డిసెంబర్ లోగా రుణ మాఫీ పూర్తి.. గిదైనా ఫైనలా సారూ..!
తెలంగాణలో గతంలో రైతు బంధు ఉండేది. ఈ పథకంలో భాగంగా ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందించేవారు. అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా సంబంధం లేకుండా
డబ్బులు ఇచ్చే వారు. ఇలా కోటిశ్వరులకు కూడా రైతు బంధు ఇచ్చారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే అందరికి కాకుండా అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది.
అయితే వాన కాలం సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు.
రాష్ట్ర మంత్రివర్గ సబ్కమిటీ రిపోర్ట్ఇచ్చాకే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. అయితే కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారో చెప్పలేదు. సీజన్ కు ఎకరాకు రూ.7500 ఇస్తామన్నారు. మరోవైపు రైతు రుణ మాఫీ కాకుండా చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణ మాఫీ అవుతుందో కాదో అని ఆందోళనలో ఉన్నారు.
దీనిపై కూడా తుమ్మల మాట్లాడారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి వారికి డిసెంబర్ లోగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అయితే ఇదే మంత్రి దీపావళిలోకా రుణ మాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా డిసెంబర్ లోగా చేస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఏది ఏమైనా రుణ మాఫీ చేసి తీరుతామని మాత్రం చెబుతున్నారు.
42 బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 25 లక్షల కుటుంబాల్లోని 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి అవసరమైన నిధులు రూ.31 వేల కోట్లని మంత్రి చెప్పారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని తెలిపారు. ఇంకా 20 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని.. తెల్ల రేషన్‌కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబరులో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామన్నారు. అయితే రేషన్ కార్డు ఉన్నా రుణ మాఫీ కాలేదని లక్షలాది మంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Oct 20 2024, 20:06