సెకీ ఒప్పందంపై జగన్ రియాక్షన్
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సెకీ లేఖపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు సెకీ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అంత మంచి ఆఫర్‌ను ఎలా తిరస్కరిస్తారని చెప్పిన వైఎస్ జగన్.. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.
నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కూటమి సర్కారు పాలనలో ప్రతి వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించిన వైఎస్ జగన్.. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడితే సంపద సృష్టి అంటారన్న వైఎస్ జగన్.. రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకొచ్చేలా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను సంపద సృష్టి అంటారని చెప్పారు. వైసీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందన్న జగన్.. ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అడుగులు పడ్డాయని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ప్రతి అడుగూ వేశామన్న వైఎస్ జగన్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివక్ష లేకుండా అమలు చేశామన్నారు
రైతులకు ఉచిత కరెంట్ అందించడమేది ఒక కల అని చెప్పిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనలో డిస్కంలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు రాకముందు డిస్కంలకు రూ.29 వేలకోట్లు బకాయిలు ఉంటే.. చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ బకాయిలు, అప్పులు రూ.86 వేలకోట్లకు చేరినట్లు ఆరోపించారు. డిస్కంల మీద, ప్రభుత్వం మీద భారం పడకుండా, రైతులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సోలార్ పార్కుల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచిందని వైఎస్ జగన్ చెప్పారు. 2020 నవంబర్‌లో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచామని.. ఆ టెండర్లలో రూ. 2.49 పైసలు నుంచి రూ.2.58 పైసలకు చొప్పున సరఫరా చేసేందుకు సుమారు 24 బిడ్ల వరకూ దాఖలయ్యాయని వివరించారు. అయితే చంద్రబాబు దానికి అడ్డుపడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే 2021 సెప్టెంబర్ 15న తీపి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సెకీ నుంచి లేఖ వచ్చిందన్న వైఎస్ జగన్.. యూనిట్ రూ.2.49 పైసలు చొప్పున 9 వేల మెగావాట్ల పవర్ అందిస్తామని సెకీ లేఖ రాసిందన్నారు. 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని చెప్పారన్న వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తక్కువ ధరకు వచ్చిన ఆఫర్ ఇది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్సిమిషన్ ఛార్జీలు కూడా లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా అవుతాయన్న వైఎస్ జగన్.. పాతికేళ్లలో లక్ష కోట్ల వరకూ ఆదా అయ్యేవని చెప్పారు.
ఈ లేఖలో మూడో పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేసుకున్న పీపీఏల వలన 2 వేలకోట్లు అదనపు భారం పడితే.. తమ ప్రభుత్వ నిర్ణయం వలన ఆదా అయ్యిందని చెప్పారు. యూనిట్ విద్యుత్‌కు రూ.5.90 పైసలకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా.. యూనిట్ రూ.2.49 చొప్పున ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం గురించి కూడా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్న వైఎస్ జగన్.. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వైఎస్ జగన్.. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.
Nov 28 2024, 19:03