హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ఆ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
శనివారం లక్డీకాపూల్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ పర్యటించారు. ఓ డ్రైన్ పూర్తిగా పూడుకుపోయి ఉండగా.. మరో డ్రైన్‌లో చెత్తాచెదారం పేరుకుపోయింది. చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితి ఉందనే అంచనాకు వచ్చారు. నగర వ్యాప్తంగా వరద నీటి ప్రవాహ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు
గ్రేటర్‌లో 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉండగా.. మేజర్ నాలాలు 370 కి.మీ, మైనర్ డ్రైన్‌లు 912 కి.మీలకు పైగా ఉన్నాయి. వీటిల్లో వ్యర్థాలనుత తొలగించేందుకు ఏటా రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డ్రైన్‌ల దుస్థితి నేపథ్యంలో పూడికతీత జరుగుతోందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైన్‌లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్ డ్రైన్‌లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు..? ఎంత మేర వ్యర్థాలు తొలగించారు..? అన్నదీ పరిశీలించే అవకాశముంది. కాగా, గతంలో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయంలో పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారకపోవడం గమనార్హం.
Oct 21 2024, 09:49