Andrapradesh

May 16 2020, 18:18

ఏపీ సీఎం సంచలన నిర్ణయం.. వలస కూలీలకు ఉచిత బస్సులు

అమరావతి: ఏపీలో వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి పట్ల ఉదారంగా ఉండాలన్న ఆయన.. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సమీక్షా సమావేం నిర్వహించిన ఆయన... మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలను మానవీయ కోణంలో ఆదరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీలు కోసం బస్సులు సిద్ధం చేయాలన్నారు. దీని కోసం విధి, విధానాలు తయారు చేయండని అధికారులకు తెలిపారు. వలస కూలీలను టిక్కెట్టు కూడా అడగవద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నడిచివెళ్తూ ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి.. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

Andrapradesh

May 16 2020, 18:10

వలస కార్మికులపై హైకోర్టు కీలక తీర్పు

విజయవాడ: వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని, వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల సమస్యలపై హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. శనివారం తీర్పును వెలువరించింది. కాగా, హైకోర్టు తీర్పు పట్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు

Andrapradesh

May 16 2020, 18:07

ఏపీ సీఎం జగన్‌కి తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క రిక్వెస్ట్..!

లాక్‌డౌన్‌ వేళ అందరు ప్రజాప్రతినిధులకు విభిన్నంగా తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి నిత్యావసరాలతో పాటు డబ్బును సాయం చేస్తున్నారు.
లాక్‌డౌన్‌ వేళ అందరు ప్రజాప్రతినిధులకు విభిన్నంగా తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి నిత్యావసరాలతో పాటు డబ్బును సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వయసును, ఎండను కూడా లెక్కచేయకుండా కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్తూ ఆమె చేస్తున్న సాయానికి సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీతక్క ఏపీ తూర్పు గోదావరి జిల్లాలోని చింతలపాడు కుగ్రామానికి వెళ్లి.. అక్కడి వారికి సాయం చేశారు.
కొండా రెడ్డి, కోయ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలతో కొన్ని గంటల పాటు సమయాన్ని గడిపిన సీతక్క.. వారికి బియ్యం, చింతపండు, మిరపకాయలు, నూనె, పప్పు ధాన్యాలతో పాటు రూ.500 డబ్బును ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను చేసిన సీతక్క సీఎం వైఎస్‌ జగన్‌కి ఓ రిక్వెస్ట్ చేశారు. ”ఇక్కడి వారు చాలా రోజులుగా ఆహారం లేక బాధపడుతున్నారు. ఎన్నో అష్టకష్టాలు పడి ఇక్కడికి చేరుకున్న మేము.. మాకు తోచినంత సాయం చేశాం. చింతలపాడులో గ్రామ వలంటీర్లు లేరు. ఇక్కడి వారికి నెలవారీ రేషన్ కూడా అందడం లేదు. కొండారెడ్డి గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని పేర్కొన్నారు.

Andrapradesh

May 16 2020, 15:31

ఇదేనా ప్రజారంజక పాలన జగన్‌: పోతిన మహేష్

విజయవాడ : ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తెలిపారు. ఒక వైపు కరోనా.. మరో వైపు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. విద్యుత్ ఛార్జీలపై మంత్రులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇదేనా ప్రజారంజక పాలన అని సీఎం జగన్‌ను మహేష్ ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా ముందు వచ్చిన బిల్లులకు రెట్టింపు బిల్లులు వచ్చాయన్నారు. కరోనా నేపథ్యంలో పరిశ్రమలు మూత పడడంతో ఆ భారం సామాన్యులపై ప్రభుత్వం మోపుతోందన్నారు. జగన్ మోసపూరిత పాలనతో ప్రజలు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చి జగన్ ఏపీ ప్రజలకు నరకం చూపిస్తున్నారని మహేష్ పేర్కొన్నారు.

Andrapradesh

May 16 2020, 15:27

ప్రేమ పెళ్లి, ఏడాది బిడ్డ, భర్త జైల్లో.. బంధువుల తిరస్కరణ, చెట్టు కిందే జీవనం

ప్రేమ పెళ్లి.. ఏడాది వయసున్న బిడ్డ.. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో.. ఓ కేసులో భర్త జైలుకు వెళ్లాడు. కష్టాల్లో ఉన్నానంటూ వెళితే బంధువులు ఇంట్లోకి రానివ్వని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితుల్లో చెట్టు కిందే చిన్నారితో ఉంటోంది.. జీవితం అగమ్యగోచరంగా మారింది. ఇది నెల్లూరుకు చెందిన మహిళ కన్నీటి కష్టం. 


నెల్లూరుకు చెందిన తిరుపతమ్మ , ఆనంద్‌‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితం సాఫీగానే సాగిపోతుండగా.. ఈ జంటకు ఓ మగబిడ్డ జన్మించాడు. ఇంతలో ఆనంద్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. ఇక తిరుపతమ్మకు కష్టాలు మొదలయ్యాయి. ఏడాది వయసున్న కుమారుడిని తీసుకొని ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. పాపం అక్కడ బంధువులు ఇంట్లోకి రానివ్వ లేదు.. అయినవాళ్లు కూడా తిరస్కరించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. నెల్లూరులోని చాణక్యపురి దర్గా దగ్గర చెట్టు కిందే ఉంటోంది. తన బిడ్డను చూసుకుంటూనే చుట్టుపక్కల ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటోంది. 

ఇంతలో లాక్‌డౌన్‌ రావడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లలో పని దొరక్కపోవడం.. తినేందుకు తిండి లేక ఖాళీ కడుపుతో చెట్టు కిందే ఉండిపోయింది. స్థానికులు కొంతమంది తోచినంత సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతోనే బిడ్డకు పాలు కొని తెచ్చి ఇస్తోంది. ఆమె పరిస్థితిని చూసిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిత్యావసరాలు అందజేశారు. తన బిడ్డను కుక్కలు ఎత్తుకుపోతాయనే భయంతో రాత్రిళ్లు నిద్రల లేకుండా గడుపుతోంది. ఎవరైనా తనను ఆదుకొని ఆశ్రయం కల్పిస్తే కుమారుడిని బాగా చూసుకుంటానంటోంది.

Andrapradesh

May 16 2020, 15:25

మద్యపానం, ధూమపానం లాగే థియేటల్లో కరోనా యాడ్స్?

కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతలోపు స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యమని, చాలా దేశాలు లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తున్నాయి.

ఇక ఈ కరోనా ప్రభావం ప్రతి ఒక్క రంగపైన పడింది. అందులో సినీ పరిశ్రమ ఒకటి.. షూటింగ్ లు వాయిదా పడ్డాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఆగిపోయాయి. మొత్తానికి కొన్ని కోట్ల నష్టం అయితే సినిమా ఇండస్ట్రీ పైన పడింది. ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ధియేటర్ల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..

అత్యధికంగా జనసమూహం ఉండే ప్రదేశం కావడం, కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో ఇప్పట్లో ధియేటర్లను ఓపెన్ చేసే ఆలోచన అయితే కనిపించడం లేదు.. ఒకవేళ తెరిచినప్పటికి ఎప్పటిలాగే జనాలు వస్తారా? చూస్తారా? నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తారా అన్నది ఓ సందేహంగా మిగిలింది.

అంతేకాకుండా సినిమాలో కూడా చాలా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి ముందు ధియేటర్లలలో మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పుడు అదే తరహాలో కరోనా పై జాగ్రత్తలు చెబుతూ యాడ్స్ ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

"ఈ ప్రపంచానికి ఏమైంది ఓ వైపు కరోనా మరో వైపు ఆకలి చావులు.. మాస్క్ లేకుండా బయటకి వస్తే చెల్లించాలి భారీ మూల్యం - చేతులు శుభ్రంగా కడుక్కోండి.. అనవసరంగా ఏ వస్తువుల్ని తాకకండి.. మాస్క్ ధరించే బయటకు వెళ్లండి'' అంటూ హెచ్చరించేలా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

Andrapradesh

May 16 2020, 15:24

ఇవాళ లాక్‌డౌన్ 4 మార్గదర్శకాలు విడుదల

 కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఏకంగా 6 గంటల పాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అందరూ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటారు.

దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ 4 నిబంధనలను ఖరారు చేశారు. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం తర్వాత హోంశాఖ కార్యదర్శి లాక్‌డౌన్‌ 4 నిబంధనలను ప్రకటించనున్నారు. ఈ సారి వచ్చే లాక్‌డౌన్‌ 4 నిబంధనలు ఎవరూ ఊహించని విధంగా విభిన్నంగా ఉంటాయని గతంలో ప్రధాని చెప్పుకొచ్చారు. దీంతో లాక్‌డౌన్‌ 4 ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Andrapradesh

May 16 2020, 15:23

లాక్‌డౌన్‌ 4.0 సడలింపులు.. నిర్ణయాధికారం రాష్ట్రాలకే
కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో నెలకుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు. దీనికి సంబంధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.

ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాలకు మరిన్ని సడలింపులను ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. జోన్లు, హాట్‌స్పాట్ల నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేయనుంది.

అయతే ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢీల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రిని కోరాయి. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని తమిళనాడు కోరింది. 18వ తేదీ నుంచి 50% సిబ్బంది కార్యాలయాలకు రావాలని ఆ రాష్టంలో ఉత్తర్వులు జారీ చేసింది.

 కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో కటింగ్ షాపులు, కళ్లజోళ్ల షాపులు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తి ఎత్తివేతను ఏ రాష్ట్రమూ కోరుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

 నిత్యావసరేతర వస్తువులను విక్రయించడానికి సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

 పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు.

 హోం డెలివరీ కి అవకాశం ఉంటుంది.

 మెట్రో రైళ్లు, స్థానిక రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది.

 పట్టణ ప్రాంతాల్లో అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలన్నది గుజరాత్‌ డిమాండ్‌.

 • Andrapradesh
   @Andrapradesh కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేసి వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు.
  
   మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్‌, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి.
  
  * బిహార్‌, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్‌ చేశారు. 
Andrapradesh

May 16 2020, 15:09

'పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు'

 కాకినాడ : చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్బాగ్యమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తే అయితే కష్ణానది కరకట్టపై ఇన్నాళ్లు ఎందుకు నివాసం ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కాకినాడలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందన్నారు. ఇండ్ల స్ధలాల కోసం సేకరించిన పోర్టు భూములను అడవులని సాకుగా చూపించి టీడీపీ నేతలు న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. కానీ ఆ భూముల్లో మడ అడవులు లేవని అటవీ శాఖ పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఇక్కడ మత్స్య సంపద పుట్టదని మత్స్య శాఖ కూడా స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. టీడీపీ బృందం శుక్రవారం పోర్టు భూముల్లో పర్యటించుంటే భూ లబ్ధిదారులు తగిన విధంగా వారికి సమాధానం చెప్పేవారని పేర్కొన్నారు. చినరాజప్ప మంత్రిగా ఉన్నప్పుడు పెద్దాపురంలో కొండల్ని తవ్వేశారు.. అప్పుడు పర్యావణం గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. ఇండ్ల స్దలాల లబ్ధిదారులతో మాట్లాడి వారిని తాను ఒప్పిస్తానని టీడీపీ బృందంలో ఎవరు వస్తారో చెబితే వారిని తానే దగ్గరుండి పోర్టు భూములను చూపిస్తానంటూ ద్వారంపూడి తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత టీడీపీ తీరుపై లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.

Andrapradesh

May 16 2020, 15:07

ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.

కాకుమాను మండలంలోని అక్కుల చెరువును పరిశీలించిన హోంమంత్రి.

చెరువు ఆధునీకరణ గురించి ఆరా తీసిన హోంమంత్రి సుచరిత.

ఏళ్ళు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నించిన మంత్రి.

నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోమ్ మినిస్టర్.

అక్కుల చెరువు అభివృద్ధి నిధులు భారీగా నిరుపయోగంగా అయ్యాయన్న హోంమంత్రి.

ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతోందని అసహనం వ్యక్తం చేసిన సుచరిత.

అక్కుల చెరువును నింపడానికి కావాల్సిన గ్రావిటీ పైప్ లైన్ పనులు, గ్రామాలకు నీరు పంపించే పనులు ఏ మాత్రం జరగలేదన్న మంత్రి.

దాదాపు 12 గ్రామాలకు త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసాము.

కానీ ఏ ఒక్క గ్రామానికి కూడా నీరు అందిన దాఖలాలు లేవని తెలిపిన హోంమంత్రి.

ప్రాజెక్టు అవకతవకలపై విజులెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి.

త్వరలోనే ప్రాజెక్టు పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన హోంమంత్రి సుచరిత.