తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. 4 రోజుల పాటు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోనూ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందన్నారు. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించారు. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 వరకు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
నేడు నిఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు కూడా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు సైతం అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వర్షంతో పాటుగా గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు చెప్పారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, మన్యం, విశాఖపట్నం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
Oct 21 2024, 08:31