తాట తీయాల్సిందే, అదే లాస్ట్ డే - చంద్రబాబు ఆదేశం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు కీలక దిశా నిర్దేశం చేసారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. లైంగిక వేధింపుల కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల రిక్రూట్ మెంట్ ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు కావాల్సిన ఆధునిక వ్యవస్థను అందిస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరి రక్షణే బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ఒక బ్రాండ్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి కేసును సవాల్‌గా తీసుకుంటాం.. ఛేదిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డలు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. నేరస్థులకు చట్టపరమైన శిక్షపడేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
హిందూపూర్ గ్యాంగ్ రేప్, కడపలో యువతి హత్య కేసులో నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుదామని చెప్పారు. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ నమోదు కావాలని చంద్రబాబు సూచించారు.
శాంతి, భద్రతలు మొదటి ప్రాధాన్యతగా పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. నేరస్థులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే పోలీసులు పాత టెక్నాలజీ వాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇకపై టెక్నాలజీ పరిజ్ఞానం అందిస్తామని... ఆధునిక పరికరాలు సమకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Oct 21 2024, 13:04