సాములోరికి స్టార్ హోటల్
స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు.
స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు. అయితే, స్వాములందు ఈ స్వామి వేరయా అన్నట్లు శారదాపీఠం సాములోరు అవతరించారు. తొలుత వేద విద్య కోసం అంటూ గత ప్రభుత్వాన్ని భూమిని కోరారు. ఆ తర్వాత ఆ భూమిని మార్పించుకొని నచ్చిన భూమిని తీసుకున్నారు. అయితే, ఆయన అక్కడితో ఆగలేదు... ఆధ్యాత్మికం పేరిట భారీగా సొమ్ములు సంపాదించుకునేందుకు, బోర్డింగ్ హౌస్‌ల పేరిట సముద్రతీరం కనిపించేలా భారీ స్టార్ హోటల్ నిర్మించుకునేందుకు ఆయన సకల అనుమతులు పొందారు. తీసుకునే అనుమతి రికార్డుల్లో ఒకటి ఉంటుంది. ఆచరణలో దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్తారు. ఇది ఆయన ఆచరణే. ఇలా సాములోరికి అడ్డగోలు మేలుచేయడానికి వీల్లేదని, ప్రజల ఆస్తులను సాములోరికి సమర్పించకూడదన్న కనీస స్పృహ నాటి రెవెన్యూ అధికారులకు లేకుండా పోయింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌కు సాములోరు గురువు సమానులు కాబట్టి వారికి సందేహాలు వచ్చే చాన్స్ కూడా లేదు. అందుకే సాములోరు కోరినవన్నీ ఆనాడు అధికారులు చకచకా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ మరో నెల రోజుల్లో రావచ్చన్న సంకేతాలుండటంతో రెవెన్యూశాఖ పోటీపడి సాములోరి సేవలో ఆనాడు తరించిపోయింది. ఇందుకు ప్రత్యక్ష నిద ర్శనం ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ ఇచ్చిన జీఓ 47.
శారదాపీఠం శ్రీ శంకరచార్యుల బోధనలకు అనుగుణంగా సనాతన ధర్మ సూత్రాలు ప్రచారం చేస్తుందని, సంస్కృత పాఠశాలను ఏర్పాటుచేసి, ప్రజల్లో వేద విద్య, వేద సంస్కృతిని పెంపొందిస్తామని కారణాలు చెప్పి పీఠం ప్రభుత్వం నుంచి 2021లో 225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని విశాఖ జిల్లా భీమిలీ మండలం కొత్తవలసలో పొందింది. ఇక భూ కేటాయింపులో రెవెన్యూశాఖ ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. వాటిని ఇదివరకే ‘ఆం రఽధజ్యోతి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడు, కొత్త విషయం ఏమంటే, తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతోపాటు ఆదాయార్జన పనులు కూడా చేపడుతామని, కాబట్టి, అందుకు అనుమతి ఇవ్వాలని పీఠం 2023, నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారి విశాఖ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, పీఠం రాసిన లే ఖపై తన రిమార్క్‌లు ప్రస్తావిస్తూ ఈ ఏడాది జనవరి 19న రెవెన్యూశాఖకు నివేదిక పంపారు. అంతే, 24 గంటల వ్యవధిలో శారదాపీఠం పంపించిన లేఖను ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణా వ్యవస్థ (ఏపీ ల్యాండ్‌మేనేజ్‌మెంట్ అథారిటీ-ఏపీఎమ్‌ఏ)లో ఆమోదించి, రెవెన్యూశాఖకు పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ సాములోరి విన్నపాలను ఆచరణలోకి తీసుకొస్తూ జీవో జారీచేసింది.
బోర్డింగ్ హౌస్ పేరిట సాములోరు కొత్తవలసలో తనకిచ్చిన భూమిలో స్టార్ హోటల్ నిర్మించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు గుర్తించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని ఓ సీనియర్ అధికారి సందర్శించారు. అక్కడ బోర్డింగ్ హౌస్ పేరిట భారీ స్టార్‌హోటల్ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు గుర్తించారు. నేరుగా హోటల్ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఎనిమిది అంతస్తుల బోర్డింగ్ హౌస్ నిర్మాణానికి రెడీ అవుతున్నట్లుగా గుర్తించారు. బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి కూడా అనుమతి పొందారు. దీనికి బోర్డింగ్ హౌస్ అని పేరుపెట్టారు. ఈ విషయం తెలిసి ఓ రెవెన్యూ అధికారి పీఠం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మీరు స్టార్‌హోటల్ కట్టకూడదు. అది తప్పు అని వారించినట్లు తెలిసింది. ‘‘ఆదాయార్జనకు భూమిని వినియోగించుకోవచ్చని (జగన్) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాంటప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని అయినా మేం అనుసరించవచ్చు కదా. ఇందులో ఉల్లంఘన ఏముంది?. మీరే అనుమతి ఇచ్చి, మీరే వద్దంటారా? ఇదెక్కడి న్యాయం?’’ అని పీఠానికి చెందిన ఓ వ్యక్తి... ఆ అధికారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అప్పటి కప్పుడు పీఠానికి ఇచ్చిన అనుమతుల ఉత్తర్వుల ఫైలు, వాటి కి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తెప్పించి పరిశీలన చేశారు. ఇందులోనూ పెద్దగోల్‌మాలే నడిచినట్లు తెలిసింది.
ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలని తొలుత శారదాపీఠం ప్రతినిధులు నాటి సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ను కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన తిరస్కరించారు. అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఎల్‌ఎమ్‌ఏలోనూ దీన్ని అజెండాగా చేర్చాల్సిన అవసరం లేదని తేల్చారని తెలిసింది. ఇదంతా ఈ ఏడాది జనవరి తొలివారంలో జరిగింది. అయితే, సాయిప్రసాద్ జనవరి రెండోవారంలో సెలవుపెట్టారు. దాన్ని అదేనెల 25 వరకు పొడిగించుకున్నారు. అప్పుడు ఓ జూనియర్ అధికారికి ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ పదవిని కట్టబెట్టారు. సరిగ్గా ఇదే సమయం అనుకున్న పెద్దలు ఆ ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ ద్వారా మంత్రాంగం నడిపించారు. జనవరి 19న కలెక్టర్‌తో లేఖ తెప్పించుకొని, 20వ తేదీన ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలన్న పీఠం డిమాండ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి ఫైలు పంపించారు. ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత సాయిప్రసాద్ సెలవు ముగించుకొని వచ్చి ఉద్యోగంలో చేరారని తెలిసింది. ఇదంతా ఇప్పుడు బయటపడటంతో రెవెన్యూ అధికారులు విస్తుపోతున్నారు. ఇది ఫక్తు ప్రైవేటు వ్యాపారమేనని ముక్కున వేలేసుకుంటున్నారు!
Oct 21 2024, 08:27