అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఆరు
అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు.
అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు. అంతస్తుకు ఇంత అంటూ అక్రమ వసూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు నిబంధనల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వస్తోన్న ఫిర్యాదుల్లో 50 శాతానికిపైగా పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
మూసాపేట్ సర్కిల్ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, వసంతనగర్(KPHB, Balajinagar, Vasanthanagar), గోపాల్‌నగర్, కైత్లాపూర్, కేపీహెచ్‌బీ 15వ ఫేజ్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్టిల్ట్ ప్లస్ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఐదు నుంచి ఏడంతస్తులు నిర్మిస్తోన్నా.. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కనీసం నోటీసులు ఇచ్చే సాహసం చేయడం లేదు. స్థానిక కాలనీ, యువజన, ఇతర సంఘాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఉన్నత స్థాయి ఆదేశాలతో అప్పుడప్పుడు నిర్మాణాల వద్దకు వస్తోన్న అధికారులు కొన్ని రోజులు ఆపి తిరిగి పనులు ప్రారంభించాలని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్నారు. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్-5లోని ఎల్‌ఐజీ 111 గజాల్లో స్టిల్ట్ ప్లస్ రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని.. పార్కింగ్ స్థలం కూడా వదలకుండా ఓ వ్యక్తి ఏకంగా ఆరంతస్తుల భవనం నిర్మించాడు. స్థానికులు పలుమార్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.
వెంగళరావునగర్ ఎల్‌ఐజీహెచ్‌లోని ప్లాట్ నెంబర్ 48బీలో ఓ వ్యక్తి స్టిల్ట్ ప్లస్ మూడంతస్తులకు నివాస కేటగిరీలో అనుమతి తీసుకున్నాడు. అదనంగా ఓ అంతస్తు నిర్మించడంతోపాటు.. ఐదో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు. నివాసం కోసం పర్మిషన్ తీసుకొని భవనాన్ని హాస్టల్ నిర్వహణకు అనువుగా నిర్మిస్తున్నారు. దీంతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో స్లాబ్‌కు స్వల్పంగా రంధ్రాలు చేసి వదిలారు. అనంతరం వాటిని ఫిల్ చేసిన నిర్మాణదారుడు గోడలకు ప్లాస్టింగ్, రంగులు, ఇతరత్రా పనులు ప్రారంభించారు.
ఈ విషయంపై స్థానికులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో పాక్షికంగా కాదు.. అక్రమంగా చేపట్టిన నిర్మాణం పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని గత నెల 16వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులైనా.. జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు భవనం వద్దకు వెళ్లలేదు. ఓ డీఎస్పీ ఒత్తిడితోనే బల్దియా వర్గాలు భవనం జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. కొందరు అధికారులకు భారీగా ముట్టచెప్పారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి భవన నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
Oct 18 2024, 11:57