మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీలను ఈ సమావేశంలో ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల అంశంతో పాటుగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలు పైన మంత్రివర్గం చర్చించనుంది.
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా ప్రతీ ఇంటికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధి విధానాలను ఈ రోజు సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీపావళి నాడు ఈ పథకం అమలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక..వాలంటీర్ల అంశం పైన ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ.. వేతనాల చెల్లింపు .. ఎంత సంఖ్య మేర వాలంటీర్ల సేవలు కొనసాగించాలనే అంశాల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టబడులు..ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలను నేటి మంత్రివర్గంలో ఆమోదం తెలపనుంది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ అంశం పైన చర్చించనున్నారు. బాధితుల పైన భారం లేకుండా వారికి రుణాల రీ షెడ్యూల్ వేళ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది.
ఆలయ పాలకవర్గాల్లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం బాధ్యతల స్వీకరణ తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓట్ ఆన్ ఎకౌంట్ ద్వారా నెట్టుకొస్తున్నారు. దీంతో, బడ్జెట్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో మరో ఎన్నికల హామీ అమ్మకు వందనం పైన అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని తొలుత భావించినా... అంతకు ముందే అమలు పైన నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.
Oct 16 2024, 12:04