిర్ధారణ. 

Telangananews

Oct 22 2021, 08:41

ఏసీబీ దాడులు

 


రూ.5.50లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చికిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

 

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ ఓ వ్యక్తిని రూ.5.50లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ వాసు ద్వారా   తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 

Telangananews

Oct 21 2021, 18:47

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న పాక్ ప్రధాని 

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఇమ్రాన్ అమ్ముకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం సంచలనం రేపుతోంది.

 

 ఒక గల్ఫ్ దేశ యువరాజు ఇచ్చిన అత్యంత ఖరీదైన గడియారాన్ని విక్రయించడం ద్వారా సుమారు రూ.7.4 కోట్లను ఇమ్రాన్ తన జేబులో వేసుకున్నారని విపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు.

 ఇతర దేశాల నుంచి వచ్చిన గిఫ్ట్‌లను ఇమ్రాన్ అక్రమంగా అమ్మారని పీఎంఎల్‌ఎన్ వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్ ఆరోపించారు. ఇమ్రాన్ తీరు సిగ్గుచేటని పాకిస్థాన్ డెమొక్రటిక్ మూమెంట్ (పీడీఎం) ప్రెసిడెంట్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ విమర్శించారు. కాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన బహుమతులను తోష్‌ఖానా రూల్స్ ప్రకారం వేలంలో విక్రయించాలి. 

అప్పటిదాకా వాటిని ఆ దేశ ఆస్తులుగా భావించి భద్రపరుస్తారు. వేలంలో ఎవరైతే గెలుచుకుంటారో వారికి ఆ బహుమతులను అప్పగిస్తారు. 

Telangananews

Oct 21 2021, 18:40

తెలంగాణలో పెరుగుతున్న సీజనల్ వ్యాధుల తీవ్రత

 

ఆసుపత్రులకు 'క్యూ' కడుతున్న పేషంట్ల... 

 

తెలంగాణలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పరిసరాలు అపరిశుభ్రంగా మారడతో వైరల్ ఫీవర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాలు విజృంభిస్తున్నాయి. 

దీంతో హైదరాబాద్‎లోని ప్రభుత్వ దవాఖానాలు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ప్రతి ఆస్పత్రికి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు హైదరాబాద్‎లోని సర్కారీ ఆస్పత్రులకు వస్తున్నారు. అంతేకాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పేషంట్లు రావడంతో సిటీలోని సర్కారీ హాస్పిటళ్లలో ఔట్ పేషెంట్ బ్లాకులన్నీ కిటకిటలాడుతున్నాయి.

 ఉదయం నుంచే రోగులు వందలాదిగా బారులుతీరుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్ ఆస్పత్రిలోని ఓపీ బ్లాకులు పేషెంట్లు, అటెండెంట్లతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడంలేదు.

 

ఒక్కో ఆస్పత్రికి రోజుకు 1000 నుంచి 2 వేలకుపైనే ఓపీ కేసులు వస్తున్నాయి. కరోనా కారణంగా గతేడాది సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గినా… ఈసారి మాత్రం 20 నుంచి 30 శాతం డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. సీజనల్ ఫీవర్లతో పాటు నాన్ స్పెసిఫిక్, డెంగ్యూ, రెస్పిరేటరీ కేసులు ఎక్కువగా ఓపీకి వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా జూన్, జులై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సీజనల్ వ్యాధులు ఉంటాయి. 

అయితే అన్ లాక్ తర్వాత ప్రజలు తగిన కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా ఉంటే ముందు కరోనా టెస్ట్ చేసి.. రిజల్ట్‎ను బట్టి ట్రీట్‎మెంట్ చేస్తున్నామని వైద్యులు అంటున్నారు.

సీజనల్ వ్యాధుల తీవ్రత పెరగడంతో సిటీలో పెద్దాసుపత్రులతో పాటు బస్తీ దవాఖాన్లలో కూడా రోగుల తాకిడి పెరిగింది. ఉస్మానియాలో 1800 నుంచి రెండు వేలు, గాంధీలో 1100, ఫీవర్ ఆస్పత్రిలో 800లు, నిమ్స్‎లో 1800లకుపైనే రోజువారీ ఓపీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగానికి పైగా కేసులు.. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా కేసులే ఉంటున్నాయి.

కాగా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వైరల్ ఫీవర్లు రాకుండా అడ్డుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలని అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి రెండు రోజులకంటే ఎక్కువగా తగ్గకుండా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. 

Telangananews

Oct 21 2021, 18:31

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ పై హైకోర్టులో పిటిషన్ 

 


తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్నాయి. 

 

 గతేడాదిలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. అప్పటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నారు. 

కరోనా కారణంగా పరీక్షలు రాయకుండానే వారు ప్రమోట్ అయ్యారు. 

అయితే.. 70 శాతం సిలబస్ తో వారికే ఈ సారి ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

 వారికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇవాళ(గురువారం) పిటిషన్ దాఖలైంది.

విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకూడదని కోరారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విద్యార్ధులు హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. 

Telangananews

Oct 21 2021, 18:21

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలకం నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్‌ 

 


కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో​ మొత్తం DA 31 శాతానికి చేరుకుంది. కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్‌ 2021 వరకు డీఏ పెంపుదల అంశం వాయిదా పడింది. 

 

ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలో పని చేస్తున్న ఉద్యోగులకు ,పెన్షనర్లకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

కొత్తగా పెరిగిన DA,DR 2021 జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల వరకు అదనపు భారం పడనుంది. 

Telangananews

Oct 21 2021, 18:01

రేపు గుడ్ న్యూస్ చెబుతా : మంచు విష్ణు 

 


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాష్ రాజ్..మంచు విష్ణు లు పోటీ పడగా అధిక మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందారు. 

 

అనంతరం తన ఫ్యాన్ సభ్యులతో కలిసి మంచు విష్ణు ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక ఎన్నికలకు ముందు మంచు విష్ణు మా సభ్యులకు ఎన్నో హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మా కోసం బిల్డింగ్ పింఛన్లు.. ఉచిత విద్య, అంటూ మంచు విష్ణు హామీలిచ్చారు.

అయితే తాజాగా మంచు విష్ణు రేపు ఓ గుడ్ న్యూస్ చెబుతాను అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాంతో విష్ణు ఎలాంటి పరకటన చేస్తారా అని మా సభ్యులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి పోటీచేసి గెలిచిన అభ్యర్థులు అంతా “మా” కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామాలను విష్ణు ఇంకా ఆమోదించలేదని చెప్పారు. పదవులు లేకపోయినా తాము మా సమస్యల కోసం మాట్లాడదామని ప్రకాష్ ప్యానల్ సభ్యులు చెబుతున్నారు. 

 

మరో వైపు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

Telangananews

Oct 21 2021, 17:55

అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్న కొత్త వ్యాధి.. ఉల్లిపాయలతోనే అది వ్యాపిస్తోందనే అనుమానాలు 

 

 

 


అమెరికాను సాల్మొనెల్లోసిస్ (salmonellosis) వ్యాధి వేధిస్తోంది. సాల్మొనెల్లా (Salmonella) అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా ఈ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

 అయితే ఈ బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు సంబంధం ఉందని బుధవారం తేల్చింది సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (CDC). అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా 652 మందికి వ్యాపించిందని సీడీసీ చెప్పింది. ఇది మరింత విస్తరిస్తే మరిన్ని అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సెప్టెంబరు మధ్యలోనే ఈ కేసులు వచ్చినా.. ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు.

చిహువా, మెక్సికో నుంచి ప్రోసోర్స్ (ProSource) అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలకు పంపిణీ చేసింది. ఆగస్టు 27వ తేదీన చివరిసారి ఇక్కడి నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నారు. వాటిని ఇళ్లలో, రెస్టారెంట్లలో వినియోగించారని సీడీసీ తెలిపింది. ఇవే ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి కారణాలని అధికారులు గుర్తించారు. అయితే ఇతర ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో సంబంధం ఉందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలు, సాల్మొనెల్లా ప్రభావితమైన వాటిని వాడవద్దని సీడీసీ వినియోగదారులను హెచ్చరించింది. ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా, మెక్సికో నుంచి వచ్చినవైనా, ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా, ప్రోసోర్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా.. వాటిని బయట పడేయాలని సీడీసీ సూచించింది.

ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వెల్లడించింది. ఇప్పటికే అన్నీ దుకాణదారులు ఉల్లిపాయలు తిరిగి వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని ఎఫ్డీఏ తెలిపింది.

 వ్యాధి లక్షణాలు 

సాల్మొనెల్లా బాధితుల్లో డయేరియా, వాంతులు, జ్వరం, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ బాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తింటే.. ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లో సాల్మొనెల్లోసిస్ వ్యాధి వ్యాపిస్తోందని సీడీసీ తెలిపింది. వీరిలో చాలా మందికి ఎలాంటి వైద్య చికిత్సలు అవసరం లేకుండానే నాలుగు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు దిగుమతైన అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 అమెరికాలో 37 రాష్ట్రాలకు వ్యాప్తి 

ఇప్పటికే అమెరికాలోని 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా వ్యాపించిందని సీడీసీ గుర్తించింది. టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, మేరీల్యాండ్‌లో 58, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ అభిప్రాయపడింది. చాలా మందికి సాల్మొనెల్లా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది. 

Telangananews

Oct 21 2021, 17:43

సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ 

 

 
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది.

కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో కలిసి సుప్రీంకోర్టులో అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ పిటిషన్‌పై గురువారం నాడు కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ తరఫు న్యాయవాదుల వాదనలను విని అజారుద్దీన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఊరట దక్కినట్లు అయ్యింది.