అమ్రపాలీకి ఏపీలో కీలక బాధ్యతలు
ఐఏఎస్ ల వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డీఓపీటీ ఆదేశాల పై క్యాట్ కు వెళ్లినా అధికారులకు రిలీఫ్ దక్కలేదు. దీంతో, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో నేటితో డీఓపీటీ డెడ్ లైన్ ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పరిణామాలు తెర మీదకు వచ్చాయి.
ఏపీకి కేటాయించిన అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా వేసింది. క్యాట్ ఆదేశాల పైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, డీఓపీటీ ఏపీలో రిపోర్టు చేయాలంటూ ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగుస్తోంది. దీంతో..ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయటానికి అమ్రపాలీ సహా ఇతర అధికారులు సిద్దమయ్యారు. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను రిలీవ్ చేయటం పైన తెలంగాణ సీఎస్ తో సీఎంఓతో చర్చించారు. రిలీవ్ చేయకుండా ప్రత్యామ్నాయాల పైన అన్వేషణ ప్రారంభించారు. అయితే, క్యాట్ ఆదేశాలతో అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
క్యాట్ ఆదేశాలతో ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయనున్నారు. దీంతో, అమ్రపాలి స్థానంలో జీమెచ్ఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అమ్రపాలీ తన వ్యక్తిగత వివరాల్లో విశాఖపట్టణం శాశ్వత చిరునామాగా పేర్కొన్న నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా గుర్తించారు. జూన్ 26వ తేదీన ఆమె బల్దియా కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆగస్టు 20న ఆమెను రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అమ్రపాలీకి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలోనూ పని చేసి ఉండటం ఇప్పుడు అమ్రపాలీకి కలిసొచ్చే అంశం.
ఇక్కడే కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. డీఓపీటీ ఉత్తర్వులతో ఏపీలో ఆమ్రపాలి రిపోర్ట్ చేసినా.. తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనకు వస్తే ఈ అధికారులను యధాతధంగా కొనసాగించే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం.. అక్కడి సర్కారు అంగీకరిస్తే తిరిగి తెలంగాణలో విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీఓపీటీ అదేశాల మేరకు అధికారులు రిపోర్ట్ చేస్తూనే.. అటు న్యాయ పరంగా.. ఇటు ప్రభుత్వాల పరంగా తమ ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Oct 16 2024, 11:53