ఐఏఎస్ అధికారులపై క్యాట్ సంచలన కామెంట్స్..
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్(CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది.
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్(CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది. ఐఏఎస్ అధికారుల పిటిషణ్‌పై క్యాట్‌లో సీరియస్‌గా వాదనలు జరిగాయి. డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అధికారుల తరఫున న్యాయవాదులు గట్టిగా వాదించారు. అయితే, ఐఏఎస్ అధికారుల తీరుపై క్యాట్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా? అంటూ ఐఏఎస్ అధికారులను క్యాట్ సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకీ పూర్తి అధికారాలున్నాయంటూ స్పష్టం చేసింది ధర్మాసనం. స్థానికత ఉన్నప్పటికీ.. స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా? అని క్యాట్ ప్రశ్నించింది. అయితే, వన్ మెన్ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదంటూ ఐఏఎస్ తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో వన్ మెన్ కమిటీ ఏర్పాటుపై వివరాలు అడిగింది క్యాట్. అదే సమయంలో 1986 బ్యాచ్ అధికారులతో స్వాపింగ్ ఎలా చేసుకుంటారంటూ ప్రశ్నించింది. ఇలా.. క్యాట్‌లో వాడి వేడి వాదనలు జరిగాయి. మరి క్యాట్ ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ తమ క్యాడర్ కేటాయింపుల ప్రకారం ఏపీ, తెలంగాణకు కేటాయించారు. అయితే, ఇప్పుడు ఆ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లబోమంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆ రాష్ట్రానికి వెళ్లాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామంటూ.. కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, గుమ్మడి సృజన, రొనాల్డ్ రోస్ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
Oct 15 2024, 19:37