నవంబర్ నుంచివిద్యుత్తు చార్జీలు పెంచేందుకు కసరత్తు.
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి.
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్‌టీ క్యాటగిరీలో ప్రతి కిలోవాట్‌కు రూ. 10 ఫిక్స్‌డ్ చార్జీలుగా వసూలు చేస్తుండగా, ఇప్పుది కిలోవాట్‌కు 30 రూపాయలు పెరగనుంది. ఇలాంటి వినియోగదారులు 26 లక్షల మంది ఉన్నారు. ఈ పెంపుతో రూ. 400 కోట్లను డిస్కంలు రాబట్టుకోనున్నాయి. హెచ్‌టీలో 11కేవీ, 33కేవీ, 132 కేవీ కెపాసిటీ కనెక్షన్లకు వేర్వేరు చార్జీలుండేవి. 33 కేవీకి యూనిట్‌కు రూ. 7.15, 11 కేవీకి యూనిట్‌కు రూ. 7.65, 132 కేవీ ఆపైన యూనిట్‌కు రూ. 6.62 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని క్యాటగిరీల వారికి యూనిట్‌కు రూ. 7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. దీంతో ఆయా వినియోగదారులపై రూ. 800 కోట్ల భారం పడనుంది. ఈఆర్సీ చైర్మన్, సభ్యుల కాలపరిమితి ఈ నెల 29తో ముగియనుంది. ఈనేపథ్యంలో డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతినివ్వడం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే నవంబర్ ఒకటి నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయి.
విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలు చేపట్టింది. సోమవారం జెన్‌కో ఫిక్స్‌డ్ ఛార్జీలు, ట్రూప్ అప్ చార్జీలపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ. 963.18 కోట్లకు అనుమతించాలని జెన్‌కో కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలు, 2024-25 నుంచి 2028-29 కాలానికి (ఐదో నియంత్రణ కాలానికి) మల్టీ ఇయర్ టారిఫ్‌పై విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం బహిరంగ విచారణ జరిపింది. టీజీజెన్‌కో సమర్పించిన పిటిషన్‌పై తొలుత జెన్‌కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా, ఆ తర్వాత పలు ఎఫ్‌టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్, స్టీల్ రంగ నిపుణులు తమతమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ట్రాన్స్‌కో దాఖలు చేసిన రూ. 16, 346 కోట్ల ఏఆర్‌ఆర్ పిటిషన్‌పై ఈఆర్సీ మంగళవారం విచారణ జరపనుంది. 23న టీజీఎస్పీడీసీఎల్ పిటిషన్‌పై హైదరాబాద్‌లో, 24న టీజీఎన్పీడీసీఎల్ పిటిషన్‌పై నిజామాబాద్‌లో, 25న సెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సిరిసిల్లలో ఈఆర్సీ బహిరంగ విచారణలు జరపనుంది.
కొత్త విద్యుత్తు ప్లాంట్లు 65 శాతమే పనిచేస్తే ఎలా అని ఎనర్జీ కన్సల్టెంట్ రణదీప్ ప్రశ్నించారు. ఇవి 85 శాతం పనిచేయాల్సి ఉండగా, కొన్ని 65 శాతమే పనిచేస్తున్నాయని, దీంతో నష్టాలొస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణ విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు బయట అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. పరిశ్రమలే డిస్కంలకు వెన్నెముకలాంటివని, కానీ డిస్కంల చర్యలు పరిశ్రమలను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని విమర్శించారు. పిటిషన్ల దాఖలు తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తక్కువ సమయం ఇస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. అధ్యయనం చేసి, అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సమయం తమకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ట్రూ అప్ చార్జీల పెంపునకు విద్యుత్తు సంస్థలు పేర్కొన్న కారణాలు సహేతుకం కాదని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ ప్రతినిధి వేణుగోపాలరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యుత్తు ప్లాంట్ల పీఎల్‌ఎఫ్ సామర్థ్యం పెరిగితే ఇన్సెంటివ్‌లు ఇస్తున్నట్టేనని, పీఎల్‌ఎఫ్ పడిపోతే జరిమానాలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్తు ప్లాంట్లల్లో సామర్థ్యానికంటే తక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఓపెన్ మార్కెట్‌లో విద్యుత్తును కొనడంతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాము 25 ఏండ్లుగా సూచనలిస్తున్నా, వాటిని పరిగణిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Oct 22 2024, 16:06