TSNews

May 20 2021, 14:08

మద్యం డబ్బుల కోసం కూతురిని అమ్మేసిన భర్త... 
 

దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య...


మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన ఓ తండ్రి కన్నకూతురినే అమ్మకానికి పెట్టాడు. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌పురకు చెందిన సయ్యద్‌ రహీం, నౌషిమ్‌ బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె జేబా (18 నెలలు) ఉన్నారు. ఈ నెల 18న రహీం తన కూతురిని బిస్కెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్‌ చేసినా స్పందించలేదు. సాయంత్రం సయ్యద్ రహీం ఒక్కడే తిరిగొచ్చాడు. తన కూతురు ఎక్కడ అని నౌషిమ్‌ బేగం నిలదీయగా రహీం పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తర్వాత గట్టిగా ప్రశ్నిస్తే హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హఫీజ్‌ అనే వ్యక్తికి రూ.15 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. దీంతో నౌషిమ్‌ తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి 24 గంటల్లోనే హైదరాబాద్‌లో ఉన్న పాపను గుర్తించి మహబూబ్‌నగర్‌‌కు తీసుకొచ్చారు. పాప తండ్రి సయ్యద్‌ రహీంతో పాటు పాపను కొనుగోలు చేసిన సయ్యద్‌ హఫీజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

TSNews

May 20 2021, 13:59

టాలీవుడ్‌లో మరో విషాదం.. 
 

 సీనియర్‌ దర్శకుడు యు.విశ్వేశ్వరరావు కన్నుమూత 


దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సాధారణ, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బలి తీసుకుంటోంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరోనాతో కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. విశ్వశాంతి పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన ఎన్నో చిత్రాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిర్మాతగానే కాక దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్‌‌తో ''కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్థారకులు, పెత్తందార్లు'' లాంటి సినిమాలను ఆయన రూపొందించారు. ఇక దర్శకుడిగా ''తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం'' లాంటి సినిమాలను తెరకెక్కించారు. నగ్నసత్యం, హరిశ్చందుడ్రు చిత్రాలకు ఆయనకు జాతీయ అవార్డులు రాగా.. కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలకు రెండు నంది అవార్డ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన వయస్సు 90 పైనే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతిని పెళ్లి చేసుకున్నారు. మోహనకృష్ణ, శాంతి తనయుడే నందమూరి తారకరత్న. విశ్వేశ్వరరావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

TSNews

May 20 2021, 13:08

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... 
 

 బ్లాక్‌ఫంగస్‌ను నోటిఫియాబుల్ వ్యాధిగా... 


తెలంగాణను బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిలో బ్లాక్ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. దీంతో పలువురు ఇప్పటికే వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఖమ్మం, నిజామాబాద్‌లో కూడా కేసులు నమోదు అయ్యాయి. దీంతో బ్లాక్ ఫంగస్‌పై ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనిపై అప్రమత్తమైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్‌ను నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. రాష్ట్రంలో దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తప్పకుండా ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశించింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం వివరించింది.

TSNews

May 20 2021, 12:46

అవసరం లేకున్నా బయటకి వస్తే తాటతీస్తాం... తెలంగాణ డీజీపీ వార్నింగ్... 
 

 
అనవసరంగా బయటకు వస్తే తాటతీస్తామంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, తెలంగాణలో లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు కానుంది.
ఉదయం 10 గంటలతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపు ముగియనున్నప్పటికీ పని లేకున్నా వాహనాలపై బయటకు వచ్చే వారి పని పట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇకపై 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కాలనీలు, అంతర్గత రోడ్లలోనూ నిఘాను పెంచాలని సూచించారు. 10 గంటలకే అన్ని గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని, ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా చైతన్య పరచాలని సూచించారు.

అలాగే, కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.

TSNews

May 20 2021, 12:34

తెలంగాణలో పదోతరగతి ఫలితాలు రేపే... 
 


  
పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 

ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. వాటిని మరోసారి పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే 22వ తేదీన విడుదల చేయనుంది. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది.

TSNews

May 20 2021, 09:43

కరోనా వాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
 దేశంలో వ్యాక్సినేషన్ ప్రకియపై కేంద్రం మరోసారి మార్గదర్శకాలను సవరించింది. కోవిడ్ సోకిన వ్యక్తులు ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలనేది తాజాగా బుధవారం వెలువరించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు వ్యాక్సిన్‌ కోసం కనీసం మూడు నెలలు ఆగాలని సూచించింది. అలాగే, తొలిడోస్ తీసుకున్నవారు వైరస్‌ బారినపడితే కోలుకున్నప్పటి నుంచి మూడు నెలల తర్వాత రెండో డోస్ వేసుకోవాలని తెలిపింది. గతంలో ఈ వ్యవధి నాలుగు నుంచి ఎనిమిది వారాలు ఉండగా... తాజాగా మూడు నెలలకు పెంచారు. అలాగే, వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని, అందులో నెగెటివ్‌ వచ్చిన తర్వాత రెండు వారాల తర్వాత రక్తం దానం చేయొచ్చని తెలిపింది. అంతేకాదు, బాలింతలు కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులకు వ్యాక్సినేషన్‌ అంశంపౌ అధ్యయనం జరుగుతోందని, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాక వెల్లడించింది. బాలింతలు, గర్బిణీలకు వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటి వరకూ వారిని వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేర్చలేదు. కానీ, ప్రస్తుతం బాలింతలకు టీకాను సిఫార్సు చేశారు. నేషనల్‌ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) ఇటీవల చేసిన ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ఇతర వ్యాధులకు ఐసీయూలో చికిత్స తీసుకుని కోలుకున్నవారు 4-8 వారాల తర్వాతే టీకా వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలూ అవసరం లేదని తేల్చి చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ డేటా వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాల్లో తీసుకొచ్చిన ఈ తాజా మార్పులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది.

TSNews

May 20 2021, 09:28

గత వారంలో భారత్‌లో 13% కరోనా కేసులు తగ్గాయి - WHO 
 


 గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా కేసుల నమోదులో మాత్రం భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
మే 16 వరకు నమోదైన కేసులను.. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం తాజా కేసుల్లో 13 శాతం, మరణాల్లో 5 శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్‌ ఉండగా.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌, అమెరికా, అర్జంటీనా, కొలంబియా ఉన్నట్లు తెలిపారు.

తాజా మరణాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో నేపాల్‌, ఇండోనేసియా ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.

TSNews

May 19 2021, 18:20

రెమ్‌డెసివర్ పేరిట మోసం..గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజెక్షన్
 


ఖమ్మం: కరోనాతో ప్రజలు ఓ వైపు ఛస్తుంటే ఇదే అదనుగా అడ్డగోలుగా దోచేస్తున్నారు కంత్రీగాళ్లు.

ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు.

రెమ్‌డెసివర్ ఇంజక్షన్ పేరిట ఓ డాక్టర్ మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం జిల్లాలో బాలాజీ ఛెస్ట్ ఆసుపత్రిలో నకిలీ ఇంజక్షన్ తో జనాలను మోసం చేసేస్తున్నారు.

ఓ పౌడర్ మెడిసిన్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్ ఇస్తున్నాడో ఓ డాక్టర్.

ఈ ఇంజక్షన్ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ మోసం వెలుగులోకి వచ్చింది.

డాక్టర్ నిర్వాకం బయటపడడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

దీంతో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ వాడకం ప్రాధాన్యత పెరిగిపోయింది.

ఈ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లోకి తరలించకుండా ఉండేందుకు అధికారులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

ఉక్కుపాదం మోపుతున్నా అక్కడకక్కడ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

ఖమ్మంలోని బాలాజీ ఛెస్ట్ ఆసుపత్రిలో వాడి పడేసిన ఇంజక్షన్ లో పౌడర్ ను కలిపి గ్లూకోజ్ వాటర్ కలిపి రోగులకు ఇస్తున్నాడు.

ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఆ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

TSNews

May 19 2021, 13:40

క‌రోనా రోగుల‌కు ధైర్యం.. డాక్ట‌ర్ల‌కు అభినంద‌న : సీఎం కేసీఆర్
 


న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు.

 క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.

కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు.

 ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హ‌రీష్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రోగుల స‌హాయ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు.

 గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ర‌సాయ‌నాల‌తో పిచికారీ చేశారు.

TSNews

May 19 2021, 11:54

అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కరోనాతో మరణిస్తే..? 
 

 
 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి అదనంగా నెలకు రూ.2500 పింఛను ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

భర్త చనిపోతే.. భార్యకు పెన్షన్, భార్య చనిపోతే భర్తకు పెన్షన్, పెళ్లి కాని వ్యక్తులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆ పెన్షన్ అందించనున్నట్లు కేజ్రీవాల్ ఓ ప్రకటనలో తలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించిన లేదా తల్లి లేదా తండ్రి మరణించినా సందర్భంలో పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 పెన్షన్ ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వారి చదువులకు అయ్యే ఖర్చును పూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.