రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో అనూహ్య మలుపు
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.
ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.
రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది.
అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురి చేసింది. రెండు రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తిమంతమైన క్షిపణి ఇది. ఈ మిస్సైల్‌ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు.
దీనితో రష్యా అనూహ్య దాడికి దిగింది. ఏకంగా ఉక్రెయిన్‌పై హైపర్‌సొనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను సంధించింది. దిన్‌ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించిందీ మిస్సైల్. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది తెలియరావట్లేదు.
తమదేశంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించిందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. జనావాసాలు, అమాయక ప్రజలపై మారణహోమానికి దిగిందంటూ మండిపడ్డారు. ఇలాంటి దాడులను అంతర్జాతీయ సమాజం ఏ మాత్రం ఉపేక్షించకూడదంటూ ఆయన విమర్శించారు.
ఈ ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. తాము ప్రయోగించింది ఐసీబీఎం కాదని తేల్చి చెప్పారు. హైపర్‌సొనిక్ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించిన ఆయన టెలివిజన్‌లో ప్రసంగించారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల సహకారంతో తమపై దాడికి దిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పుతిన్ అన్నారు. మున్ముందు మరిన్ని క్షిపణులను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల సహకారాన్ని తీసుకోవడం వల్ల తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు.
Nov 22 2024, 16:39